68 రూపాయలకే ఐఫోన్ 5ఎస్ వస్తే…

ఐఫోన్ ధర ఎంత ఉంటుందో మీకు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. శ్రీమంతులు వాడే ఫోన్‌గా దీనికో బ్రాండ్ ఇమేజ్ ఉంది. అయితే స్మార్ట్‌ఫోన్లు అందుబాటులోకి వచ్చాక యాపిల్ కూడా ఓ మెట్టు దిగొచ్చింది. 17వేల నుంచి 20వేల మధ్యలో కూడా ఐఫోన్‌ను అందుబాటులోకి తెచ్చింది. దీంతో కొంతమంది మధ్యతరగతి వ్యక్తులు కూడా ఈ ఫోన్‌ను వాడుతున్నారు. కానీ ఐఫోన్ 5ఎస్ 68 రూపాయలకు వస్తే మీ రియాక్షన్ ఏంటి… ఉబ్బితబ్బిబైపోరూ. ఇక్కడా అదే జరిగింది. ప్రస్తుతం మార్కెట్లో ఈ మోడల్ ధర 28,999 రూపాయలు. పంజాబ్ యూనివర్సిటీకి చెందిన నిఖిల్ బన్సల్ బీటెక్ స్టూడెంట్. ఆ యువకుడు ఫిబ్రవరి 12న స్నాప్‌డీల్‌లో ఐఫోన్ 5ఎస్ బుక్ చేశాడు.
99.7 శాతం డిస్కౌంట్ లభించినట్లు… 68 రూపాయలకే ఫోన్ అందిస్తున్నట్లు స్నాప్‌డీల్ నుంచి సందేశం వచ్చినట్లు నిఖిల్ తెలిపాడు. కానీ స్నాప్‌డీల్ మాట తప్పిందని వినియోగదారుల ఫోరమ్‌ను ఆశ్రయించాడు. పంజాబ్‌లోని సంగ్‌రూర్ జిల్లాలో ఈ ఫిర్యాదు నమోదైంది. స్నాప్‌డీల్ వినియోగదారుల ఫోరమ్‌లో ఆ డీల్‌కు ఒప్పుకోలేదట. అన్ని సాక్ష్యాలు పరిశీలించిన పిదప డీల్ ప్రకారం నిఖిల్ బన్సాల్‌కు ఫోన్ 68 రూపాయలకే విక్రయించాలని, దాంతో పాటు 10వేల రూపాయల పెనాల్టీ కట్టాలని కోర్టు ఆదేశించింది. ఫిబ్రవరిలో మొదలైన ఈ కథ సెప్టెంబర్‌లో ముగిసింది. ఎట్టకేలకు ఇన్నాళ్లకు నిఖిల్ బన్సాల్ 68 రూపాయలకే ఐఫోన్ 5ఎస్‌ను సొంతం చేసుకున్నాడు. కస్టమర్లను ఆకర్షించే ప్రయత్నంలో ఈకామర్స్ వెబ్‌సైట్స్ చేసే ఇలాంటి అబ్బురపరిచే ప్రకటనలపై ప్రజలు సరైన రీతిలో స్పందిస్తే పరిస్థితి ఎలా ఉంటుందనే దానికి ఈ సంఘటన నిదర్శనం.
Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *