విరాట్ విశ్వరూపం…శతక్కొట్టిన అశ్విన్..

వెస్టిండీస్‌తో తొలి టెస్ట్‌లో టీమ్‌ఇండియా భారీ స్కోరు దిశగా దూసుకెళుతున్నది. అంతగా పసలేని విండీస్ బౌలింగ్‌ను అలవోకగా ఎదుర్కొంటూ టీమ్‌ఇండియా బ్యాట్స్‌మెన్ పరుగుల వరద పారిస్తున్నారు. ముఖ్యంగా కెప్టెన్ కోహ్లీ తన అప్రతిహత ఫామ్‌కు కొనసాగింపు అన్నట్లుగా డబుల్ సెంచరీతో(283 బంతుల్లో 200, 24 ఫోర్లు) చెలరేగితే అశ్విన్(253 బంతుల్లో 113) కూడా శతకం సాధించాడు. కెరీర్‌లో తొలి ద్విశతకంతో విజృంభించిన విరాట్.. నైట్ వాచ్‌మన్ అశ్విన్ జతగా సులువుగా పరుగులు కొల్లగొట్టాడు. విదేశీగడ్డపై డబుల్ సెంచరీ చేసిన తొలి భారత కెప్టెన్‌గా రికార్డు సాధించాడు. 1990లో న్యూజిలాండ్‌పై అజరుద్దీన్ చేసిన 192 పరుగులే ఇప్పటి వరకు అత్యుత్తమ స్కోరు. ఓ వైపు కోహ్లీ ద్విశతకంతో కదంతొక్కితే మరోవైపు స్పెషలిస్టు బ్యాట్స్‌మన్‌ను తలపిస్తూ అశ్విన్ కూడా బ్యాటు ఝులిపించాడు. దీంతో టీ విరామ సమయానికి భారత్ 154 ఓవర్లలో 6 వికెట్లకు 512 పరుగులు చేసింది. మరో మూడు మూడు రోజులు మిగిలున్న మ్యాచ్‌లో వెస్టిండీస్‌ను స్వల్పస్కోరుకే కట్టడి చేస్తే విజయం మనదే.

ఓవర్ నైట్ స్కోరు 302/4 తో రెండోరోజు బ్యాటింగ్ కు దిగిన కోహ్లీ, అశ్విన్ మొదట డిఫెన్స్కు ప్రాధాన్యమిచ్చారు. విండీస్ పేసర్లు బౌన్సర్లు, పదునైన పేస్ బౌలింగ్తో దాడులు చేసినా వీరు మాత్రం ఒత్తిడికి గురికాలేదు. 43 పరుగుల వద్ద ఇచ్చిన క్యాచ్‌ను కీపర్ వదిలేయడంతో ఊపిరి పీల్చుకున్న అశ్విన్ 127 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తిచేశాడు. విరాట్ కూడా జోరు చూపడంతో తొలి సెషన్‌లో భారత్ వికెట్ కోల్పోకుండా 102 పరుగులు చేసింది. కానీ లంచ్ తర్వాత రెండో బంతికే గాబ్రియెల్ బౌలింగ్ లో కోహ్లి అవుట్ కావడంతో ఐదో వికెట్‌కు 168 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది.

కోహ్లి ఔటయ్యాక క్రీజులోకొచ్చిన సాహా (88 బంతుల్లో 40; 1 ఫోర్, 1 సిక్సర్) ఫర్వాలేదనిపించాడు. అయితే బ్రాత్ వైట్ బౌలింగ్ లో ముందుకొచ్చి ఆడగా సాహా స్టంప్ ఔటయ్యాడు. ఆ తర్వాత వచ్చిన మిశ్రా సహకారంలో అశ్విన్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. బ్రాత్ వైట్ మరోసారి భారత్ను దెబ్బతీశాడు. స్కోరు వేగాన్ని పెంచేందుకు యత్నించిన అశ్విన్ బ్రాత్వైట్ బౌలింగ్ లో గాబ్రియెల్ కు క్యాచ్ ఇచ్చి ఏడో వికెట్ రూపంలో వెనుదిరిగాడు. షమీ(9 బంతుల్లో 17; 2 సిక్సులు) దూకుడుగా ఆడుతుంటే మరోవైపు మిశ్రా హాఫ్ సెంచరీ (53) చేసి బ్రాత్ వైట్ బౌలింగ్ లో హోల్డర్ క్యాచ్ పట్టడంతో భారత్ 8వ వికెట్ కోల్పోయింది. అప్పటికి 161.5 ఓవర్లలో భారత్ స్కోరు 566/8. మిశ్రా ఔట కాగానే కెప్టెన్ కోహ్లీ ఇన్నింగ్స్ డిక్లెర్ చేశాడు. విండీస్ బౌలర్లలో బిషూ, బ్రాత్వైట్ చెరో 3 వికెట్లు పడగొట్టగా, గాబ్రియెల్ రెండు వికెట్లు తీశాడు.

బ్యాటింగ్ కు దిగిన విండీస్ 16 ఓవర్లలో వికెట్ కోల్పోయి 31 పరుగులు చేసింది. బ్రాత్వైట్ (11), బిషూ(0) క్రీజులో ఉన్నారు. జట్టు స్కోరు 30 పరుగుల వద్ద షమీ బౌలింగ్ లో ఔటయ్యాడు.

1విదేశీ గడ్డపై డబుల్ సెంచరీ చేసిన తొలి భారత కెప్టెన్ కోహ్లీనే. ఇక వ్యక్తిగతంగానూ టెస్టు కెరీర్‌లో కోహ్లీకిదే అత్యుత్తమ స్కోరు. అంతకుముందు 2014లో బాక్సింగ్ డే టెస్టులో ఆస్ట్రేలియాపై కోహ్లీ అత్యధికంగా 169 పరుగులు సాధించాడు.

3ఆతిథ్య జట్టు కెప్టెన్‌గా వెస్టిండీస్‌లో అత్యధిక స్కోరు సాధించిన మూడో బ్యాట్స్‌మన్ కోహ్లీ. హట్టన్ (ఇంగ్లండ్), సింప్సన్ (ఆస్ట్రేలియా) తొలిరెండు స్థానాల్లోనున్నారు.

3 కోహ్లీ, ధవన్‌లు కలిసి మూడో వికెట్‌కు సెంచరీ భాగస్వామ్యం నమోదుచేయడం ఇది మూడోసారి.

4 టెస్టుల్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు నమోదుచేసిన నాలుగో భారత కెప్టెన్‌గా కోహ్లీ నిలిచాడు. గతంలో ఆస్ట్రేలియాపై ధోనీ (224), న్యూజిలాండ్‌పై సచిన్ టెండూల్కర్ (217), వెస్టిండీస్‌పై గవాస్కర్ (205), ఇంగ్లండ్‌పై మన్సూర్ అలీఖాన్ పటౌడీ (203 నాటౌట్) ఈ ఘనత సాధించారు.

19టెస్టుల్లో 2000 పరుగుల నుంచి 3000 పరుగులకు చేరుకోవడానికి కోహ్లీకి పట్టిన ఇన్నింగ్స్.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *