7 లాంచ్ ప్యాడ్స్‌పై దాడి: పకడ్బందీ వ్యూహంతో భారత్

భారత సైన్యం బుధవారం అర్థరాత్రి వేళ పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్‌లోకి ప్రవేశించి ఏడు టెర్రరిస్టు లాంచ్ పాడ్‌లను ధ్వంసం చేసింది. పకడ్బందీ వ్యూహంతో భారత సైన్యం నియంత్రణ రేఖను దాటి మూడు కిలోమీటర్ల దూరం వెళ్లింది. పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ నుంచి భారత్‌లోకి చొరబడి, కాశ్మీర్‌లోనూ దేశంలోని మెట్రో నగరాల్లోనూ దాడులు చేయడానికి ఉగ్రవాదుల పథకాన్ని భగ్నం చేసింది. నియంత్రణ రేఖ వెంబడి ఏడు లాంచ్ పాడ్స్‌ను భారత సైన్యానికి చెందిన స్పెషల్ కమెండోలు ధ్వంసం చేసినట్లు రక్షణ వర్గాలు చెబుతున్నారు. సెప్టెంబర్ 28, 29 తేదీల మధ్య రాత్రి దాదాపు ఐదు గంటల పాటు ఆపరేషన్ సాగింది. లాంచ్ పాడ్స్ నియంత్రణ రేఖను దాటిన తర్వాత పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లో రెండు, మూడు కిలోమిటర్ల దూరంలో ఉన్నాయి.

జమ్మూ కాశ్మీర్‌లోని కుప్వారా, పూంఛ్ నియంత్రణ రేఖ ఆవల ఐదారు ప్రాంతాల్లో సర్జికల్ దాడులు జరిగినట్లు కేంద్ర సమాచార శాఖ మంత్రి వెంకయ్య నాయుడు చెప్పారు. భారత్ వైపు ఏ విధమైన ప్రాణ నష్టం జరగలేదని చెప్పారు. జమ్మూ కాశ్మీర్‌లోకి నియంత్రణ రేఖ వెంబడి ఉగ్రవాదుల చొరబాట్లను పాకిస్తాన్ ప్రోత్సహిస్తోందని, పాకిస్తాన్ తమకు శిక్షణనూ ఆయుధాలను అందిస్తోందని ఇటీవల పట్టుబడిన ఉగ్రవాదులు చెప్పారని, వారి వద్ద నుంచి గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్స్ (జిపిఎస్)ను స్వాధీనం చేసుకున్నామని, దాన్ని బట్టి పాకిస్తాన్ పాత్ర ఉన్నట్లు నిర్ధారణ అవుతోందని మిలిటరీ ఆపరేషన్స్ డైరెక్టర్ జనరల్ (డిజిఎంవో) లెఫ్టినెంట్ జనరల్ రణబీర్ సింగ్ చెప్పారు.గురువారం హడావిడిగా రణబీర్ సింగ్ మీడియా సమావేశం ఏర్పాటు చేసి భారత సైన్యం లాంచ్ పాడ్స్‌పై దాడి చేసిన విషయాన్ని ప్రకటించారు. ఈ సమావేశంలో విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి వికాస్ స్వరూప్ కూడా పాల్గొన్నారు.

యురి ఘటన తర్వాత పాకిస్తాన్‌పై భారత్ పాకిస్తాన్‌పై సైనిక చర్యకు ఇంత పెద్ద యెత్తన దిగడం ఇదే తొలిసారి. లాంచ్ పాడ్స్‌పై తాము దాడి చేసిన విషయాన్ని, చొరబాట్లకు ఉగ్రవాదులు సిద్ధపడిన వైనాన్ని ఆధారాలతో సహా పాకిస్తాన్‌కు తెలియజేసినట్లు రణబీర్ సింగ్ చెప్పారు. గురువారంనాడు పాకిస్తాన్ సైనికులు భారత స్థావరాలను లక్ష్యం చేసుకుని కొద్ది పాటి కాల్పులకు పాల్పడ్డారు.

