‘వైయస్ బతికుంటే నయీం పని అప్పుడే క్లోజ్ అయ్యేది’

దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి బతికి ఉంటే తాను ఎంపీగా ఉన్నప్పుడే నయీం పని క్లోజ్ అయ్యేదని నల్గొండ జిల్లా కాంగ్రెస్ నేత, ఎమ్మెల్సీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఆయన ఓ టీవీ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడారు. గ్యాంగ్ స్టర్ నయీం డైరీలో ఉన్న పేర్లన్నింటినీ బయట పెట్టాలని డిమాండ్ చేశారు.

నయీం తనను ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో బెదిరించాడని చెప్పారు. తనను పోటీ నుంచి తప్పుకోమని చెప్పారన్నారు. వైయస్ బతికుంటే నయీం పని అప్పుడే క్లోజ్ అయ్యేదని, ఆ తర్వాత వచ్చిన ముఖ్యమంత్రి ఉద్యమం కారణంగా దృష్టి సారించలేదన్నారు.

తన సోదరుడు కోమటిరెడ్డి వెంకట రెడ్డి నాడు తెలంగాణ కోసమే పదవికి రాజీనామా చేశారని చెప్పారు. నయీం డైరీలో పేర్లన్నింటిని బయట పెట్టాలన్నారు. సిట్ విచారణ అధికారి పైన నమ్మకం ఉన్నా, విచారణ పైన నమ్మకం లేదన్నారు. నయీంతో 90 శాతం మంది రాజకీయ నాయకులకు సంబంధాలున్నాయన్నారు. ముఖ్యమంత్రికి క్రెడిబిలిటీ లేదన్నారు. ఉంటే నయీం కేసులో తెరాస నాయకులే జైలుకు వెళ్లాలన్నారు. కేసీఆర్ అరెస్టు చేయాలనుకుంటే ఐదు నిమిషాల్లో చేయవచ్చునని, కానీ ముఖ్యమంత్రి ఆ పని చేస్తారని అనుకోవడం లేదన్నారు.

తమకు పీసీసీ అధ్యక్ష పదవిని అప్పగిస్తే ప్రభుత్వానికి ధీటుగా కాంగ్రెస్ పార్టీని నిలబెడతామని చెప్పారు. తెలంగాణ మొత్తం మీద కోమటిరెడ్డి సోదరులకు ంచి పేరు ఉందని చెప్పారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి నాయకత్వంలో వెళ్లినా తాము సహకరిస్తామని చెప్పారు. తాము రాజకీయాల్లోకి వచ్చాక డబ్బులు సంపాదించుకోలేదని, వ్యాపారం నుంచి వచ్చామని, రాజకీయాల్లోకి వచ్చాకనే తాము ఖర్చు పెట్టామన్నారు. కార్యకర్తలను, పేదలను ఆదుకోవడ-ం కోసం ఖర్చు పెడుతున్నామన్నారు. తాము బతికినన్నాళ్లు కాంగ్రెస్ పార్టీలోనే ఉంటామని చెప్పారు.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *