సిరీస్ 3-0తో టీమ్‌ఇండియా కైవసం

ఆఖరి వన్డేలో కూడా జింబాబ్వే తలరాత మారలేదు. సిరీస్‌లో తొలిసారి టాస్ నెగ్గి బ్యాటింగ్ ఎంచుకున్న ఈ ఆఫ్రికా పసికూన.. కట్టుదిట్టమైన భారత బౌలింగ్ ధాటికి 123 పరుగులకే కుప్పకూలింది. బుమ్రా(4/22) జింబాబ్వే పతనంలో కీలకమయ్యాడు. స్వల్పలక్ష్యఛేదనలో ఓపెనర్లు రాహుల్(63 నాటౌట్), ఫయాజ్ ఫజల్(55 నాటౌట్) అజేయ అర్ధసెంచరీలతో కదం తొక్కడంతో టీమ్‌ఇండియా 10 వికెట్ల తేడాతో భారీ విజయాన్నందుకుంది. వీరిద్దరు పసలేని జింబాబ్వే బౌలింగ్‌ను అలవోకగా ఎదుర్కొవడంతో ధోనీసేన వికెట్ నష్టపోకుండా 28ఓవర్లు మిగిలుండగానే లక్ష్యాన్ని ముద్దాడింది. సిరీస్ అసాంతం తన అద్భుత బ్యాటింగ్‌తో అలరించిన రాహుల్‌కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్‌తో పాటు మ్యాన్ ఆఫ్ ద సిరీస్ దక్కింది. ఇరుజట్ల మధ్య మూడు టీ20 మ్యాచ్‌ల సిరీస్ ఈనెల 18న మొదలుకానుంది.

లక్ష్యం అలవోకగా:
జింబాబ్వే నిర్దేశించిన 124 పరుగుల లక్ష్యఛేదనను టీమ్‌ఇండియా అలవోకగా ఛేదించింది. అంతగా నాణ్యతలేని జింబాబ్వే బౌలర్లను ఓ ఆటాడుకుంటూ ఓపెనర్లు రాహుల్(70 బంతుల్లో 63 నాటౌట్), ఫజల్(61 బంతుల్లో 55 నాటౌట్) అజేయ అర్ధసెంచరీలతో రాణించారు.
సూపర్‌ఫామ్‌ను కొనసాగిస్తూ చెలరేగిన రాహుల్ తన ఇన్నింగ్స్‌లో 4ఫోర్లు, రెండు భారీ సిక్స్‌లతో అలరించాడు. ఈ క్రమంలో వన్డే అరంగేట్రం చేసిన ఫజల్‌తో కలిసి రాహుల్ మైదానం నలువైపులా చూడచక్కని షాట్లతో ఆకట్టుకున్నాడు. తానేం తక్కువ కాదన్నట్లు ఫజల్ కూడా బ్యాటు ఝలిపించడంతో ఛేదించాల్సిన లక్ష్యం త్వరగా కరిగిపోయింది. కరుణ్ నాయర్ స్థానంలో టీమ్‌ఇండియా తరుఫున వన్డేల్లోకి అరంగేట్రం చేసిన 30 ఏండ్ల ఫజల్ తనకు దక్కిన అవకాశాన్ని అర్ధసెంచరీతో రాణించి సత్తాచాటాడు. ఇలా రాహుల్, ఫజల్ కలిసి తొలి వికెట్‌కు 126 పరుగుల అజేయ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.

పేకమేడలా జింబాబ్వే:
జింబాబ్వే బ్యాటింగ్ పతనమైన తీరు పేకమేడను తలపించింది. ఓ దశలో సాఫీగా సాగినట్లు కనిపించిన బ్యాటింగ్..బుమ్రా(4/22) ధాటికి 42.2 ఓవర్లలో 123 రన్స్‌కే కుప్పకూలింది. ఓపెనర్ చిబాబ(27), సిబంద(38), మరుమ(17) ఈ ముగ్గురే జింబాబ్వే జట్టులో చెప్పుకోదగ్గ బ్యాటింగ్ చేశారు. మిగతా వారు క్రీజులో నిలదొక్కుకోవడానికి సతమతమయ్యారు. బుమ్రాకు తోడు లెగ్‌స్పిన్నర్ చాహల్ (2/25), కులకర్ణి(1/17), అక్షర్(1/16) కూడా వికెట్లవేటలో భాగం కావడంతో జింబాబ్వే మళ్లీ స్వల్పస్కోరుకే పరిమితమైంది.

4 బంతుల్లో 4 వికెట్లు
జింబాబ్వే ఇన్నింగ్స్‌లో అరుదైన దృశ్యం ఆవిష్కృతమైంది. బుమ్రా వేసిన ఇన్నింగ్స్ 33వ ఓవర్లో ఇది చోటుచేసుకుంది. ఈ ఓవర్ ఆఖరి రెండు బంతుల్లో మరుమ,చిగుంబుర ఔటయ్యారు. ఆ తర్వాత అక్షర్‌పటేల్ వేసిన ఓవర్ తొలి రెండు బంతుల్లో వాలర్, కెప్టెన్ గ్రేమ్ క్రెమర్ పెవిలియన్ చేరారు. దీంతో వరుసగా నాలుగు బంతుల్లో నలుగురు జింబాబ్వే బ్యాట్స్‌మెన్ ఔటయ్యారు. ఇందులో ఒక రనౌట్ కూడా ఉంది. ఇక్కడే జింబాబ్వే ఇన్నింగ్స్ పతనానికి నాందిపడింది. దీంతో చివరకు 123 పరుగులకే ఆలౌట్ కావాల్సి వచ్చింది.

స్కోరుబోర్డు
జింబాబ్వే: మసకద్జ(సి)రాహుల్(బి)కులకర్ణి 8, చిబాబ(సి)బుమ్రా(బి)చాహల్ 27, సిబంద (సి&బి) చాహల్ 38, మరుమ(బి)బుమ్రా 17, వాలర్ రనౌట్(రాహుల్/ధోనీ) 8, చిగుంబుర(సి)ధోనీ(బి)బుమ్రా 0, ముతుంబమి(సి)రాహుల్(బి)బుమ్రా 4, క్రెమర్(ఎల్బీ)అక్షర్‌పటేల్ 0, మద్జీవ 10 నాటౌట్, ముపరివ(సి)మనీశ్‌పాండే(బి)బుమ్రా 1, తిరిపానో (రనౌట్/కులకర్ణి) 2; ఎక్స్‌ట్రాలు: 8; మొత్తం: 42.2ఓవర్లలో 123 ఆలౌట్; వికెట్ల పతనం: 1-19, 2-55, 3-89, 4-104, 5-104, 6-104, 7-104, 8-108, 9-110, 10-123; బౌలింగ్: స్రాన్ 8-0-40-0, కులకర్ణి 6.2-1-17-1, బుమ్రా 10-1-22-4, అక్షర్‌పటేల్ 10-2-16-1, చాహల్ 8-0-25-2.

భారత్: రాహుల్ (63 నాటౌట్), ఫజల్ (55 నాటౌట్); ఎక్స్‌ట్రాలు: 8; మొత్తం: 21.5 ఓవర్లలో 126; బౌలింగ్: తిరిపానో 5-1-15-0, మద్జీవ 5-0-25-0, ముపరివ 6-0-43-0, క్రెమర్ 4-0-26-0, చిబాబ 1.5-0-15-0.

Videos

Leave a Reply

Your email address will not be published.