కేవీపీ-జగన్ ఒక్కటవబోతున్నారా?

వైఎస్ కు ఆత్మ అన్న స్థాయిలో ఒకప్పుడు ముద్రపడ్డ కేవీపీ.. వైఎస్ మరణానంతరం మాత్రం ఆయన కుటుంబంతో అంతగా సంబంధాలు కొనసాగించలేదు. వైసీపీ పార్టీతో జగన్ వేరుకుంపటి పెడితే.. కేవీపీ మాత్రం కాంగ్రెస్ లోనే కొనసాగుతూ వస్తున్నారు. దీంతో వైఎస్ తో పనిచేసిన సీనియర్లు జగన్ వెంట లేకపోవడం ఆయన చేసిన వ్యూహాత్మక తప్పిదాల్లో స్పష్టంగా కనిపిస్తుందనే వాదన ఉంది.

ఇక తాజా పరిస్థితి చూస్తుంటే.. వైఎస్ మరణానంతరం తన వెంట నడిచిరాని సీనియర్లను తన వైపుకు తిప్పుకునే ప్రయత్నాల్లో జగన్ ఉన్నట్లుగా ఆసక్తికర కథనాలు వెలువడుతున్నాయి. చాన్నాళ్లుగా జగన్ కుటుంబంతో కేవీపీ కుటుంబం అంటీ ముట్టినట్లుగానే వ్యవహరిస్తోన్న నేపథ్యంలో.. మొన్నటి వైఎస్ వర్ధంతి రోజు కేవీపీ భార్య జగన్ కుటుంబంతో కలిసి ఇడుపులపాయలోని వైఎస్ సమాధి వద్ద కనిపించడం ఈ వాదనకు మరింత బలం చేకూరుస్తోంది.

ఆ సందర్బంగా.. జగన్ కుటుంబంతో కలిసి వైఎస్ కు నివాళులు అర్పించారు కేవీపీ భార్య. దీనికి సంబంధించిన దృశ్యాలన్నీ సాక్షి ఛానల్ లో బాగానే కవరేజ్ అయ్యాయి. జగన్ పార్టీ పెట్టిన తర్వాత వైఎస్ సమాధి వద్దకు కేవీపీ కుటుంబం రావడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. దీంతో ఇన్ని రోజులు దూరంగానే ఉంటూ వస్తోన్న ఇద్దరి మధ్య.. తాజాగా పాత బంధం మళ్లీ బలపడుతుందనే వాదనలు వినిపిస్తున్నాయి.

అదీగాక..! హోదా కోసం ప్రైవేటు బిల్లు ప్రవేశ పెడుతోన్న సందర్బంలో.. కొద్దిరోజుల క్రితం టీవీ9 కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కేవీపీ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఇందులో జగన్ గురించి ప్రస్తావిస్తూ.. ‘జగన్ అనేవాడు నా మేనల్లుడండి. అతడి వైపు నిలబడితే తప్పేంటి?’ అని కేవీపీ ప్రశ్నించారు. ఇప్పుడు పరిస్థితి చూస్తోంటే.. జగన్ తో కలిసి నడవడానికి కేవీపీ కూడా పెద్ద విముఖత వ్యక్తం చేసే అవకాశం లేదు. దీంతో రెండు కుటుంబాల మధ్య పాత స్నేహం మళ్లీ చిగురించడం ఖాయమనే వాదన బలంగా వినిపిస్తోంది. చూడాలి మరి.. ఇదంతా ఊహాగానాలకే పరిమితమవుతుందో..! లేక ఇద్దరి మధ్య దోస్తీ కుదురుతుందో!

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *