ఈడెన్‌లో భారత్-పాక్ మ్యాచ్

ఐసీసీ వరల్డ్ టీ20 టోర్నమెంట్‌లో భారత్-పాకిస్థాన్ జట్ల మధ్య మార్చి 19న జరగనున్న మ్యాచ్‌ను కోల్‌క‌త్తాకు మార్చారు. పాకిస్థాన్ క్రికెట్ బోర్డు భద్రతా కారణాలపై అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో ఐసీసీ ఈ మేరకు బుధవారం నిర్ణయం తీసుకుంది. నిజానికి టోర్నీ షెడ్యూల్ ప్రకారం ఇరు జట్ల మధ్య జరగాల్సిన మ్యాచ్‌ని హిమాచల్ ప్రదేశ్‌లోని ధర్మశాల స్టేడియాన్ని ఐసీసీ ఖరారు చేసింది. అయితే ధర్మశాల వేదిక నుంచి వేరే ప్రాంతానికి మార్చాలని పీసీబీ పంపించిన ఇద్దరు సభ్యుల బృందం సిఫారసు చేయడంతో ధర్మశాల నుంచి వేరే వేదికకు మ్యాచ్‌ని మార్చాలని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) ఐసీసీని కోరింది.

అయితే స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి భద్రతపై సందేహం పెంచేలా చేసిన వ్యాఖ్యలతో సమస్య మొదలైంది. మరికొంత మంది మ్యాచ్‌కు అడ్డంకులు సృష్టిస్తామని కూడా బెదిరించారు. అన్ని వర్గాల రక్షణ బాధ్యత మాపై ఉంది. ఐసీసీ భద్రతా అధికారులతో పాటు పీసీబీ సూచనలను కూడా పరిగణనలోకి తీసుకున్నాం. వేదిక మార్చడం తప్ప మాకు మరో ప్రత్యామ్నాయం లేకపోయింది’ అని ఐసీసీ సీఈ డేవ్ రిచర్డ్సన్ వ్యాఖ్యానించారు. భారత్‌లాంటి పెద్ద దేశంలో పరిస్థితుల గురించి తమకు తెలుసని, ఐసీసీ ఈవెంట్ల నిర్వహణ సమయంలో అనేక సవాళ్లు ఎదురు కావడం సహజమేనన్న రిచర్డ్సన్… బీసీసీఐపై ఎలాంటి చర్య తీసుకునే అవకాశం లేదన్నారు. ఐసీసీ నిర్ణయాన్ని పీసీబీ చైర్మన్ షహర్యార్ ఖాన్ స్వాగతించారు. మరోవైపు ఇప్పటికే ధర్మశాల మ్యాచ్‌కు టికెట్లు పొందినవారికి ఆసక్తి ఉంటే కోల్‌కతాకు అవే టికెట్లను అనుమతిస్తామని, లేదంటే పూర్తి మొత్తం వెనక్కి ఇస్తామని కూడా రిచర్డ్సన్ చెప్పారు.

 

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *