ఆసియా కప్‌లో భారత్ హ్యాట్రిక్

ఆసియా కప్‌లో ఆది నుంచి ఆధిపత్యం ప్రదర్శిస్తున్న టీమ్ ఇండియా అనుకున్నట్టుగానే ఫైనల్లో అడుగుపెట్టింది. హ్యాట్రిక్ విజయాలతో ఫైనల్ బెర్త్‌ను ఖరారు చేసుకుంది. మంగళవారమిక్కడ శ్రీలంకతో జరిగిన రౌండ్ రాబిన్ మ్యాచ్‌లో భారత్ 5 వికెట్లతో సునాయాసంగా గెలుపొందింది. లంక నిర్దేశించిన 139 పరుగుల స్వల్ప లక్ష్య ఛేదనలో భారత్.. కోహ్లీ (47 బంతుల్లో 7 ఫోర్లతో 56 నాటౌట్) అజేయ అర్ధసెంచరీ నెలకొల్పడంతో పాటు యువరాజ్ సింగ్ (18 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్‌లతో 35) తన ైస్టెల్లో ధమాకా ఇన్నింగ్స్ ఆడడంతో 19.2 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి ఏకంగా 142 రన్స్ చేసి విజయాన్నందుకుంది. 16 పరుగులకే ఓపెనర్లు ధవన్ (1), రోహిత్ (15)లు పెవిలియన్ చేరడంతో లంక ఇన్నింగ్స్‌ను అనుకరిస్తున్నట్టు అనిపించినా, కోహ్లీ మూడో వికెట్‌కు రైనా (25)తో కలిసి 47 బంతుల్లో 54 పరుగులు, నాలుగో వికెట్‌కు యువరాజ్‌తో కలిసి 34 బంతుల్లో 51 పరుగులు జోడించి జట్టును గెలుపు బాట పట్టించాడు. ఇక చివర్లో ధోనీ (7 నాటౌట్) తన శైలిలో మెరుపు సిక్స్ కొట్టి అలరించాడు. లంక బౌలర్లలో కులశేఖరకు 2, పెరెర, హెరాత్, షనకకు ఒక్కో వికెట్ దక్కింది. అంతకుముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంక.. భారత బౌలర్లు జస్ప్రీత్ బుమ్రా (2/27), హార్దిక్ పాండ్యా (2/26), స్పిన్నర్ అశ్విన్ (2/26)ల ధాటికి నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 138 పరుగులే చేయగలిగింది.

31 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయిన లంకను చూస్తే అసలు వంద మార్కునైనా అందుకుంటుందా అన్న అనుమానం కలిగింది. అయితే నాలుగో వికెట్‌కు కెప్టెన్ మథ్యూస్ (18)తో కలిసి చమర కపుగెదర (30) 26 పరుగులు, సిరివర్దన (17 బంతుల్లో 22)తో కలిసి ఐదో వికెట్‌కు 31 బంతుల్లో 43 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి జట్టు గౌరవప్రదర స్కోరుకు బాటలు వేశాడు. ఇక 17.2 ఓవర్లలో 105 పరుగులకే 7 వికెట్లు కోల్పోయిన దశలో లంక 120 పరుగుల మార్కు దాటుతుందని ఊహించకపోయినా, చివర్లో తిసర పెరెర (6 బంతుల్లో 17), కులశేఖర (9బంతుల్లో 13) మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడడంతో ఈ స్కోరు సా ధ్యమైంది. ఈ జోడీ మెరుపులకు చివరి మూడు ఓవర్లలో 34 పరుగులు రావ డం విశేషం. భారత బౌలర్లలో వెటరన్ పేసర్ నెహ్రా కూ ఓ వికెట్ దక్కింది. కోహ్లీకే మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ దక్కింది.

Videos

Leave a Reply

Your email address will not be published.