విండీస్‌పై టీమిండియా చారిత్రక విజయం

తొలి టెస్ట్‌లో వెస్టిండీస్‌ను చిత్తుగా ఓడించింది టీమిండియా. ఆల్‌రౌండ్ ప‌ర్ఫార్మెన్స్‌తో అద‌ర‌గొట్టిన అశ్విన్ రెండో ఇన్నింగ్స్‌లో ఏడు వికెట్లు తీయ‌డంతో తొలిసారి విండీస్‌పై ఇన్నింగ్స్ విజ‌యం సాధించింది భార‌త్‌. నాలుగోరోజే ఇన్నింగ్స్ 92 ప‌రుగుల తేడాతో ఆతిథ్య జ‌ట్టును చిత్తు చేసింది. ఆసియా బ‌య‌ట భార‌త్‌కిదే అతిపెద్ద విజ‌యం కావ‌డం గ‌మ‌నార్హం. ఈ గెలుపుతో నాలుగు టెస్ట్‌ల సిరీస్‌లో భార‌త్ 1-0 ఆధిక్యంలో నిలిచింది. మ్యాచ్‌లో 113 ప‌రుగులు, ఏడు వికెట్లు తీసిన అశ్విన్ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్‌గా నిలిచాడు.

ఫాలో ఆన్ ఆడుతూ నాలుగో రోజు ఓవ‌ర్‌నైట్ స్కోరు వికెట్ న‌ష్టానికి 21 ప‌రుగుల‌తో రెండో ఇన్నింగ్స్ మొద‌లుపెట్టిన వెస్టిండీస్‌.. 231 ప‌రుగుల‌కే ఆలౌటైంది. శామ్యూల్స్‌, బ్రాత్‌వైట్ హాఫ్ సెంచ‌రీలు చేసినా.. విండీస్‌ను ఇన్నింగ్స్ ఓట‌మి నుంచి తప్పించ‌లేక‌పోయారు. తొలి ఇన్నింగ్స్‌లో వికెట్ తీయ‌లేక‌పోయిన అశ్విన్‌.. రెండో ఇన్నింగ్స్‌లో చెల‌రేగిపోయాడు. మొద‌ట 9 ఓవ‌ర్లు వికెట్ తీయ‌డంలో విఫ‌ల‌మైన అశ్విన్‌.. ఆ త‌ర్వాత వ‌రుస‌గా వికెట్లు తీస్తూ పోయాడు. తొలి ఇన్నింగ్స్‌లో 243 ప‌రుగుల‌కు ఆలౌటైన విండీస్‌.. రెండో ఇన్నింగ్స్‌లోనూ ఏమాత్రం పోరాడ‌లేక‌పోయింది. ఈ నెల 30 నుంచి కింగ్‌స్ట‌న్‌లో రెండో టెస్ట్ మొద‌లవుతుంది.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *