రివ్యూ: కాటమరాయుడు

స్టోరీ :
రాయ‌ల‌సీమ‌లోని తాళ్ల‌పాక గ్రామంలో కాట‌మ‌రాయుడు (ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌) త‌న త‌మ్ముళ్ల‌తో ఉంటూ అక్క‌డ అరాచ‌క శ‌క్తుల‌ను అడ్డుకుంటూ ప్ర‌జ‌లకు అండ‌గా నిలుస్తాడు. కామ‌ట‌రాయుడుకి న‌లుగురు త‌మ్ముళ్లంటే ప్రాణం. పెళ్ల‌యితే తాము ఎక్క‌డ విడిపోతామో అన్న భ‌యంతో కాట‌మ‌రాయుడు అస‌లు పెళ్లి కాదు క‌దా ఆడ‌పిల్ల‌ల వంకే చూడ‌డు. అలాంటి అన్న‌ను త‌మ ప్రేమ కోసం త‌మ్ముళ్లు లింగ‌బాబు (ఆలీ) సాయంతో ప్రేమ ముగ్గులోకి దింపుతారు. ఆ ఊరికి వ‌చ్చి వాళ్ల ఎదురింట్లోనే దిగిన క్లాసిక‌ల్ డ్యాన్స‌ర్ అయిన అవంతి (శృతీహాస‌న్‌)తో ఆమెను కాట‌మ‌రాయుడు ప్రేమిస్తున్న‌ట్టు, అలాగే అవంతి కాట‌మ‌రాయుడిని ప్రేమిస్తున్న‌ట్టు చెప్పి ఇద్ద‌రూ ల‌వ్‌లో ప‌డేలా చేస్తారు. కానీ ఇక్క‌డ కాట‌మ‌రాయుడు హింసా ప్ర‌వృత్తి గురించి ఆమెకు నిజం చెప్ప‌రు. దీంతో ఆమె కాట‌మ‌రాయుడు హింసా స్వ‌రూపాన్ని తెలుసుకుని వెళ్లిపోతుంది.

క‌ట్ చేస్తే అవంతి కోసం ఆమె ఊరు బ‌ల‌భ‌ద్ర‌పురం వెళ్లిన కాట‌మరాయుడికి ఆమె కుటుంబం ఓ ఆప‌ద‌లో ఉన్న‌ట్టు తెలుస్తుంది. హింస వ‌ల్ల‌ త‌న కుమారుడిని కోల్పోవ‌డంతో శృతి తండ్రి నాజ‌ర్‌కు హింస ప్ర‌వృత్తి ఉన్న‌వాళ్లంటే న‌చ్చ‌దు. చివ‌ర‌కు నాజ‌ర్‌ను మెప్పించి ఆమె ఇంట్లోనే దిగుతాడు కాట‌మ‌రాయుడు. నాజ‌ర్‌కు తెలియ‌కుండానే వాళ్ల ఫ్యామిలీని చంపేందుకు ప్ర‌య‌త్నాలు చేస్తోన్న ఎల‌స‌రి భాను (త‌రుణ్ అరారో) ప్ర‌య‌త్నాల‌ను త‌న హింస‌తో అడ్డుకుంటూ ఉంటాడు కాట‌మ‌రాయుడు. చివ‌ర‌కు కాట‌మ‌రాయుడి గురించి నిజం తెలుసుకున్న నాజ‌ర్ ఏం చేశాడు ? మ‌రి ఎల‌స‌రి భాను నాజ‌ర్ ఫ్యామిలీని ఎందుకు చంపాల‌నుకున్నాడు ? చివ‌ర‌కు ఈ క‌థ ఎలా ముగిసింది అన్న‌దే కాట‌మ‌రాయుడు స్టోరీ.

విశ్లేష‌ణ‌:
కాట‌మ‌రాయుడు సినిమా ప్రారంభం సుత్తిలేకుండా స్టార్ట్ అవుతుంది. రావు ర‌మేష్‌కు ప‌వ‌న్‌కు శ‌తృత్వాన్ని…ఎవ‌రైనా అన్యాయం చేస్తే తాట‌తీసే ప‌వ‌న్ మ‌న‌స్త‌త్వాన్ని నేరుగానే చెప్పేశాడు. త‌ర్వాత ప‌వ‌న్ న‌లుగురు త‌మ్ముళ్లు త‌మ ప్రేమ కోసం అన్న‌ను శృతితో ల‌వ్‌లో ప‌డేస్తారు. ఇందుకోసం అటు త‌మ్ముళ్లు, ఇటు ప‌వ‌న్ ప‌డే పాట్లు బాగున్నాయి. ప‌వ‌న్‌-శృతికి ప్ర‌పోజ్ చేసే సీన్ల‌తో పాటు వారిద్ద‌రి మ‌ధ్య కెమిస్ట్రీ బాగా వ‌ర్క‌వుట్ అయ్యింది. ప‌వ‌న్ గురించి నిజం తెలుసుకుని వెళ్లిపోయే టైంలో వ‌చ్చే ఇంట‌ర్వెల్ బ్యాంగ్ ట్రైన్ ఎపిసోడ్ వీర‌మ్‌లో ఓ రేంజ్‌లో ఉంటుంది. కానీ ఇక్క‌డ మాత్రం తేలిపోయింది.

ఇక సెకండాఫ్‌లో శృతి ఇంట్లోకి ప‌వ‌న్‌, ప‌వ‌న్ త‌మ్ముళ్లు ఎంట్రీ ఇవ్వ‌డం అక్క‌డ వ‌చ్చే సీన్లు కూడా ఏ మాత్రం ఆస‌క్తిరేకిత్తించ‌లేదు. శృతికి త‌న గురించి త‌ప్పుగా చెప్పి ఆమె త‌న ల‌వ్‌లో ప‌డేసేలా చేశారని తెలుసుకున్న ప‌వ‌న్ వాళ్ల‌ను బెల్టుతో బాదే సీన్ సైతం పేలలేదు. ఇక సినిమాలో రావూ ర‌మేష్ శాడిజం విల‌నిజం ఏ మాత్రం ఉప‌యోగం లేకుండా పోయింది. అస‌లు విల‌న్‌గా ప్ర‌దీప్‌సింగ్ రావ‌త్ క్యారెక్ట‌ర్‌ను ఎందుకు పెట్టారో తెలిదు. నాజ‌ర్ తీర్పు వ‌ల్ల త‌న తండ్రి చ‌నిపోయాడ‌న్న కార‌ణంతో త‌రుణ్ అరోరా నాజ‌ర్ ఫ్యామిలీని చంపేందుకే చేసే సీన్లు సైతం కూడా ఏమంత గొప్ప‌గా లేవు.

నేత చీర‌క‌ట్టుకొచ్చి సాంగ్‌లో కాస్ట్యుమ్స్ శ్రీమంతుడు, కెమేరామెన్ గంగ‌తో రాంబాబు నుంచి కాపీ కొట్టేశారు. ప‌వ‌న్ సెకండాఫ్‌లో శృతి ఇంట్లోకి వ‌చ్చాక త‌రుణ్ అరోరా గ్యాంగ్ నుంచి కాపాడేందుకు రెండు మూడు ఫైట్లు పెట్టారు. క‌థ ఫ‌స్టాప్ వ‌ర‌కు ఓకే అనిపించినా కీల‌క‌మైన సెకండాఫ్‌లో మాత్రం ప‌ట్టుస‌డ‌లింది.

న‌టీన‌టులు పెర్పామెన్స్ :
న‌టీన‌టుల్లో ప‌వ‌న్ పంచెక‌ట్టు అన్న‌గా అద‌ర‌గొట్టేశాడు. ప‌వ‌న్ సినిమా అంతా దాదాపు పంచెక‌ట్టులో పెద్ద అన్న పాత్ర‌లో బాగా మెప్పించాడు. పంచ‌క‌ట్టులోనే చేసిన ఫైట్స్‌, చెప్పిన పంచ్ డైలాగ్స్ బాగున్నాయి. ఇక శృతీహాస‌న్ గ్లామ‌ర్ లుక్‌తో మెప్పించింది. సాంగ్స్‌లో మాత్రం ఎక్స్‌పోజింగ్ ఓవ‌ర్ అనిపించింది. రెండు సాంగుల్లో తొడ‌లు క‌న‌ప‌డేలా క‌నిపించింది. అయితే సాంగ్స్‌ల్లో ఆమె లావెక్కిన‌ట్టు స్ప‌ష్టంగా క‌న‌ప‌డింది. సినిమాలో విల‌నిజం చాలా చాలా వీక్‌గా ఉంది. రావూ ర‌మేష్ ప‌వ‌న్ ఫ్యామిలీని చంపే శాడిస్ట్ విల‌న్ రోల్‌లో చేసిందేమి లేదు.

ఇక ప్ర‌దీప్‌సింగ్ రావ‌త్‌ను ఎందుకు విల‌న్‌గా పెట్టారో అర్థంకాదు. ఇక నాజ‌ర్ ఫ్యామిలీని చంపే రోల్‌లో అంజ‌లా ఝ‌వేరి భ‌ర్త త‌రుణ్ అరోరా క్యారెక్ట‌ర్ సైతం చేసిందేమి లేదు. ఇక ప‌వ‌న్ త‌మ్ముళ్లుగా శివ‌బాలాజీ, క‌మ‌ల్ కామ‌రాజ్‌, అజ‌య్‌, కృష్ణ‌చైత‌న్య సినిమాకు ఆయువు ప‌ట్టు రోల్స్‌లో న‌టించారు. వీరి క్యారెక్ట‌ర్లే సినిమాకు ఫ‌స్టాఫ్‌లో బాగా హైలెట్ అయ్యాయి. ఇక శృతి త‌ల్లిదండ్రులుగా చేసిన నాజ‌ర్, ప‌విత్రా లోకేష్ త‌మ ప‌రిధి మేర‌కు ఓకే. ఆలీ ప‌వ‌న్ త‌మ్ముళ్ల‌తో ట్రావెల్ అయ్యే క్యారెక్ట‌ర్‌లో ఉన్నా మ‌నోడి కామెడీ సినిమాకు పెద్ద‌గా హెల్ఫ్ కాలేదు.

టెక్నిక‌ల్ డిపార్ట్‌మెంట్ ఎన‌లైజింగ్ :
సాంకేతిక విభాగంలో అనూప్ రూబెన్స్ యావ‌రేజ్ ఆడియో ఇచ్చినా బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ విష‌యంలో మాత్రం మెస్మ‌రైజ్ చేశాడు. అంచ‌నాలకు మించి ఆర్ ఆర్ ఆదిరిపోయింది. రొమాంటిక్‌, యాక్ష‌న్ స‌న్నివేశాల్లో కొత్త మ్యాజిక్ థీమ్‌తో మెప్పించాడు. ప్ర‌సాద్ మూరెళ్ల సినిమాటోగ్ర‌ఫీ సైతం క‌ల‌ర్ ఫుల్‌గా ఉండి సినిమాకు ఫ్రెష్‌లుక్ తెచ్చింది. సినిమాకు అవ‌స‌రాన్ని బ‌ట్టి క్లోజప్ షాట్లే ఎక్కువుగా ఇచ్చాడు. పాట‌లు విన‌డానికి యావ‌రేజ్‌గా ఉన్న పిక్చ‌రైజేష‌న్ బాగుంది. గౌతంరాజు ఎడిటింగ్ సెకండాఫ్‌లో ఒక‌టి రెండుసీన్ల విష‌యంలో కత్తెర‌కు ప‌దును పెట్టాల్సింది. ఓవ‌రాల్‌గా ర‌న్ టైం కూడా 144 నిమిషాలే కావ‌డంతో సినిమా హెల్ఫ్ అయ్యింది. క‌డ‌లి బ్ర‌హ్మ ఆర్ట్ వ‌ర్క్‌లో టింబ‌ర్ డిపో, పాట‌ల సెట్స్ ఓకే అనిపించాయి. రామ్, ల‌క్ష్మ‌ణ్ ఫైట్స్ ప‌వ‌న్ గ‌తంలో చేసిన‌వే. కొత్త‌గా అయితే లేవు. శ‌ర‌త్ మ‌రార్ నిర్మాణ విలువ‌లు గ్రాండ్‌గా ఉన్నాయి.

డాలీ డైరెక్ష‌న్ క‌ట్స్‌:
కోలీవుడ్ హిట్ మూవీ వీర‌మ్‌కు రీమేక్‌గా కాట‌మ‌రాయుడు తెర‌కెక్కినా ఆ సినిలో అన్న‌ద‌మ్ముల అనుబంధం అనే మెయిన్ థీమ్ మాత్ర‌మే తీసుకున్న డాలి సినిమాను మ‌న నేటివిటికి అనుగుణంగా చాలా వ‌ర‌కు మార్పులు చేర్పులు చేశాడు. వాసువ‌ర్మ‌, దీప‌క్ రాజ్ స్క్రీన్ ప్లే ఫస్టాఫ్ వ‌ర‌కు ఓకే అనిపించింది. కీల‌క‌మైన సెకండాఫ్‌లో క‌థ‌నం కొత్త‌గా ఉండ‌దు. గ‌తంలో మ‌నం ఎన్నో సినిమాల్లో చూసేసిన ఫార్మాట్‌లోనే ముందుకు వెళుతుంది. క్లైమాక్స్ కూడా తేల్చిన‌ట్టే. కీల‌క‌మైన ఇంట‌ర్వెల్ బ్యాంగ్ సైతం బ‌లంగా డిజైన్ చేయ‌లేదు. అయితే శృతి, ప‌వ‌న్ మ‌ధ్య రొమాంటిక్ ట్రాక్‌, ఫ‌స్టాఫ్ అన్న‌ద‌మ్ముల మ‌ధ్య సీన్లు, కామెడీ వ‌ర్క‌వుట్ అయ్యాయి. క్లాస్ + మాస్ ఫార్మాట్‌లో క‌థ‌నం న‌డిపించ‌డంతో సినిమా ఈ రెండు వ‌ర్గాల‌కు ఓ మోస్త‌రుగా న‌చ్చుతుంది.

ఫ్ల‌స్ పాయింట్స్ (+) :
– ప‌వ‌న్ + శృతీహాస‌న్ కెమిస్ట్రీ
– ప‌వ‌న్ శృతికి ప్ర‌పోజ‌ల్ సీన్లు
– అంచ‌నాల‌కు మించిన అనూప్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌
– సినిమాటోగ్ర‌ఫీ
– ఫ‌స్టాఫ్‌
– మాస్ + క్లాస్ మిక్స్‌డ్ క‌థ‌నం

మైన‌స్ పాయింట్స్ (-) :
– ప్లాట్ నెరేష‌న్‌
– ఎంగేజింగ్‌గా లేని స్క్రీన్ ప్లే
– ఇంట‌ర్వెల్ బ్యాంగ్‌
– వీక్ విల‌నిజం

టైటిల్‌: కాట‌మ‌రాయుడు
రేటింగ్‌: 2.75 / 5
బ్యాన‌ర్‌: నార్త్‌స్టార్ ఎంట‌ర్‌టైన్‌మెంట్‌
జాన‌ర్‌: ఫ‌్యామిలీ & యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌
న‌టీన‌టులు: ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌, శృతీహాస‌న్‌, నాజ‌ర్‌, ప్ర‌దీప్‌సింగ్ రావ‌త్‌, రావూ ర‌మేష్‌, శివ‌బాలాజీ, ఆలీ త‌దిత‌రులు
ఆర్ట్ : బ‌్ర‌హ్మ క‌డలి
ఫైట్స్‌: రామ్ & ల‌క్ష్మ‌ణ్‌
ఎడిటింగ్‌: గౌతంరాజు
సినిమాటోగ్ర‌ఫీ: ప‌్ర‌సాద్ మూరెళ్ల‌
మ్యూజిక్‌: అనూప్ రూబెన్స్‌
నిర్మాత‌: శ‌ర‌త్ మ‌రార్‌

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *