మూడో వన్డేలో భారత్ గెలుపు – కోహ్లీ, ధోనీ వీరోచిత ప్రదర్శన

కీలక ఆటగాడి క్యాచ్‌ను మిస్ చేస్తే ఫలితం ఎలా ఉంటుందో న్యూజిలాండ్‌కు తెలిసొచ్చింది. 2 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద విరాట్ కోహ్లీ (134 బంతుల్లో 154; 16 ఫోర్లు, 1 సిక్స్) ఇచ్చిన క్యాచ్‌ను స్లిప్‌లో టేలర్ మిస్ చేయడంతో గొప్ప మూల్యమే చెల్లించుకుంది. లక్ష్య ఛేదనలో ధోనీ (91 బంతుల్లో 80; 6 ఫోర్లు, 3 సిక్సర్లు) కూడా సమర్థవంతమైన పాత్రను పోషించడంతో.. ఆదివారం జరిగిన మూడో వన్డేలో భారత్ 7 వికెట్ల తేడాతో కివీస్‌పై ఘన విజయం సాధించింది. దీంతో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో టీమ్‌ఇండియా 2-1తో ఆధిక్యంలో నిలిచింది. ముందుగా బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 49.4 ఓవర్లలో 285 పరుగులకు ఆలౌటైంది. లాథమ్ (72 బంతుల్లో 61; 3 ఫోర్లు, 1 సిక్స్), నీషమ్ (47 బంతుల్లో 57; 7 ఫోర్లు), టేలర్ (57 బంతుల్లో 44; 4 ఫోర్లు, 1 సిక్స్) రాణించారు. తర్వాత భారత్ 48.2 ఓవర్లలో 3 వికెట్లకు 289 పరుగులు చేసింది. కోహ్లీకి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. ఇరుజట్ల మధ్య నాలుగో వన్డే బుధవారం రాంచీలో జరుగుతుంది.

ఆఖర్లో జోరు..:

ఈ టూర్‌లో వరుసగా ఏడోసారి టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన కివీస్ ఇన్నింగ్స్‌లో గప్టిల్ (27), విలియమ్సన్ (22) నిరాశపర్చగా, లాథమ్, టేలర్‌లు చెలరేగి ఆడారు. దీంతో తొలి 10 ఓవర్లలో ఆరు రన్‌రేట్‌తో 64 పరుగులు నమోదయ్యాయి. భారత బౌలింగ్‌ను సమర్థంగా ఎదుర్కొంటూ ఈ ఇద్దరూ ఫోర్లు, సిక్స్‌తో అలరించారు. దీంతో మూడో వికెట్‌కు 73 పరుగులు సమకూరాయి. అయితే నిలకడగా సాగుతున్న కివీస్ ఇన్నింగ్స్‌కు మిశ్రా (2/46), జాదవ్ (3/29) ఒక్కసారిగా బ్రేక్ వేశారు. కేవలం 21 బంతుల వ్యవధిలో టేలర్, అండర్సన్ (6), రోంచి (1), లాథమ్‌లను అవుట్ చేసి షాకిచ్చారు. ఈ దశలో నీషమ్ మెరుగ్గా ఆడినా.. రెండో ఎండ్‌లో పేసర్లు బుమ్రా (2/52), ఉమేశ్ (3/75) కట్టుదిట్టమైన బంతులతో భయపెట్టారు. ఫలితంగా స్వల్ప వ్యవధిలో సాంట్నెర్ (7), సౌతీ (13) వికెట్లు పడగొట్టి ఒత్తిడి పెంచారు. దీంతో ఓ దశలో 152/2 స్కోరుతో పటిష్ఠ స్థితిలో ఉన్న పర్యాటక జట్టు కేవలం తొమ్మిది ఓవర్ల తేడాలో 199/8కి పడిపోయింది. అయితే ఈ అవకాశాన్ని భారత్ సద్వినియోగం చేసుకోలేకపోయింది. అప్పటికే క్రీజులో పాతుకుపోయిన నీషమ్, కొత్తగా వచ్చిన హెన్రీ (37 బంతుల్లో 39, 4 ఫోర్లు, 1 సిక్స్)తో కలిసి ఎదురుదాడి ప్రారంభించాడు. భారీ షాట్లు కొడుతూ రన్‌రేట్‌ను ఆమాంతం పెంచేశాడు. 49వ ఓవర్‌లో ఓ సిక్స్, రెండు ఫోర్లతో 15 పరుగులు రాబట్టి అవుటయ్యాడు. ఈ ఇద్దరు తొమ్మిదో వికెట్‌కు 84 పరుగులు జోడించడంతో కివీస్‌కు భారీ స్కోరు సాధ్యమైంది.

సారథుల నిలకడ: లక్ష్య ఛేదనకు బరిలోకి దిగిన రోహిత్ (13) తొలి ఓవర్‌లోనే రెండు ఫోర్లతో ఖాతా తెరిచాడు. క్రీజులో ఇబ్బందిగా కదిలిన రహానే (5) మాత్రం మూడో ఓవర్‌లోనే వెనుదిరిగాడు. వన్‌డౌన్‌లో వచ్చిన కోహ్లీ రెండు పరుగుల వద్ద ఇచ్చిన క్యాచ్‌ను స్లిప్‌లో టేలర్ మిస్ చేసినా… వెంటనే రోహిత్ వికెట్ తీసి కివీస్ సంబురాలు చేసుకుంది. జట్టు స్కోరు 41/2 స్కోరు ఉన్న దశలో క్రీజులోకి వచ్చిన ధోని.. కోహ్లీతో కలిసి కమాల్ చేశాడు. అడపాదడపా ఫోర్లు కొట్టినా.. 17వ ఓవర్‌లో సాంట్నెర్‌కు ధోని సిక్సర్ రుచిచూపెట్టాడు. ఈ క్రమంలో విరాట్ 59 బంతుల్లో అర్ధసెంచరీ పూర్తి చేసుకోగా, ధోనీ రెండో సిక్సర్లతో రెచ్చిపోయి రెండు ఘనతలను సొంతం చేసుకున్నాడు. ఈ ఇద్దరి నిలకడతో భారత్ స్కోరు 30 ఓవర్లలో 159/2కు చేరింది. అర్ధసెంచరీ తర్వాత (64 బంతులు) ధోనీ వేగం తగ్గిస్తే.. రెండో ఎండ్‌లో విరాట్ జోరందుకున్నాడు.

అయితే 36వ ఓవర్‌లో హెన్రీ వేసిన లెంగ్త్ బంతిని ఆడబోయిన ధోనీ షార్ట్ కవర్‌లో టేలర్ చేతికి చిక్కాడు. దీంతో మూడో వికెట్‌కు 27.1 ఓవర్లలో నెలకొన్న 151 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. ఈ దశలో ఎక్కువగా స్ట్రయికింగ్ చేసిన విరాట్ 104 బంతుల్లో శతకం పూర్తి చేశాడు. మనీష్ పాండే (28 నాటౌట్) కూడా దూకుడుగా ఆడటంతో భారత్ లక్ష్య ఛేదన మరింత సులువైంది. 18 బంతుల్లో 24 పరుగులు చేయాల్సిన దశలో కోహ్లీ… బౌల్ట్ వేసిన 48వ ఓవర్‌లో మూడు ఫోర్లు, ఓ సిక్స్‌తో 22 పరుగులు రాబడితే.. తర్వాతి ఓవర్‌లో పాండే ఫోర్‌తో విజయలాంఛనం పూర్తి చేశాడు. ఈ ఇద్దరు నాలుగో వికెట్‌కు అజేయంగా 97 పరుగులు జోడించారు.
ధోనీ @ 9000
కెప్టెన్ ధోనీ వన్డేల్లో 9 వేల పరుగుల క్లబ్‌లో చేరాడు. కివీస్‌తో జరిగిన మూడో వన్డేలో సాంట్నెర్ బౌలింగ్ (17వ ఓవర్)లో భారీ సిక్సర్‌తో ఈ ఘనత అందుకున్నాడు. దీంతో భారత్ తరఫున ఈ మైలురాయిని అందుకున్న ఐదో బ్యాట్స్‌మన్‌గా రికార్డులకెక్కాడు. సచిన్, గంగూలీ, ద్రవిడ్, అజారుద్దీన్‌లు ఇతనికంటే ముందున్నారు. అయితే ఈ ఘనత సాధించిన వికెట్ కీపర్లలో ధోనీది మూడో స్థానం. సంగక్కర, గిల్‌క్రిస్ట్‌లు టాప్-2లో ఉన్నారు.

Videos

11 thoughts on “మూడో వన్డేలో భారత్ గెలుపు – కోహ్లీ, ధోనీ వీరోచిత ప్రదర్శన

Leave a Reply

Your email address will not be published.