43 డిగ్రీల ఎండలో..రైతుల కోసం జగన్ దీక్ష

వైసీపీ అధినేత – ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రైతు సమస్యలపై గుంటూరు నల్లపాడు రోడ్డులో నేడు – రేపు నిరాహార దీక్ష చేయనున్నారు. రైతులకు గిట్టుబాటు ధరలు – రైతు రుణమాఫీపై ముఖ్యమంత్రి మాట తప్పడాన్ని నిరసిస్తూ ఆయన ఈ దీక్ష చేపడుతున్నారు. దీక్షకు వచ్చే రైతుల కోసం వైసీపీ నేతలు ఏర్పాట్లు చేశారు. రోజుకు 10వేల మంది చొప్పున వివిధ నియోజకవర్గాల నుంచి రైతులను వస్తారని అంచనా వేస్తున్నారు.  43 డిగ్రీల సెల్సియస్తో మండిపోతున్న ఎండను సైతం లెక్కచేయకుండా జగన్ చేయనున్న దీక్షకు ఎంపీ విజయసాయిరెడ్డి పర్యవేక్షణలో ఏర్పాట్లు జరిగాయి. ప్రధానంగా భూసమీకరణలో నష్టపోయిన రైతులు ఇప్పటికే భూసమీకరణకు గుర్తించిన గ్రామాల్లోని రైతులను దీక్షకు తరలించే ఏర్పాట్లు చేశారు. పార్టీ నాయకులు కాకుండా భూములు నష్టపోయిన వారితోనే ఎక్కువ సేపు మాట్లాడించే సన్నాహాలు జరిగాయి. దానివల్ల రైతుల గోడు నేరుగా ప్రజల్లోకి వెళ్లే అవకాశం ఉంటుందని నేతల ప్రసంగాల కంటే రైతుల వేదనే ఎక్కువ ప్రభావం చూపిస్తుందని పార్టీ నాయకులు భావిస్తున్నారు.

వివిధ ప్రజా సమస్యలపై ప్రధాన ప్రతిపక్ష నేతగా కొద్ది నెలల నుంచి జగన్ ఆందోళనలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సమయంలోనే ఆయన ఉద్యోగులు నిర్వహించిన ధర్నాకు హాజరై వారికి మద్దతు ప్రకటించారు. ఆశా వర్కర్లు అగ్రిగోల్డ్ బాధితులు – వీఆర్ ఏలు విజయవాడలో నిర్వహించిన ధర్నాకు హాజరై సంఘీభావం ప్రకటించారు. నందిగామ వద్ద దివాకర్ ట్రావెల్స్ బస్సు ప్రమాదం జరిగిన వెంటనే హైదరాబాద్ నుంచి వచ్చిన జగన్ సర్కారును ఇరుకున పెట్టారు. శాసనసభ సమావేశాల సమయంలో జగన్ ఎక్కువగా వివిధ సంఘాలు నిర్వహించిన ధర్నాలకు హాజరై సంఘీభావం ప్రకటించడం ద్వారా ఆయా వర్గాలకు చేరువయ్యే ప్రయత్నం చేశారు. మళ్లీ తాజాగా గుంటూరు వద్ద  రెండురోజులు జరిపే రైతుదీక్ష ద్వారా రైతులకు చేరువయ్యే ప్రయత్నాలు చేస్తున్నారు.

మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఈ దీక్షపై మాట్లాడుతూ  ‘జగన్ చేయనున్న రైతుదీక్ష రాష్ట్రంలో రైతు దుస్థితి – బాబు మోసానికి గురవుతున్న రైతన్న ఆవేదన తీవ్రత మరోసారి ప్రపంచానికి చాటనుంది. బాబు ఇచ్చిన రైతు రుణమాఫీ హామీ అమలుకాలేదు. ధరల స్థిరీకరణ నిధికి రూ.5వేల కోట్లు కేటాయిస్తామని నయాపైసా ఇవ్వలేదు. ప్రపంచంలో ఎక్కడాలేని విధంగా యార్డుకు సెలవిచ్చిన మతిలేని ప్రభుత్వాన్ని ఇక్కడే చూస్తున్నాం. వరసగా మూడురోజులు సెలవులిస్తే రైతులేం కావాలి? రైతు ఆందోళనకు స్పందించాల్సిన బాబు సొంత పార్టీ వ్యవహారాలు అమెరికా టూర్లపై దృష్టి పెడుతున్నారు’ అని ఈ సందర్భంగా ధ్వజమెత్తారు.

Videos

Leave a Reply

Your email address will not be published.