చెన్నైలోనూ ఇంగ్లండ్ పై టీమిండియా ప్రతీకార విజయం

ఇంగ్లండ్ పై టీమిండియా ప్రతీకార విజయం సాధించింది. చెన్నైలో జరిగిన చివరి టెస్టులోనూ కోహ్లి సేన ఇన్నింగ్స్ 75 పరుగుల తేడాతో విజయం సాధించి ఐదు టెస్టుల సిరీస్ ను 4-0తో ఎగరేసుకుపోయింది. చివరి రోజు లంచ్ తర్వాత చెలరేగిన టీమిండియా బౌలర్లు.. రెండో ఇన్నింగ్స్ లో ఇంగ్లండ్ ను 207 పరుగులకే ఆలౌట్ చేశారు. లెఫ్టామ్ స్పిన్నర్ రవీంద్ర జడేజా ఏడు వికెట్లతో చెలరేగాడు. సొంతగడ్డపై చివరి రోజు స్పిన్ కు సహకరించే పిచ్ పై అశ్విన్ నిరాశపరచినా.. జడేజా ఆ బాధ్యతలను విజయవంతంగా నిర్వర్తించాడు.

వందకుపైగా భాగస్వామ్యంతో భారత బౌలర్లను విసిగించిన ఇంగ్లండ్ ఓపెనర్లు కుక్, జెన్నింగ్స్ తో పాటు డేంజరస్ బ్యాట్స్ మెన్ రూట్, మొయిన్ అలీ, స్టోక్స్, బ్రాడ్ లను కూడా జడేజానే ఔట్ చేశాడు. మరో బ్యాట్స్ మన్ బెయిర్ స్టోను ఓ అద్భుతమైన క్యాచ్ తో వెనక్కి పంపించాడు. రెండో ఇన్నింగ్స్ లో మొత్తం ఏడు వికెట్లు తీసిన జడేజా.. మ్యాచ్ లో పది వికెట్లతో విజయంలో కీలకపాత్ర పోషించాడు.

చివరి రోజు లంచ్ వరకు ఇంగ్లండ్ తీవ్రంగా ప్రతిఘటించింది. తొలి సెషన్ లో ఒక్క వికెట్ కూడా పడకపోవడంతో మ్యాచ్ డ్రా అవుతుందన్న అనుమానం కలిగింది. అయితే లంచ్ తర్వాత పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. ఇంగ్లండ్ కెప్టెన్ అలిస్టర్ కుక్ (49)ను ఔట్ చేసిన జడేజా.. ఇంగ్లండ్ పతనానికి నాంది పలికాడు. ఆ వెంటనే మరో ఓపెనర్ జెన్నింగ్స్ (54)ను కూడా పెవిలియన్ కు పంపాడు.

తర్వాత కాసేపటికే డేంజరస్ బ్యాట్స్ మన్ రూట్ (6)ను వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు జడేజా. ఇక ఈ సిరీస్ లో కాస్తోకూస్తో రాణించిన బ్యాట్స్ మన్ బెయిర్ స్టో (1)ను ఓ అద్భుతమైన క్యాచ్ తో జడేజానే ఔట్ చేయడం విశేషం. టీ సమయానికి 4 వికెట్లకు 167 పరుగులతో ఉన్న ఇంగ్లండ్ ను.. టీ తర్వాత మరింత దెబ్బ తీశాడు జడేజా.

చివరి సెషన్ లో ఆరు వికెట్లు పడగా.. అందులో నాలుగు జడేజా ఖాతాలోకే వెళ్లాయి. మొయిన్ అలీ, స్టోక్స్, బ్రాడ్, బాల్ లను జడ్డూ ఔట్ చేశాడు. మ్యాచ్ మరో అరగంటలో ముగుస్తుందనగా.. టీమిండియా ఇన్నింగ్స్ 75 పరుగుల తేడాతో విజయం సాధించింది.

స్కోర్లు: ఇంగ్లండ్ 477 & 207 (జడేజా 7/48)
ఇండియా 759/7 డిక్లేర్డ్ (కరుణ్ నాయర్ 303 నాటౌట్, రాహుల్ 199)

Videos

Leave a Reply

Your email address will not be published.