లంక పై విజయం తో మళ్లీ నెం 1 పదిలం చేసుకున్న ధోనీసేన

టీ20 ఫార్మాట్‌లో ధోనీసేన వరుస సిరీస్ విజయాల పరంపర కొనసాగుతూనే ఉంది. ఆస్ట్రేలియాను వారి సొంతగడ్డపైనే క్లీన్‌స్వీప్ చేసి నంబర్‌వన్ ర్యాంక్ దక్కించుకున్న టీమ్‌ఇండియా తాజాగా శ్రీలంకను చిత్తు చిత్తు చేసింది. వైజాగ్‌లోని ఏసీఏ-వీడీసీఏ స్టేడియం వేదికగా ఆదివారం జరిగిన ఆఖరి మ్యాచ్‌లో ధోనీసేన 9 వికెట్లతో భారీ విజయం సాధించి 2-1తో సిరీస్‌ను కైవసం చేసుకుంది. కుర్ర లంక చేతిలో పుణె(తొలి మ్యాచ్)లో ఎదురైన పరాభవానికి ధోనీసేన ప్రతీకారం తీర్చుకుంది. శ్రీలంక నిర్దేశించిన 83 పరుగుల స్వల్ప లక్ష్యఛేదనలో టీమ్‌ఇండియా వికెట్ చేజార్చుకుని మరో 37 బంతులు మిగిలుండగానే విజయాన్నందుకుంది. ఇన్‌ఫామ్ బ్యాట్స్‌మన్ శిఖర్ ధవన్(46 నాటౌట్) మరోసారి బాధ్యాతయుత ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. మైదానం నలువైపులా చూడచక్కని షాట్లతో అలరించిన ధవన్..రహానే (22 నాటౌట్)తో కలిసి జట్టును గెలిపించాడు. ఓపెనర్ రోహిత్‌శర్మ 13 పరుగులకే చమీరా బౌలింగ్‌లో ఎల్బీగా వెనుదిరిగాడు. సిరీస్‌లో 9 వికెట్లతో పాటు బ్యాటింగ్‌లోనూ ఆకట్టుకున్న అశ్విన్‌కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్‌తో పాటు మ్యాన్ ఆఫ్ ద సిరీస్ దక్కింది.

లంక టపాటపా: టాస్‌నెగ్గిన టీమ్‌ఇండియా కెప్టెన్ ధోనీ ఏ తడబాటు లేకుండా తొలుత శ్రీలంకను బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. ఇక్కడే టీమ్‌ఇండియా విజయానికి తొలి అడుగుపడింది. భారత స్పిన్ త్రయం అశ్విన్ (4-1-8-4), జడేజా(1/11), రైనా(2/6) విజృంభణతో లంక 18 ఓవర్లలో 82 పరుగులకే కుప్పకూలింది. అంతర్జాతీయ టీ20ల్లో లంకకు ఇదే అత్యల్ప స్కోరు కావడం విశేషం. ఇంతకుముందు ఆస్ట్రేలియాపై 2010లో 87 పరుగులే లంకకు ఇప్పటివరకు తక్కువ స్కోరు. లంక పతనంలో టీమ్‌ఇండియా టాప్‌స్పిన్నర్ అశ్విన్ కీలకంగా వ్యవహరించాడు. తాను వేసిన ఇన్నింగ్స్ తొలి ఓవర్లోనే ఓపెనర్లు డిక్వెల్లా(1), దిల్షాన్(1) పెవిలియన్ పంపి లంక వికెట్ల పతనానికి తెరతీశాడు. ఇక్కణ్నుంచి వరుస ఓవర్లలో వికెట్లు చేజార్చుకున్న లంక ఏ దశలోనూ కోలుకోలేదు. ముఖ్యంగా ఈ మ్యాచ్‌తో టీ20ల్లో భారత అత్యుత్తమ బౌలర్‌గా అశ్విన్(4/8) గణాంకాలు నమోదు చేసుకున్నాడు. ఇలా అశ్విన్‌కు జడేజా, రైనా తోడై లంకను స్పిన్ సుడిగుండంలోకి నెట్టారు. వీరి స్పిన్ మ్యాజిక్‌కు లంక జట్టులో దాసున్ షనాక(19), తిసార పెరెర(12) మాత్రమే రెండెంకల స్కోరు నమోదు చేయగా, మిగతావారంతా కేవలం సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. ఇన్నింగ్స్ తొలి ఓవర్ నుంచే పిచ్ పూర్తిగా స్పిన్ అనుకూలించడంతో కెప్టెన్ ధోనీ పార్ట్‌టైమ్ స్పిన్నర్ యువరాజ్‌సింగ్‌ను కూడా పరీక్షించాడు. అయితే కేవలం ఒక ఓవర్‌కే పరిమితమైన యువీ వికెట్ తీయకుండానే 15 పరుగులిచ్చుకుని నిరాశపరిచాడు. ఇక ఫాస్ట్‌బౌలర్లలో నెహ్రా(1/17), బుమ్రా(1/10)లకు చెరో వికెట్ దక్కింది.
నంబర్ వన్ ర్యాంకు పదిలం
ఈ మ్యాచ్ కు ముందు 120 రేటింగ్ పాయింట్లతో అగ్రస్థానంలో పోరుకు సిద్ధమైన భారత జట్టు ఆ ర్యాంకును పదిలంగా ఉంచుకుంది. ఈ మ్యాచ్ ను ఓడిపోతే ఏడో ర్యాంకుకు పడిపోయే ప్రమాదం ఉన్న టీమిండియా ఆది నుంచి సమయోచితంగా ఆడి విజయం సాధించింది. దీంతో సిరీస్ తో పాటు, నంబర్ వన్ ర్యాంకును కాపాడుకోగల్గింది.

Videos

Leave a Reply

Your email address will not be published.