బెంగళూరు దారుణాల వెనుక…

‘ఇదొక భారీ హింస. అమ్మాయిలంతా కేకలు పెట్టారు. సాయం చేయండి అంటూ గట్టిగా అరిచారు. అయినా ఎవరూ స్పందించలేదు’ అంటూ నూతన సంవత్సరం సందర్భంగా అర్ధరాత్రి భారత సిలికాన్‌ వ్యాలీ బెంగళూరులోని ఎంజీ రోడ్డులో అమ్మాయిలు, మహిళలపై జరిగిన కీచకపర్వాన్ని ఓ ప్రత్యక్ష సాక్షి వివరించింది.

‘పార్టీలో యువకులు, ఇంకొందరు పురుషులు దారుణంగా ప్రవర్తించారు. ఏ అమ్మాయిని వారు విడిచిపెట్టలేదు. వారి ముందు నుంచి వెళుతున్న ప్రతి అమ్మాయిని తాకారు. బలవంతంగా దగ్గరకు లాక్కున్నారు. అభ్యంతరకరంగా తాకారు. కొంతమంది అమ్మాయిలను జుట్టుపట్టి ఈడ్చారు. వారి బట్టలు చింపేశారు. భయంతో ఏడుస్తూ పరుగెడుతున్నా వారిని వదలిపెట్టలేదు. సాధారణంగా ఒక్కరిపై ఇద్దరిపై అయితే పోరాడగలం. కానీ, అక్కడ ఉంది వేలమంది సమూహం. ఏం చేయగలం.

వారు ఉద్దేశ పూర్వకంగా మహిళలను టార్గెట్‌ చేశారు. ఇది ఒక భారీ లైంగిక వేధింపుల ఘటనగా చెప్పవచ్చు. ప్రతి ఒక్కరు తాగి ఉన్నారు. ఒకరినొకరు నెట్టుకుంటున్నారు. ఎంత అసభ్యంగా చేశారంటే మాటల్లో చెప్పలేం. ఒక్క అమ్మాయిని కూడా విచిచిపెట్టలేదు. ఒక మహిళ ఏడుస్తుంటే చూశాను. ఆమెకు రక్తం కారుతోంది. మొత్తం గాయాలయ్యాయి. అది చూసి నాకు చాలా భయమేసింది. అంత దారుణంగా అక్కడ యువకులు ప్రవర్తించారు’ అంటూ ఆ ఘటనపై వివరణ ఇచ్చింది.

ప్రతియేటా ఎందుకిలా జరుగుతోందన్న దానిపై ఆరా తీస్తే పలు విషయాలు బయటికి వచ్చాయి. కొత్త సంవత్సరం రోజు అనేక మంది మహిళలు పోలీసులకు ఫిర్యాదులయితే ఇచ్చారు.. కానీ నిందితులను గుర్తించే ఎలాంటి ఆధారాలు వారి వద్ద లేవు. దీంతో పోలీసులు గుర్తుతెలియని నిందితులను అరెస్టు చేయలేమని చేతులెత్తేస్తున్నారు. ఇదే అదనుగా మరుసటి సంవత్సరం ఆకతాయిలు మరింత ధైర్యంగా రెచ్చిపోతున్నారు. ప్రభుత్వం, పోలీసు యంత్రాగాలు క్షేత్ర స్థాయిలో అధ్యయనం చేసి పరిష్కారం కనిపెట్టాల్సి ఉంది. శాంతి భద్రతలను కేవలం పేపర్లకు పరిమితం చేయకుండా… ఆచరణాత్మక చర్యలు తీసుకుని అరాచక శక్తుల గుండెల్లో భయం పుట్టించాలి. మరోవైపు మహిళలు కూడా ఆకతాయిల కంటపడకుండా ఉండేందుకు నిండైన వస్త్రాలు ధరించడంతో పాటు, ఆత్మరక్షణ కోసం తగు ఏర్పాట్లు చేసుకోవాలన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

 

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *