ఐపీఎల్-9: పుణెపై రైనా బృందం గెలుపు

ఐపీఎల్-9లో గుజరాత్ లయన్స్ జట్టు మరోసారి మెరిసింది. ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన రైనా సారథ్యంలోని లయన్స్ జట్టు 7 వికెట్ల తేడాతో ధోనీ నేతృత్వంలోని రైజింగ్ పుణె సూపర్ జెయింట్స్ జట్టును చిత్తు చేసి లీగ్‌లో వరుసగా రెండో విజయాన్ని నమోదుచేసింది. 164 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన లయన్స్ జట్టు.. ఓపెనింగ్ జోడీ ఆరోన్ ఫించ్ (50; 36 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సర్లు), బ్రెండన్ మెకల్లమ్ (49; 31 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్లు) రాణించడంతో మరో రెండు ఓవర్లు మిగిలుండగానే 3 వికెట్లు కోల్పోయి విజయం సాధించింది.

ఫించ్, మెకల్లమ్ తొలివికెట్‌కు 8.3 ఓవర్లలోనే 83 పరుగులు జోడించడంతో లయన్స్ ఇన్నింగ్స్ సాఫీగా సాగింది. ఆ తర్వాత కెప్టెన్ రైనా (24; 24 బంతుల్లో) చివర్లో ఆల్‌రౌండర్ డ్వెన్ బ్రావో (22; 10 బంతుల్లో 3 ఫోర్లు, ఓ సిక్సర్) మెరుపులు మెరిపించడంతో లయన్స్‌కు విజయం సులువైంది. విజయానికి చేరువలో రైనా ఔటైనా అవతలి ఎండ్‌లో బ్రావో వేగంగా పరుగులు రాబట్టి పుణె ఆశలపై నీళ్లు చల్లాడు. అర్థసెంచరీతో లయన్స్ విజయంలో కీలకపాత్ర పోషించిన ఫించ్‌కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. పుణె బౌలర్లలో మురుగన్ అశ్విన్ 2 వికెట్లు పడగొట్టగా, మరో వికెట్‌ను ఇషాంత్ శర్మ తీశాడు.

డుప్లెసిస్ దూకుడు: తొలుత టాస్ గెలవడంతో పుణె కెప్టెన్ ధోనీ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. పుణె ఇన్నింగ్స్‌ను రహానె (27; 17 బంతుల్లో 4 ఫోర్లు), డుప్లెసిస్ (69; 43 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్సర్లు) ధాటిగా ఆరంభించారు. ముఖ్యంగా రహానే క్రీజులోకి వస్తూనే లయన్స్ బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు. నాలుగు బౌండరీలతో 21 పరుగులు చేసి ప్రమాదకరంగా కనిపిస్తున్న రహానేను వెటరన్ స్పిన్నర్ ప్రవీణ్ తాంబే ఎల్బీగా ఔట్ చేయడంతో 27 పరుగుల వద్ద పుణె తొలి వికెట్ నష్టపోయింది. మరోవైపు నిలకడగా ఆడుతున్న డుప్లెసిస్‌కు జతగా పీటర్సన్ కలవడంతో స్కోరుబోర్డు ముందుకుసాగింది. పీటర్సన్ (37) ైస్ట్రెక్ రొటేట్ చేస్తుండగా మరో ఎండ్‌లో డుప్లెసిస్ చెలరేగిపోయాడు. వీరిద్దరి జోరుతో 12 ఓవర్లు ముగిసేసరికి 100 పరుగులతో పుణె భారీస్కోరు దిశగా సాగింది. రెండో వికెట్‌కు వీరిద్దరూ కలిసి 86 పరుగుల భాగస్వామ్యం నమోదు చేశారు.

రైజింగ్ పుణె సూపర్‌జెయింట్స్: రహానె (ఎల్బీ) తంబే 21, డుప్లెసిస్ (బి) తంబె 69, పీటర్సన్ (బి) బ్రావో 37, స్మిత్ (సి) ఫాల్కనర్ (బి) జడేజా 5, ధోనీ (నాటౌట్) 22, మార్ష్ (బి) జడేజా 7, భాటియా (నాటౌట్) 0, ఎక్స్‌ట్రాలు: 2, మొత్తం: 20 ఓవర్లలో 163/5; వికెట్లపతనం: 1-27, 2-113, 3-132, 4-134, 5-143; బౌలింగ్: ప్రవీణ్ 2-0-12-0, జకాతి 4-0-40-0, ప్రవీణ్ తంబె 4-0-33-2, బ్రావో 4-0-43-1, జడేజా 4-0-18-2, ఫాల్కనర్ 2-0-15-0.

గుజరాత్ లయన్స్: ఫించ్ (సి) ఇషాంత్ (బి) మురుగన్ అశ్విన్ 50, మెకల్లమ్ (సి) డుప్లెసిస్ (బి) ఇషాంత్ 49, రైనా (స్టంప్డ్/ధోనీ-బి) మురుగన్ అశ్విన్ 24, బ్రావో (నాటౌట్) 22, జడేజా (నాటౌట్) 4, ఎక్స్‌ట్రాలు: 15; మొత్తం: 18 ఓవర్లలో 164/3; వికెట్లపతనం: 1-85, 2-120, 3-147; బౌలింగ్: ఆర్పీ సింగ్ 2-0-21-0, ఇషాంత్ 4-0-39-1, ఆర్ అశ్విన్ 4-0-26-0, మురుగన్ అశ్విన్ 4-0-31-2, భాటియా 3-0-30-0, మార్ష్ 1-0-10-0.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *