ప్రాజెక్టులన్నీ నాలుగేళ్లలో పూర్తి చేయాలి: జగన్

కృష్ణా, గోదావరి, వంశధార వరద జలాలను ఒడిసిపట్టి బంజరు భూములకు మళ్లించి  రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేయడమే లక్ష్యంగా నాలుగేళ్లలోగా పెండింగ్‌ ప్రాజెక్టుల పనులన్నీ పూర్తి చేయాలని జలవనరుల శాఖ అధికారులకు సీఎం ఆదేశించారు. జిల్లాలవారీగా ఏ ప్రాజెక్టులను ఏ ఏడాది పూర్తి చేయవచ్చో నివేదిక ఇస్తే వాటినే ఆయా సంవత్సరాల్లో ప్రాధాన్య ప్రాజెక్టులుగా పరిగణిస్తామన్నారు. ఆర్థిక పరిస్థితి క్లిష్టంగా ఉన్నప్పటికీ సాగునీటి ప్రాజెక్టులకు భారీగా నిధులు కేటాయిస్తామని స్పష్టం చేశారు. ప్రస్తుతం ఏ ప్రాజెక్టును పరిశీలించినా స్కామ్‌లే కనిపిస్తున్నాయని, రివర్స్‌ టెండరింగ్‌ ద్వారా అవినీతిని నిర్మూలించాలని ఆదేశించారు.

ప్రతీ రూపాయిని సద్వినియోగం చేసుకుని పారదర్శకంగా, శరవేగంగా ప్రాజెక్టులను పూర్తి చేయాలని సూచించారు. జిల్లాలవారీగా అధ్యయనం చేసి నీటి లభ్యత ఉంటే కొత్త ప్రాజెక్టులు చేపట్టడానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశించారు. తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో సాగునీటి ప్రాజెక్టుల పనులపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గురువారం సమీక్ష నిర్వహించారు. ఎన్నికలకు ముందు టెండర్లు పిలిచిన కొత్త ప్రాజెక్టుల పనులు, 25 శాతం లోపు పూర్తయిన ప్రాజెక్టుల పనులను నిపుణుల కమిటీ సిఫారసుల మేరకు చేపట్టాలని సీఎం సూచించారు

Videos