ఇంగ్లండ్‌కు స్పిన్న‌ర్ల ఉచ్చు

టీమిండియా స్పిన్ త్ర‌యం ఇంగ్లండ్‌కు ముచ్చెమ‌ట‌లు ప‌ట్టిస్తోంది. మొద‌ట బ్యాటింగ్‌లో.. తర్వాత బౌలింగ్‌తో ఇంగ్లిష్ టీమ్ చుట్టూ ఉచ్చు బిగిస్తోంది. దీంతో మొహాలీ టెస్ట్ మూడో రోజు ఆట ముగిసే స‌మ‌యానికి కోహ్లి సేన మ్యాచ్‌ను శాసించే స్థితిలో నిలిచింది. స్పిన్ త్ర‌యం అశ్విన్‌, జ‌డేజా, జ‌యంత్ యాద‌వ్ హాఫ్ సెంచ‌రీల‌తో తొలి ఇన్నింగ్స్‌లో 417 ప‌రుగులు చేసిన టీమిండియాకు.. 134 ప‌రుగుల కీలక ఆధిక్యం ల‌భించింది. ఆ త‌ర్వాత రెండో ఇన్నింగ్స్‌లో మూడోరోజే ఇంగ్లండ్ కీల‌క‌మైన 4 వికెట్లు కోల్పోయింది. ఆట ముగిసే స‌మ‌యానికి 4 వికెట్ల‌కు 78 ప‌రుగులు చేసిన ఇంగ్లండ్‌.. ఇంకా 56 ప‌రుగులు వెనుక‌బ‌డి ఉంది. కుక్ (12), మొయిన్ అలీ (5), బెయిర్‌స్టో (15), స్టోక్స్ (5) ఇప్ప‌టికే పెవిలియ‌న్ చేరారు. రూట్ 36, బ్యాటీ 0 ప‌రుగుల‌తో క్రీజులో ఉన్నాడు. అశ్విన్ 3, జ‌యంత్ యాద‌వ్ ఒక వికెట్ తీసుకున్నారు.

అంత‌కుముందు తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా 417 ప‌రుగుల‌కు ఆలౌటైంది. లోయ‌ర్ ఆర్డ‌ర్‌లో అశ్విన్‌, జ‌డేజా, జ‌యంత్ యాద‌వ్ హాఫ్ సెంచ‌రీలు చేయ‌డంతో తొలి ఇన్నింగ్స్‌లో కోహ్లి సేన‌కు 134 ప‌రుగుల కీల‌క ఆధిక్యం ల‌భించింది. ఒక ద‌శంలో 204 ప‌రుగుల‌కే ఆరు వికెట్లు కోల్పోయి ఇంగ్లండ్‌కు ఆధిక్యం క‌ట్ట‌బెట్టేలా క‌నిపించినా.. అశ్విన్‌, జ‌డేజా.. త‌ర్వాత జ‌డేజా, జయంత్ యాద‌వ్ టీమ్‌ను ఆదుకున్నారు. ఈ క్ర‌మంలో జ‌డేజా 90, అశ్విన్ 72, జ‌యంత్ యాద‌వ్ 55 ప‌రుగులు చేశారు. ముఖ్యంగా మూడో రోజు ఉద‌యం జ‌డేజా, జ‌యంత్ యాద‌వ్ ఎనిమిదో వికెట్‌కు 80 ప‌రుగులు జోడించి.. టీమిండియాకు కీల‌క‌మైన ఆధిక్యం ద‌క్క‌డంలో కీల‌క‌పాత్ర పోషించారు. 22 టెస్టుల కెరీర్‌లో తొలిసారి వంద‌కుపైగా బంతులు ఆడిన జ‌డేజా.. సెంచ‌రీ చేసేలా క‌నిపించినా.. ప‌ది ప‌రుగుల దూరంలో ఔట‌య్యాడు. టెస్టుల్లో అతినికిదే అత్య‌ధిక స్కోరు. ఇంగ్లండ్ బౌలర్లలో స్టోక్స్ 5, రషీద్ 4 వికెట్లు తీసుకున్నారు.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *