వెస్టిండీస్ పై మొదటి టెస్టు ఘనా విజయం

విండీస్‌ టూర్‌లో టీమిండియా అదరగొడుతోంది. టీమిండియా-వెస్ట్టిండీస్‌ మధ్య జరిగిన తొలి టెస్టులో కోహ్లీ సేన 318 పరుగుల తేడాతో నెగ్గింది. ఆల్‌ రౌండ్‌ ప్రదర్శనతో ఆకట్టుకున్న కోహ్లీ సేన 1-0తేడాతో ముందంజలో ఉంది. ఫాస్ట్ బౌలర్ బుమ్రా(5/7)విజృంభించడంతో వెస్టిండీస్‌తో జరిగిన తొలి టెస్టులో భారత్‌ 318 పరుగుల తేడాతో భారీ విజయాన్ని నమోదు చేసింది. బుమ్రాతో పాటు పేస్‌ బౌలర్లు ఇషాంత్‌ శర్మ 3/31, షమి 2/13 చెలరేగడంతో 419 పరుగుల ఛేదనలో వెస్టిండీస్‌ 100 పరుగులకే కుప్పకూలింది. అంతకుముందు 185/3 తో నాలుగో రోజు ఆట మొదలుపెట్టిన భారత్‌ మరో 158పరుగులు జోడించి 343/7 స్కోరు వద్ద డిక్లేర్‌ చేసింది. లక్ష్య ఛేదనకు దిగిన విండీస్‌ను బుమ్రా భయపెట్టాడు. పదునైన బంతులతో బ్యాట్స్‌మెన్‌ను నిలువరించాడు. మరో బౌలర్‌ ఇషాంత్‌ కూడా వైవిధ్యమైన బంతులతో ఆకట్టుకున్నాడు. వీరి ధాటికి టీ విరామానికి 15 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది కరీబియన్‌ జట్టు. ఆ తర్వాత వీరికి షమి కూడా తోడు కావడంతో విండీస్‌ ఓటమి ఖాయమైంది. నాలుగో రోజు ఆటలో రెండో ఓవర్‌లోనే చేజ్‌ బౌలింగ్‌లో కెప్టెన్‌ కోహ్లీ(51) ఔట్‌ అయ్యాడు. తర్వాత వచ్చిన విహారితో.. రహానె ఇన్నింగ్స్‌ను ముందుకు తీసుకెళ్లాడు.  అజింక్య రహానె(102, 242 బంతుల్లో 5×4) శతకం సాధించగా.. హనుమ విహారి(93; 128బంతుల్లో 10×4, 1×6) చక్కటి ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. రెండో టెస్టు శుక్రవారం కింగ్‌స్టన్‌లో జరగనుంది.

Videos