భారత్ దాడుల గురించి ప్రధాని నరేంద్ర మోడీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి, ఉప రాష్ట్రపతి హమీద్ అన్సారీకి, మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్‌కు తెలియజేశారు. జమ్మూ కాశ్మీర్ గవర్నర్ నరిందర్ నాథ్ వోహ్రాకు, ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీకి కూడా తెలియజేశారు. దాడులను ఆర్మీ చీఫ్‌తో పాటు జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ సమన్వయం చేశారు. దాడులు భీంబర్, హాట్ స్ప్రింగ్, , కేల్, లిపా సెక్టార్లలో జరిగాయి. ఉగ్రవాదులను తటస్థం చేయడానికి మాత్రమే ఈ దాడులకు దిగామని, అంతకు మించిన ఆపరేషన్ చేపట్టే ఉద్దేశం లేదని రణబీర్ సింగ్ చెప్పారు. అయితే, ఉగ్రవాదులు జమ్మూ కాశ్మీర్‌లోనూ దేశంలోని ఇతర ప్రాంతాల్లోనూ దాడులు చేసే ప్రయత్నాలను మాత్రం తిప్పి కొడుతామని చెప్పారు.

పక్కా సమాచారం మేరకే...
నిఘా విభాగాల నుంచి విశ్వసనీయమైన, పక్కా సమాచారం అందుకున్న తర్వాతనే తాము దాడులు చేశామని రణబీర్ సింగ్ చెప్పారు. జమ్మూ కాశ్మీర్‌లోనూ భారతదేశంలోని మెట్రో నగరాల్లో దాడులకు ప్లాన్ చేసే సమాచారాన్ని నిఘా విభాగాలు తమకు అందించాయని చెప్పారు. భారతదేశంలోని ఉగ్రవాదుల చొరబాటును నిరోధించడానికి, అలా చొరబడి భారతదేశంలో దాడులు చేసే ప్రయత్నాలను అడ్డుకోవడానికి మాత్రమే ఈ ఆపరేషన్ చేపట్టినట్లు ఆయన చెప్పారు. భారత పౌరుల ప్రాణాలకు నష్టం వాటిల్లకుండా చూడడంలో భాగంగానే ఈ దాడులు జరిగాయని అన్నారు.

ఏ పరిస్థితి తలెత్తినా…

ఎటువంటి పరిస్థితి తలెత్తినా ఎదుర్కోవడానికి, తిప్పికొట్టడానికి భారత సైన్యం సిద్ధంగా ఉందని ఆయన చెప్పారు. నియంత్రణ రేఖ వెంబడి చొరబాట్లు కొనసాగడమే కాకుండా పెరిగాయని, పూంఛ్, యురి సంఘటనలు ఈ విషయాన్ని నిర్ధారిస్తున్నాయని రణబీర్ సింగ్ చెప్పారు. దాడుల సందర్భంగా తమకు చిక్కిన ఉగ్రవాదులు పాకిస్తాన్ జాతీయులని రణబీర్ సింగ్ చెప్పారు. వారు పాకిస్తాన్‌లో శిక్షణ పొందినట్లు తెలిపారు. 2004లో తెలిపిన అంగీకారానికి కట్టుబడి ఉండాలని ఎన్ని విజ్ఞప్లు చేసినా పాకిస్తాన్ పెడ చెవిన పెడుతోందని, పాకిస్తాన్ భూభాగంలో భారతదేశానికి వ్యతిరేకంగా ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తోందని, దాన్ని సహించబోమని అన్నారు. భారత సైనికుల కృషి వల్ల నష్టం చాలా తక్కువగా జరిగిందని చెప్పారు. శాంతిసామరస్యాలను కాపాడాలనే లక్ష్యంతో భాత్ ఉందని, అయితే నియంత్రణ రేఖ వెంబడి పాకిస్తాన్ ఉగ్రవాద చర్యలను పాకిస్తాన్ ప్రోత్సహిస్తే సహించేది లేదని అన్నారు. ఉగ్రవాదాన్ని అంతం చేయడానికి పాకిస్తాన్ సైన్యం సహకరిస్తుందని ఆశిస్తున్నట్లు ఆయన తెలిపారు

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *