జల్సాలే మాల్యా కొంప ముంచాయా…

పేరుగొప్ప… ఊరుదిబ్బ … ఈ స్థాయిలో కింగ్ ఫిషర్ ఎయిర్‌లైన్స్‌ను దిగజార్చిన ఘనత దాని అధినేత విజయ్‌ మాల్యాకే దక్కుతుంది. ఇంటర్‌నేషనల్‌ ఎయిర్‌లైన్స్‌గా ఎదగాల్సిన సంస్థను… సర్వనాశనం చేశాడు మాల్యా. దేశం విడిచి పారిపోయి చివరకు తన ఆస్తులకు కూడా విలువలేకుండా చేశాడు.

కింగ్‌ ఫిషర్ ఎయిర్‌లైన్స్… ఈ సంస్థకే కాదు… విజయ్‌మాల్యానే అనే వ్యక్తికి కూడా ఇప్పుడు విలువ లేకుండా పోయింది. ఇంకా చెప్పాలంటే ఆ స్థాయికి తనను తాను దిగజార్చుకున్నాడు. వేల కోట్ల వ్యాపారాలు చేసేవాళ్లు ప్రపంచంలోనే ఎంతో మంది ఉన్నారు. వాళ్లు విలాసవంతమైన జీవితాన్నే గడుపుతున్నారు. కానీ మాల్యా మాత్రం విలాసాలతో సరిపెట్టుకోలేదు… జల్సారాయుడిగా మారిపోయాడు. యూబీ గ్రూప్‌ పేరుతో ఎన్నో వ్యాపారాలు
చేసి లక్షల కోట్లు ఆర్జించిన వ్యక్తే… చివరకు తాను నిర్మించుకున్న సామ్రాజ్యాన్నే కుప్పకూల్చేశాడు. అందుకు ఉదాహరణే కింగ్ ఫిషర్ ఎయిర్‌లైన్స్.

నాకు డబ్బుంది. నేను ఎంజాయ్‌ చేస్తే తప్పేంటి అంటూ విర్రవీగిన విజయ్‌మాల్యా… అధఃపాతాళానికి పడిపోవడం ఆయన స్వయం కృతాపరాదమే… ఐపీఎల్‌, ఎఫ్‌వన్‌, హార్స్‌ రేస్‌లు… భామల మధ్య వెలుగులు… పొట్టి దుస్తుల అమ్మాయిలతో కేలెండర్‌కు ఫోజులు… ఇదీ మాల్యా జీవితం. కానీ ఇప్పుడు పరిస్థితి తారుమారైపోయింది. అపరకుబేరుడు కాస్తా… కింగ్ ఫిషర్ విమానాలకు పెట్రోల్ పోయించలేని స్థాయికి పడిపోయాడు. లిక్కర్‌ కింగ్ కాస్తా కింగ్ ఆఫ్ లాసెస్‌గా మారిపోయాడు…

విలాసవంతమైన జీవితానికి అలవాటు పడ్డ విజయ్‌ మాల్యా తన చుట్టూ పేరుకుపోయిన అప్పులను లైట్ తీసుకున్నాడు. బ్యాంకుల నుంచి వేల కోట్ల రూపాయల అప్పులు తెచ్చి కింగ్ ఫిషర్ ఎయిర్‌లైన్స్‌ను ఏర్పాటు చేసి… ఆ అప్పులు తీర్చకుండా ఎగనామం పెట్టాడు. కింగ్‌ ఫిషర్ ఎయిర్‌లైన్స్‌ ఉద్యోగులు జీతాల్లేక రోడ్డున పడితే… తాను మాత్రం గోవా బీచ్‌లో ముద్దుగుమ్మలతో ఎంజాయ్ చేస్తూ టైమ్‌ పాస్ చేశాడు. హాస్పటాలిటీ బిజినెస్‌ అంటూ ఎంతో గొప్పగా ప్రారంభించిన ఎయిర్‌లైన్స్‌ దివాళా తీస్తున్నా… మొద్దు నిద్ర నటించాడు మాల్యా. కింగ్ ఫిషర్ ఎయిర్‌ లైన్స్ మాల్యాను పూర్తి స్థాయిలో పతనం చేసిందనే చెప్పాలి.

అప్పులిచ్చి నిండా మునిగిన బ్యాంకులు కింగ్ ఫిషర్ బ్యాండ్‌ను అమ్మకానికి పెడితే… దాన్ని కొనేందుకు ఒక్కరు కూడా ముందుకు రాలేదు. లోగోలు, బ్రాండులే కాదు…మాల్యా ఆస్తులకు కూడా ఇప్పుడు విలువ లేదు. లిక్కర్ కింగ్ , వ్యాపార దిగ్గజం అన్న మాటలు…మాల్యా గత చరిత్ర …ఇప్పుడు విజయ్‌ మాల్యా చెల్లని కాసు…. మాత్రమే….!

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *