భారత క్రికెట్‌ను ఈడెన్‌కు ముందు.. ఈడెన్‌కు తర్వాత

84 ఏళ్ల భారత క్రికెట్‌ మహా ప్రస్థానంలో ఎన్నెన్నో మలుపులు.. ఆ మలుపుల్లోకెల్లా ప్రత్యేకమైంది ఈడెన్‌ టెస్టు. ఈ మ్యాచ్‌ ముందు వరకు భారత్‌ ఆడిన టెస్టులు 337. అందులో విజయాలు 63. గెలుపు శాతం 18.63 శాతం మాత్రమే. అదే ఈడెన్‌ మ్యాచ్‌ తర్వాత భారత్‌ ఆడిన మ్యాచ్‌లు 166 అయితే.. విజయాలు 66. గెలుపు శాతం 40.74. ఈ గణాంకాలే చెప్పేస్తాయి భారత క్రికెట్‌పై ఈడెన్‌ టెస్టు ప్రభావం ఏంటన్నది. ఈడెన్‌ టెస్టులో భారత్‌ అనూహ్య విజయం అందుకోవడంలో కీలక పాత్ర పోషించిన లక్ష్మణ్‌ మాటల్లో చెప్పాలంటే.. ‘‘ఆ గెలుపు మా ఆలోచన విధానాన్నే మార్చేసింది.

ఏ దశలోనూ పోరాటం ఆపకూడదని, ఆశలు వదులుకోకూడదని ఆ మ్యాచ్‌తోనే నేర్చుకున్నాం. ఒక జట్టు దృక్పథాన్నే మార్చేసిన మ్యాచ్‌ అది’’. లక్ష్మణ్‌ మాటలు అక్షర సత్యాలు. ఆ మ్యాచ్‌ తర్వాత భారత జట్టు దృక్పథమే మారిపోయింది. ఓటమి తప్పించుకోవడం కోసం ప్రయత్నించే జట్టు.. గెలవడం కోసం ఆడటం మొదలైంది అప్పుడే. ప్రపంచ క్రికెట్‌పై తిరుగులేని ఆధిపత్యం చలాయిస్తూ.. అప్రతిహత జైత్రయాత్ర సాగిస్తున్న కంగారూల పీచమణిచిన భారత్‌.. ఆ తర్వాత మరెన్నో అద్భుత విజయాలతో తన క్రికెట్‌ చరిత్రలోనే పతాక స్థాయిని అందుకుంది.

అంతకుముందు..: 1932లో తన తొలి టెస్టు ఆడిన భారత్‌.. తొలి విజయం రుచి చూసేందుకు 20 ఏళ్లు పట్టింది. ఆ తర్వాత అడపాదడపా విజయాలు సాధించినా.. అగ్ర జట్లకు పోటీనిచ్చే స్థాయికి చేరింది మాత్రం 70లు, 80ల్లోనే. టైగర్‌ పటౌడీ నేతృత్వంలో బిషన్‌ సింగ్‌ బేడీ, ప్రసన్న, చంద్రశేఖర్‌, వాడేకర్‌, విశ్వనాథ్‌ లాంటి దిగ్గజాల కలయికలో భారత జట్టు తన ఉనికిని చాటుకుంటూ కొన్ని అద్భుత విజయాలు సాధిస్తే.. ఆ తర్వాత సునీల్‌ గావస్కర్‌, కపిల్‌ దేవ్‌, వెంగ్‌సర్కార్‌, అజహరుద్దీన్‌ లాంటి దిగ్గజాల బృందం అగ్ర జట్లకు గట్టి పోటీనిచ్చే స్థాయికి చేరింది. ఐతే నిలకడగా విజయాలు సాధించడం మాత్రం ఎప్పుడూ లేదు. గావస్కర్‌, కపిల్‌ లాంటి ముందుతరం దిగ్గజాల నిష్క్రమణ తర్వాత 90ల్లో భారత్‌ బాగా బలహీన పడింది. సచిన్‌ అసాధారణ బ్యాటింగ్‌ విన్యాసాలతో ప్రత్యర్థి జట్లన్నింటిపై ఆధిపత్యం చలాయించినా.. జట్టుగా మాత్రం టీమ్‌ఇండియా ఎంతో బలహీనంగా కనిపించేది ఆ రోజుల్లో. విదేశీ పర్యటనలకు వెళ్తే గెలుపు సంగతి అలా ఉంచితే.. ఓటమి తప్పించుకున్నా గొప్పే అన్నట్లుండేది పరిస్థితి. ఎక్కడికి వెళ్లినా ఘోర పరాభవాలు.. వైట్‌వాష్‌లు. ఇలా సాగేది భారత్‌ ప్రస్థానం. ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, పాకిస్థాన్‌ లాంటి జట్లకు భారత్‌కు ఎంతో అంతరం కనిపించేది.

ఆ తర్వాత..: 2000 నాటి మ్యాచ్‌ ఫిక్సింగ్‌ కుంభకోణం భారత క్రికెట్‌ను ఓ కుదుపు కుదిపేశాక.. ఆ సంక్షోభం నుంచి అప్పుడప్పుడే కోలుకుంటున్న సమయంలో 2001లో భారత పర్యటనకు వచ్చింది ఆస్ట్రేలియా. అప్పటికి ఆ జట్టు ప్రపంచ క్రికెట్లో తిరుగులేని శక్తి. ఆ సిరీస్‌లో భారత్‌ ఒకట్రెండు మ్యాచ్‌లు డ్రా చేసుకున్నా గొప్ప ప్రదర్శనే అని అంచనా వేశారు విశ్లేషకులు. ఈ అంచనాలకు తగ్గట్లే తొలి టెస్టులోనే 10 వికెట్ల తేడాతో చిత్తయింది భారత్‌.

ఈడెన్‌ టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా చేసిన 445 పరుగుల భారీ స్కోరుకు బదులుగా భారత్‌ 171 పరుగులకే కుప్పకూలి ఫాలోఆన్‌లో పడటంతో మరో పరాభవానికి మానసికంగా సిద్ధపడిపోయారు అభిమానులు. కానీ అనూహ్యంగా రెండో ఇన్నింగ్స్‌లో లక్ష్మణ్‌ (281), ద్రవిడ్‌ (180)ల అసాధారణ భాగస్వామ్యం భారత్‌కు పైచేయి సాధించే అవకాశం కల్పించింది. తర్వాత హర్భజన్‌ (6/73) మాయాజాలం భారత్‌కు అద్భుత విజయాన్ని కట్టబెట్టింది. భారత్‌ తర్వాతి టెస్టులోనూ గెలిచి సిరీస్‌ను 2-1తో సొంతం చేసుకోవడంతో ఆ తర్వాత మన జట్టు ఆటతీరే మారిపోయింది. మనమూ గెలవగలం.. ఎవరినైనా ఓడించగలం అనే ఆత్మవిశ్వాసాన్నిచ్చిన మ్యాచ్‌ అది. ఆ తర్వాత 2004లో పాకిస్థాన్‌ను, 2006లో వెస్టిండీస్‌ను, 2009లో న్యూజిలాండ్‌ను వారి సొంతగడ్డలపై ఓడించడమే కాదు.. మరెన్నో విదేశీ పర్యటనల్లో చక్కటి ప్రదర్శన చేసింది భారత్‌. ఈ క్రమంలోనే 2010లో నెంబర్‌వన్‌ టెస్టు జట్టుగానూ అవతరించి.. చరిత్ర సృష్టించింది.

తొలి టెస్టు: 1932 లార్డ్స్‌లో ఇంగ్లాండ్‌పై, 158 పరుగుల తేడాతో ఓటమి
100వ టెస్టు: 1967 బర్మింగ్‌హమ్‌లో ఇంగ్లాండ్‌పై, 132 పరుగుల తేడాతో పరాజయం
200వ టెస్టు: 1982 లాహోర్‌లో పాకిస్థాన్‌పై డ్రా
300వ టెస్టు: 1996 అహ్మదాబాద్‌లో దక్షిణాఫ్రికాపై 64 పరుగుల తేడాతో గెలుపు
400వ టెస్టు: 2006 కింగ్‌స్టన్‌లో వెస్టిండీస్‌పై 49 పరుగుల తేడాతో విజయం

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *