రివ్యూ: ఖాకి – పోలీస్ పవర్ ఏంటో చూపించిన చిత్రం

కథ :
ధీరజ్ హరి ప్రసాద్ (కార్తీ)1999 బ్యాచ్ లో ట్రైన్ అయిన డీఎస్పీ. ట్రైనింగ్ లో ఉండగానే ఇంటి ఎదురుగా అద్దెకు వచ్చిన వాళ్ల అమ్మాయి ప్రియ(రకుల్ ప్రీత్ సింగ్)ను ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు. డీఎస్పీగా చార్జ్ తీసుకున్న దగ్గర నుంచి తన సిన్సియారిటీ కారణంగా ట్రాన్స్ ఫర్ అవుతూ ఉంటాడు. ఆ సమయంలో ఓ ఆసక్తికరమైన కేసు ధీరజ్ కంట పడుతుంది. చెన్నై హైవే పై ఉన్న ఇంట్లోకి చోరబడిన కొందరు దొంగలు అతి కిరాతకంగా ఇంట్లో వాళ్లను చంపి వారిని దోచుకెళుతుంటారు. ఒక్క ఆధారంగా కూడా లేకుండా హత్యలు చేస్తున్న ఆ ముఠాను ఎలాగైన పట్టుకోవాలని నిర్ణయించుకుంటాడు ధీరజ్.

అంత రాక్షసంగా హత్యలు చేసే వారిగురించి విచారించి వాళ్లు ఉత్తర భారతం నుంచి వచ్చే వాళ్లని, ఎక్కువగా హైవే మీదే దొంగతనాలకు పాల్పడుతున్నారంటే లారీలపై తిరిగే వారు అయి ఉంటారని ఆ దిశగా విచారించటం ప్రారంభిస్తాడు. దాదాపు ఒకటిన్నర సంవత్సరం పాటు శ్రమించి  ఆ దొంగల ముఠాను అంతం చేస్తాడు. ఈ ప్రయత్నం ధీరజ్ ఎలాంటి ఇబ్బందులను ఎదుర్కొన్నాడు..? అంత కిరాతకంగా మనుషులను చంపే ఆ దొంగల ముఠా నేపథ్యం ఏంటి..? ఈ ఇన్వెస్టిగేషన్ కారణంగా ధీరజ్ ఏం కోల్పోయాడు అన్నదే మిగతా కథ.

నటీనటులు :
లవర్ బాయ్ ఇమేజ్ ఉన్న కార్తీ ఈ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు యాక్షన్ స్టార్ గా పరిచయం అయ్యాడు. సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ గా నటించిన కార్తీ ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా యాక్షన్,ఎమోషనల్ సీన్స్ లో కార్తీ నటన కట్టి పడేస్తుంది. హీరోయిన్ పాత్రకు పెద్దగా ఇంపార్టెన్స్ లేకపోవటంతో రకుల్ ప్రీత్ సింగ్ గ్లామర్ సీన్స్ కే పరిమితమైంది. ఉన్నంతలో తనదైన నటనతో మెప్పించింది. హీరోకు ప్రతీ ఆపరేషన్ లో సాయం చేసే పోలీస్ ఆఫీసర్ సత్య పాత్రలో బోస్ వెంకట్ ఆకట్టుకున్నాడు. తన కుటుంబాన్ని కోల్పోయిన బాధలోనూ డ్యూటీ చేసే సిన్సియర్ ఆఫీసర్ పాత్రలో మెప్పించాడు. మెయిన్ విలన్ గా అభిమన్యూ సింగ్ తన మార్క్ చూపించాడు. కిరాతకంగా హత్యలు చేసే రాజస్థాన్  దొంగల ముఠా నాయకుడి పాత్రలో ఒదిగిపోయాడు. ఇతర పాత్రలకు పెద్దగా ఇంపార్టెన్స్ లేకపోవటంతో పాటు ఆ పాత్రల్లో తెలుగు వారు నటించకపోవటంతో పెద్దగా కనెక్ట్ అవ్వారు.

విశ్లేషణ :
ఎక్కువగా లవర్ బాయ్ తరహా పాత్రలో ఫ్యామిలీ హీరో ఇమేజ్ సొంతం చేసుకున్న కార్తీ, ఖాకీ సినిమాతో యాక్షన్ హీరోగా ఆకట్టుకున్నాడు. నిజంగా జరిగిన సంఘటనల ఆధారంగా ఓ పర్ఫెక్ట్ క్రైమ్ థ్రిల్లర్ ను తయారు చేసుకున్న దర్శకుడు వినోద్ అంతే ఎఫెక్టివ్ గా తెరమీద ఆవిష్కరించటంలో సక్సెస్ సాధించాడు. అయితే తొలి భాగంలో దొంగలముఠా హత్యలు చేసే సన్నివేశాలు వయలెన్స్.. దండుపాళ్యం లాంటి సినిమాలను గుర్తుకు తెస్తుంది. ఓ కేసు విచారణలో పోలీసులు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటారు. నిజాయితీ గల పోలీసులకు ఎలాంటి సమస్యలు వస్తాయి లాంటి అంశాలను అద్భుతంగా చూపించారు. అయితే పూర్తిగా క్రైం జానర్ లో సాగటం.. ఫ్యామిలీ ఆడియన్స్ కు యూత్ నచ్చే ఎమోషన్స్ లేకపోవటం కాస్త నిరాశ కలిగిస్తుంది.

యాక్షన్ మోడ్ లో మొదలైన సినిమాలో వెంటనే రొమాంటిక్ సీన్స్ రావటంతో సినిమా స్లోగా నడుస్తున్న ఫీలింగ్ కలుగుతుంది. అయితే సెకండ్ హాఫ్ లో మాత్రం అలాంటి సన్నివేశాలు లేకుండా పూర్తి యాక్షన్ ఎంటర్ టైనర్ లా సినిమాను తెరకెక్కించటం.. ఆసక్తికరమైన సన్నివేశాలు.. విలన్ వేసే ఎత్తులను హీరో చిత్తు చేయటం లాంటివి ఆడియన్స్ ను కట్టిపడేస్తాయి. సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్ సినిమాటోగ్రఫి. డిఫరెంట్ బ్యాక్ డ్రాప్ లో సాగే సినిమాకు అదే స్థాయి విజువల్స్ తో మరింత హైప్ తీసుకువచ్చాడు కెమెరామేన్ సత్యన్ సూర్యన్. గిబ్రన్ నేపథ్య సంగీతం కూడా ఆకట్టుకుంటుంది. ఎడిటింగ్ విషయంలో ఇంకాస్త దృష్టి పెట్టాల్సింది. ముఖ్యంగా తొలి భాగంలో వచ్చే రొమాంటిక్ సన్నివేశాలకు కత్తెర వేయాల్సింది. డ్రీమ్ వారియర్ ఫిలింస్ నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి.

ప్లస్ పాయింట్స్ :
కార్తీ నటన
యాక్షన్ సీన్స్
కథ

మైనస్ పాయింట్స్ :
ఫస్ట్ హాఫ్ లో కొన్ని సీన్స్

విడుదల తేదీ : నవంబర్ 17, 2017

రేటింగ్ : 3/5

దర్శకత్వం : హెచ్. వినోత్

నిర్మాత : ఎస్.ఆర్ ప్రకాష్ బాబు, ఎస్.ఆర్ ప్రభు

సంగీతం : ఘిబ్రాన్

నటీనటులు : కార్తి, రకుల్ ప్రీత్

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *