విజయవాడ విమానాశ్రయానికి అంతర్జాతీయ హోదా

ఘన చరిత్ర కలిగిన విజయవాడ ఎయిర్‌పోర్టుకు అంతర్జాతీయ హోదా దక్కింది. ఆంధ్రప్రదేశ పునర్‌ వ్యవస్థీకరణ చట్టం-2014లో పేర్కొన్న విధంగా బెజవాడ విమానాశ్రయానికి అంతర్జాతీయ విమానాశ్రయ హోదా ఇవ్వడానికి ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో జరిగిన కేబినెట్‌ సమావేశం ఆమోదం తెలిపింది. రాష్ట్ర విభజన తర్వాత అమరావతికి రాకపోకలు పెరిగిన నేపథ్యంలో… విజయవాడ విమానాశ్రయం కీలక పాత్ర పోషిస్తోంది. ప్రయాణికుల వృద్ధి, విమానయాన సంస్థల నుంచి వస్తున్న డిమాండ్లు, రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు కేబినెట్‌ ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో, అంతర్జాతీయ కార్యకలాపాలు నిర్వహించేందుకు అనుగుణంగా విమానాశ్రయంలో తగిన మౌలిక సదుపాయాలు కల్పించి ఎయిర్‌పోర్ట్స్‌ అథార్టీ ఆఫ్‌ ఇండియా(ఏఏఐ) అభివృద్ధి చేస్తుంది.
విజయవాడ… విజయాల గడ్డ: మోదీ
కేబినెట్‌ సమావేశం తర్వాత ‘అంతర్జాతీయ హోదా’ విషయంపై ప్రధాని మోదీ ట్వీట్‌ చేశారు. ‘విజయవాడ విజయాల గడ్డ. ఇప్పుడు కేబినెట్‌ నిర్ణయంతో భారత అంతర్జాతీయ విమానాశ్రయాల క్లబ్‌లోకి చేరి ప్రజలకు స్వాగతం పలుకుతోంది. ఆంధ్రప్రదేశను ప్రజలు మరింతగా తెలుసుకునేందుకు అవకాశం కల్పిస్తోంది’ అని ట్వీట్‌ చేశారు. దీనికి సీఎం చంద్రబాబును కూడా ట్యాగ్‌ చేశారు. కాగా, కేంద్ర కేబినెట్‌ నిర్ణయం పట్ల కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు హర్షం వ్యక్తం చేశారు. విమానాశ్రయం ద్వారా జరిగే సరకు రవాణాతో వ్యవసాయ ఉత్పత్తులకు డిమాండ్‌ పెరిగి రైతులకు మేలు జరుగుతుందన్నారు. అంతర్జాతీయ హోదాతో స్థానికంగా 1150 మందికి ప్రత్యక్షంగా, మరెంతో మందికి పరోక్షంగా ఉపాధి లభిస్తుందన్నారు.
Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *