కృష్ణా పుష్కరాల ముహూర్తం ఆగస్టు 12 ఉదయం 5.54 గంటలకు ప్రారంభం

కృష్ణా పుష్కరాల ప్రారంభ ముహూర్తం ఖరారైంది. ఆగస్టు 12వ తేదీ ఉదయం 5.54 గంటలకు ప్రారంభించాలని తిరుమల తిరుపతి దేవస్థానం ఆస్థాన సిద్ధాంతి తంగిరాల వెంకటకృష్ణ పూర్ణప్రసాద్‌ సూచించారు. దీన్ని అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. కృష్ణా, గుంటూరు, కర్నూలు జిల్లాల్లోని 60 ప్రాంతాల్లో ఆగస్టు 23 వరకు పన్నెండురోజుల పాటు పుష్కరాలు జరగనున్నాయి. కంచి కామకోటి పీఠాధిపతి జయేంద్ర సరస్వతి, ఉత్తరాధికారి విజయేంద్ర సరస్వతి విజయవాడలో తొలి స్నానం చేస్తారని దేవాదాయశాఖ వర్గాలు తెలిపాయి. వీరు దుర్గాఘాట్‌లో పుష్కర స్నానం ఆచరిస్తారా? కృష్ణా, గోదావరి సంగమక్షేత్రంలోనా.. అన్నది తెలియాల్సి ఉంది. శ్రీశైలంలో రాయలసీమకు చెందిన ముఖ్య పీఠాధిపతులు, శైవసంప్రదాయం పాటించే పీఠాధిపతుల తొలి స్నానంతో పుష్కరాలు ప్రారంభం కానున్నాయి. అమరావతిలో కూడా స్వామిజీలు, పీఠాధిపతులు పాల్గొంటారు.

ప్రముఖులకు ఆహ్వానం.. పుష్కరాలకు రాష్ట్ర ప్రభుత్వం దేశావ్యాప్తంగా 1200 మంది ప్రముఖుల్ని ఆహ్వానించనుంది. రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ, ప్రధానమంత్రి నరేంద్రమోదీ, సుప్రీంకోర్టు ప్రధానన్యాయమూర్తి సహా పలువురు ప్రముఖుల్ని సీఎం చంద్రబాబు పుష్కరాలకు ఆహ్వానించనున్నారు. వీరితో పాటు కేంద్రమంత్రులు సహాయమంత్రులు, లోక్‌సభ స్పీకర్‌, 27 మంది సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, 543 లోక్‌సభ సభ్యులు, 249 మంది రాజ్యసభ సభ్యులు, దేశంలో వివిధరాష్ట్రాల సీఎంలు, గవర్నర్లు, రాష్ట్ర మంత్రులు, శాసనసభ, శాసనమండలి సభ్యులకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఆహ్వాన పత్రికలు అందించనున్నారు. పీఠాధిపతులు, మఠాధిపతులను దేవాదాయశాఖ ముఖ్య కార్యదర్శి జేఎస్వీ ప్రసాద్‌, కమిషనర్‌ అనురాధ, ఇతర అధికారులు ఆహ్వానం పలుకుతున్నారు.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *