బుల్లితెర దేవసేన ఇదిగో.!

వెండితెర బ్యూటీ, బుల్లితెర దేవసేనగా మారిపోయింది. ఒకప్పటి అందాల తార రాధ కుమార్తె కార్తీక, అక్కినేని నాగచైతన్య సరసన ‘జోష్‌’ సినిమాలో నటించిన విషయం విదితమే. తమిళంలో ఆమె నటించిన ‘రంగం’ సినిమా తెలుగులోనూ మంచి విజయాన్నే అందుకుంది. అయితే, హీరోయిన్‌గా వెండితెరపై కార్తీక కెరీర్‌ ఏమంత గొప్పగా సాగలేదు.

ప్రస్తుతం కార్తీక, బుల్లితెరపైకొచ్చింది. ఆమె నటించిన ‘ఆరంభ్‌’ సీరియల్‌ ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సీరియల్‌ ప్రత్యేకత ఏంటంటే, ఇందులో ‘దేవసేన’గా కార్తీక నటించనుండడం. ‘బాహుబలి’ రచయిత విజయేంద్రప్రసాద్‌ ఈ సీరియల్‌కి రచయిత కావడం మరో విశేషం. సీరియల్‌లో దేవసేన పోరాటాలు బుల్లితెర వీక్షకుల్ని సంభ్రమాశ్చర్యాలకు గురిచేయనున్నాయట.

వెండితెరపై పోల్చితే బుల్లితెరకు కొన్ని పరిమితులుంటాయనీ, అదే సమయంలో పెద్ద కథని ఇంకా విస్తృతంగా ఎక్కువ ఎపిసోడ్లలో చూపించే అవకాశం వుంటుంది గనుక, అడ్వాంటేజ్‌ కూడా వుంటుందని కార్తీక చెబుతోంది. దేవసేన పాత్రను ఛాలెంజింగ్‌గా తీసుకున్నానంటోన్న కార్తీక, ‘బాహుబలి’లోని దేవసేనతో బుల్లితెర దేవసేనను పోల్చి చూడకూడదని క్లారిటీ ఇచ్చేసింది.

బుల్లితెరపైకి రావడం ద్వారా వెండితెరపై ఆశలు వదిలేసుకున్నట్లేనా.? అనడిగితే, ‘ఏం బుల్లితెర నుంచి ఎందరో నటీనటులు వెండితెరకు పరిచయమవుతున్నప్పుడు.. నా విషయంలో నెగెటివ్‌ ఆలోచనలు ఎందుకు..’ అని ఎదురు ప్రశ్నించింది కార్తీక. గోల్డీ బెహెల్‌ ఈ ‘ఆరంభ్‌’ సీరియల్‌కి దర్శకత్వం వహిస్తున్నాడు.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *