లేడీ సూపర్‌ స్టార్‌.. మళ్ళీ తెరపైకి.!

లేడీ సూపర్‌ స్టార్‌గా ఒకప్పుడు తెలుగు తెరపై ఓ వెలుగు వెలిగిన విజయశాంతి, తమిళ, హిందీ సినిమాల్లోనూ తనదైన ముద్ర వేసిన విషయం విదితమే. రాజకీయాల్లోకి వచ్చి, బీజేపీలో పనిచేసి, ఆ తర్వాత కొత్త పార్టీ ‘తల్లి తెలంగాణ’ పెట్టి, దాన్ని టిఆర్‌ఎస్‌లో విలీనం చేసేసి, టీఆర్‌ఎస్‌ నుంచి ఎంపీగా గెలిచి, ఆ పార్టీ నుంచి బయటకొచ్చి, కాంగ్రెస్‌లో కలిసి.. ఇలా రాజకీయాల్లో పెద్ద ప్రసహనమే అన్నట్లుగా కిందా మీదా పడాల్సి వచ్చింది విజయశాంతికి.

ప్రస్తుతం ఆమె కాంగ్రెస్‌లో వున్నట్లు లెక్క. కానీ, ఆ పార్టీలో ఎక్కడా ఆమె కన్పించరు. ఆమె అంతే. టీఆర్‌ఎస్‌లో వున్నప్పుడు, అంతకు ముందు బీజేపీలో వున్నప్పుడు మాత్రమే రాజకీయాల్లో విజయశాంతి యాక్టివ్‌గా కన్పించారనుకోండి.. అది వేరే విషయం. టీఆర్‌ఎస్‌లోనే విజయశాంతి వుండి వుంటే, తెలంగాణలో మంత్రి అయ్యేవారేమో.!

కాలం కలిసి రాలేదు. రాజకీయ వ్యూహం దెబ్బతింది. అసలంటూ వ్యూహాలు లేకుండా ఇమేజ్‌ని నమ్ముకుని వచ్చేస్తే, ఇదిగో.. ఇలానే వుంటంది వ్యవహారం. సరే, గతం గతః అనుకున్నారో ఏమో, విజయశాంతి ఇప్పుడు మళ్ళీ సినిమాల్లోకి రావాలనుకుంటున్నారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో తన పాత్ర, అంతకు ముందు సినీ జీవితాన్ని.. యధాతథంగా తెరకెక్కించే యత్నాల్లో విజయశాంతి వున్నారట. టాలీవుడ్‌లో ఓ ప్రముఖ దర్శకుడితో ఇటీవలే విజయశాంతి సంప్రదింపులు జరిపినట్లు తెలుస్తోంది.

వాస్తవానికి, విజయశాంతి డ్రీమ్‌ రోల్‌ రుద్రమదేవి. తృటిలో ఆమె ఆ అవకాశం కోల్పోయారు. అనుష్క ‘రుద్రమదేవి’ సినిమాలో నటించేసిన విషయం విదితమే. దాంతో, తన కెరీర్‌లో బిగ్గెస్ట్‌ హిట్‌ చిత్రమైన ‘ఒసేయ్‌ రాములమ్మ’ తరహాలో వుండే సినిమా కథ కోసం వెతుకుతున్నారిప్పుడు. వేరే కథ ఎందుకు, మా జీవిత కథే సినిమాగా తెరకెక్కించేస్తే పోలా.? అంటూ సన్నిహితులు ఇచ్చిన సలహాతో, ఆ దిశగా విజయశాంతి అడుగులేస్తున్నారట.

చూద్దాం.. విజయశాంతి రీ-ఎంట్రీ ఏ మేరకు నిజమవుతుందో.!

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *