విక్రమ్ ల్యాండర్ కథ ముగిసినట్టేనా?

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ఎంతో ప్రతిష్ఠాత్మకంగా ప్రయోగించిన చంద్రయాన్‌-2 చివరి అంకంలో నిలిచిపోయింది. ఆర్బిటర్ నుంచి విడిపోయిన విక్రమ్‌ ల్యాండర్‌ సెప్టెంబరు 7 తెల్లవారుజామున చంద్రుడిపైకి దిగుతూ 2.1 కిలోమీటర్ల దూరంలో భూకేంద్రంతో సంకేతాలు ఆగిపోయాయి. నిర్దేశిత ప్రదేశానికి సమీపంలో విక్రమ్ హార్డ్ ల్యాండింగ్ అయినట్టు శాస్త్రవేత్తలు గుర్తించారు. తిరిగి దానితో కమ్యూనికేషన్ పునరుద్ధరణకు ఇస్రో శతవిధాల ప్రయత్నించింది. ఇందుకు అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా తీసుకుని చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. దీంతో విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్‌ రోవర్‌ల కథ ముగిసినట్టే. అత్యంత క్లిష్టమైన దక్షిణ ధ్రువంపై ల్యాండర్‌ను దింపడానికి ఇస్రో ప్రయత్నించింది. ఆ ప్రదేశంపై 14 రోజుల పగటి సమయం శనివారం ఉదయం ముగిసింది.

రెండు వారాల పాటు సాగే రాత్రి మొదలు కావడంతో నేటి నుంచి అక్కడ ఉష్ణోగ్రతలు మైనస్‌ 200 డిగ్రీలకు చేరుకుంటాయి. ఈ ఉష్ణోగ్రతను ల్యాండర్‌, అందులోని రోవర్‌ తట్టుకోలేవు. చంద్రుడి ఉపరితలాన్ని విక్రమ్ బలంగా ఢీకొట్టడంతో ‘హార్డ్‌ ల్యాండింగ్‌’ జరిగినట్లు ఆర్బిటర్‌లోని కెమెరా తీసిన చిత్రాల ఆధారంగా ఇస్రో స్పష్టం చేసింది. ల్యాండర్‌ నుంచి భూ కేంద్రానికి సంకేతాలు నిలిచిపోవడానికి గల కారణాలపై విద్యావేత్తలు, ఇస్రో నిపుణులతో కూడిన ఒక జాతీయ స్థాయి కమిటీని నియమించారు. కారణాలను విశ్లేషించి ఈ కమిటీ రూపొందించిన నివేదికను త్వరలోనే వెలువరిస్తామని ఇస్రో తెలిపింది.

Videos