వెస్టిండీస్‌తో రెండో టెస్ట్ నేటి నుంచి

వెస్టిండీస్‌తో సిరీస్‌లో ఆంటిగ్వా టెస్టును నాలుగురోజుల్లోనే గెలుచుకుని నాలుగు టెస్టుల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో నిలిచిన భారత్ రెండో టెస్టుకు రెడీ అయింది. పేస్, బౌన్స్‌కు అనుకూలించే సబీనాపార్క్‌లో విండీస్ పేస్ బౌలింగ్‌ను ఎదుర్కోనుంది. శనివారం నుంచి ప్రారం భం కానున్న ఈ టెస్టులో ఫేవరెట్‌గా బరిలోకి దిగుతున్న కోహ్లీ సేనకు బౌన్సీ పిచ్‌పై ఇబ్బందులు తప్పేలా లేవు. వెస్టిండీస్ బ్యాటింగ్ బలహీనంగా కనిపిస్తున్నా బౌలింగ్‌లో కెప్టెన్ హోల్డర్‌కు తోడుగా తొలిటెస్టులో రాణించిన షానన్ గాబ్రియెల్, కమ్మిన్స్‌కు జతగా అండర్ -19 ప్రపంచకప్‌లో రాణించిన యువ ఆల్‌రౌండర్ జోసెఫ్ కింగ్‌స్టన్‌లో భారత్‌కు చుక్కలు చూపించే అవకాశముంది. గంటకు 90 మైళ్లకు పైగా వేగంతో బంతులు విసిరే జోసెఫ్‌ను ఎదుర్కోవడం కోహ్లీ సేనకు సవాల్. పైగా కోహ్లీ, ధావన్ మినహా టాపార్డర్ అంతగా ఫాంలో లేకపోవడం భారత శిబిరంలో ఆందోళన కలిగిస్తున్నది.

ఓపెనర్ విజయ్ గాయంతో బాధ పడతుండగా పుజారా, రహానే పరుగులు చేయడంలో ఇబ్బంది పడుతున్నారు. మరోవైపు అశ్విన్ సూపర్ సెంచరీతో ఆకట్టుకోగా అమిత్ మిశ్రా కీలక పరుగులు చేసి అదరహో అనిపించారు. అయితే పేస్‌కు అనుకూలించే పిచ్‌పై ఇద్దరు స్పిన్నర్లు ఆడడం అనుమానమే. ఇక విండీస్ బ్యాటింగ్‌లో బ్రాత్‌వైట్, శామ్యూల్స్, బ్రావో మినహా అంతగా అనుభవం లేకపోవడం భారత్‌కు కలిసి వచ్చే అంశమే. ఇక బౌలింగ్‌లో ఇషాంత్, షమీ, ఉమేశ్‌లకు తోడుగా నాలుగో పేసర్ బరిలో ఉంటే విండీస్‌కు కష్టాలు తప్పవు. కోచ్‌గా తొలిటూర్‌లోనే కుంబ్లే జట్టుపై తనదైన ముద్ర వేస్తూ జట్టులో స్ఫూర్తిని రగిలిస్తున్నాడు. టీమ్ ఇండియా బ్యాట్స్‌మన్ రాణిస్తే రెండో టెస్టులో విజయంతో 2-0 ఆధిక్యం సాధించి సిరీస్‌లో ముందంజ వేయడం ఖాయం.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *