పొలిటికల్ పార్టీపై జూనియర్ కామెంట్స్ ఇవే!

టీడీపీ వ్యవస్థాపకుడు నందమూరి తారకరామారావు తెలుగు ప్రజల్లో చిర స్థాయిగా నిలిచిపోయారు. తొలుత సినీ నటుడిగా ఆ తర్వాత ప్రజలకు ఏదో ఒకటి చేయాలన్న తలంపుతో రాజకీయాల్లోకి వచ్చేసిన ఎన్టీఆర్… తెలుగుదేశం పార్టీ పేరిట ఓ రాజకీయ పార్టీని పెట్టి… తొమ్మిది నెలల్లోనే అధికారం అందిపుచ్చుకున్నారు. తెలుగు ప్రజల ఆత్మ గౌరవానికి ప్రతీకగా నిలిచిన ఆ పార్టీ ఆ తర్వాత  పలుమార్లు అధికారం చేపట్టడం తెలిసిందే. తదనంతర కాలంలో ఎన్టీఆర్ చేతిలో నుంచి అధికారాన్ని లాగేసుకున్న చంద్రబాబు.. ఎన్టీఆర్ను తీవ్ర అవమానానికి గురి చేశారు. ఆ అవమానం తట్టుకోలేక ఎన్టీఆర్ గుండెపోటుతో మరణించారన్న వాదన ఉన్న విషయం తెలిసిందే.

ఎన్టీఆర్ వారసులుగా బాలకృష్ణ హరికృష్ణ సినీ – రాజకీయ రంగ ప్రవేశం చేసినా… ఆయన అసలు సిసలు వారసుడిగా జూనియర్ ఎన్టీఆర్ తనను తాను నిరూపించుకున్నాడు. రూపు రేఖల్లోనే కాకుండా… మాట తీరు నటనలోనూ తాత గారిని అచ్చు గుద్దినట్టు అనుకరించే జూనియర్ ఎన్టీఆర్ ను జనం కూడా ఎన్టీఆర్ కు వాసరుడు అతడేనన్న భావనతో ఉన్నారు. ఈ క్రమంలో టీడీపీ వెంటే నడుస్తున్న జూనియర్… పలు సందర్భాల్లో ఆ పార్టీకి ఎన్నికల్లో ప్రచారం కూడా చేసి పెట్టారు. అయితే ఇటీవలి కాలంలో అతడు పార్టీకి చంద్రబాబు ప్రభుత్వానికి చాలా దూరంగానే నిలుస్తూ వస్తున్నారు.

ఈ క్రమంలో జూనియర్ ఎన్టీఆర్ రాజకీయ ఎంట్రీపైనా పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న పరిస్థితి. ఇలాంటి కీలక తరుణంలో జూనియర్ ఎన్టీఆర్ ‘నవ భారత్ నేషనల్ పార్టీ’ పేరిట రాజకీయ పార్టీ పెట్టేశారంటూ సోషల్ మీడియాలో ఓ బాంబు లాంటి వార్త కనబడింది. ఈ పార్టీని జూనియర్ ఎన్టీఆర్ స్థాపించకున్నా… సదరు పార్టీని రిజిష్టర్ చేసిన వ్యక్తులు మాత్రం…తమ పార్టీకి జూనియర్ను అధ్యక్షుడిగా నియమిస్తున్నామంటూ ఓ లేఖను విడుదల చేసి పెద్ద చర్చకే తెర తీశారు. ఆ నోటా ఈ నోటా ఈ విషయం జూనియర్ ను కూడా చేరిపోయింది.

అయితే ఈ వ్యవహారాన్ని చాలా లైట్ గా తీసుకున్న జూనియర్…  తాను ఇటువంటి వార్తలను పట్టించుకోబోనని తేల్చి చెప్పాడట. అంతేగాకుండా ఎవరూ ఈ వార్తలను పట్టించుకోవద్దని వదిలేయాలని అతడు తన అభిమానులకు సూచించాడట. ప్రస్తుతం తన దృష్టంతా సినిమాల మీదేనని చెప్పాడట. తనకు ఇప్పుడప్పుడే రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశమేమీ లేదని ఒకవేళ అలాంటి ఉద్దేశమే ఉంటే తానే స్వయంగా బహిరంగ ప్రకటన చేస్తానని తనను కలిసిన  అభిమానులకు వివరించాడట. వేరే పార్టీని ఆధారంగా చేసుకుని రహస్యంగా రాజకీయాల్లోకి వచ్చే అవసరం తనకు లేదని వారితో కామెంట్ చేశాడట.

Videos

Leave a Reply

Your email address will not be published.