విమానం గల్లంతు..ఆచూకీ తెలియని 29 మంది సైనికులు

చెన్నై నుంచి 29 మంది రక్షణ సిబ్బందితో పోర్ట్‌బ్లెయిర్‌కు బయలుదేరిన భారత వాయుసేన విమానం(ఏఎన్‌-32) శుక్రవారం గల్లంతైంది. ఈ విమానంలో వాయుసేన సిబ్బందితో పాటు విశాఖపట్నానికి చెందిన వారు ఎనిమిదిమంది ఉన్నారు. విమానం బంగాళాఖాతంలో కూలిపోయి ఉండొచ్చని అధికారులు ఆందోళన చెందుతున్నారు. దీని ఆచూకీ కోసం వైమానిక దళం, నౌకాదళం, కోస్ట్‌గార్డ్‌లు భారీఎత్తున గాలింపు ఆపరేషన్‌ను చేపట్టాయి. గల్లంతు కావడానికి ముందు ఆ విమానాన్ని తిరిగి చెన్నై దిశగా మళ్లించినట్లు వాయుసేన వర్గాలు అనుమానిస్తున్నాయి. గత ఏడాది జూన్‌ 8న చెన్నైలో తీరగస్తీ దళానికి చెందిన డోర్నియర్‌ విమానం కూడా ఇలాగే అదృశ్యమై… తర్వాత సముద్రంలో కూలిపోయింది. నెల తర్వాత దీని ఆచూకీ దొరికింది.

విమానం ఆచూకీ తెలుసుకోవడానికి వైమానిక, నౌకా, తీరరక్షణ దళాలు రంగంలోకి దిగాయి. బంగాళాఖాతాన్ని జల్లెడ పడుతున్నాయి.
* బంగాళాఖాతంలో వివిధ విధుల కోసం మోహరించిన యుద్ధనౌకలను విమాన గాలింపు విధులకు మళ్లాలని విశాఖలోని తూర్పు నౌకాదళం ఆదేశించింది. దక్షిణ చైనా సముద్రంలో విధులు ముగించుకొని తిరిగొస్తున్న 8 యుద్ధనౌకలను కూడా పూర్తిస్థాయి వేగంతో ప్రయాణిస్తూ గాలింపు ప్రదేశానికి చేరుకోవాలని సూచించింది.

* విమానంలో ‘ఎమర్జెన్సీ లోకేటర్‌’ ఉంది. ప్రమాదం వాటిల్లితే ఈ పరికరం క్రియాశీలమై, సంకేతాలను పంపుతుంది. వీటి ఆధారంగా విమాన ఆచూకీని గుర్తించవచ్చు. సముద్ర గర్భంలో ఈ సంకేతాలను పసిగట్టేందుకు ఒక జలాంతర్గామిని నౌకాదళం రంగంలోకి దించింది.

* అధునాతనమైన రెండు పి-8ఐ నిఘా విమానాలతోపాటు రెండు డోర్నియర్‌ లోహవిహంగాలనూ నౌకాదళం రంగంలోకి దించింది. పి-8ఐలో అధునాతన ఎలక్ట్రో ఆప్టిక్‌ వ్యవస్థలు, రాడార్లు ఉన్నాయి. సాగరాన్ని నిశితంగా పరిశీలించడానికి ఇవి ఉపయోగపడతాయి. యుద్ధనౌకలపై మోహరించిన హెలికాప్టర్లు కూడా గాలింపుల్లో పాల్గొంటున్నాయి.

* ఒక సి130, రెండు ఏఎన్‌-32 విమానాలతో వైమానిక దళం గాలింపు జరుపుతోంది. తీర రక్షణ దళం నాలుగు నౌకలను దించింది.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *