సెల్ఫ్ గోల్ తో కత్తి మహేశ్ డంగైపోయాడా?

జనసేన అధినేత – పవర్ స్టార్ పవన్ కల్యాణ్ పై వరుస సెటైర్లతో విరుచుకుపడుతూ పెద్ద సంచలనంగా మారిన టాలీవుడ్ క్రిటిక్ కత్తి మహేశ్ సింగిల్ దెబ్బతో దాదాపుగా డంగైపోయాడన్న వాదన వినిపిస్తోంది. పవన్ కల్యాణ్ సినిమాలతో పాటుగా పవన్ రాజకీయాలపైనా ఇప్పటిదాకా చాలానే మాట్లాడిన కత్తి మహేశ్… నిజంగా తెలుగు రాష్ట్రాల్లో పాపులర్ అయిపోయారు. పవన్ పై కామెంట్లకు బదులుగా పవర్ స్టార్ ఫ్యాన్స్ కత్తి మహేశ్ పై నిజంగానే కత్తి కట్టేశారు. ఘాటైన వ్యాఖ్యలతో బెదిరించడం – ఎస్సెమ్మెస్ లు పంపడం – అనరాని మాటలు అంటూ వీడియో మెసేజ్ లు పంపి పవన్ ఫ్యాన్స్ నిజంగానే కత్తి మహేశ్ కు కంటి మీద కునుకు లేకుండానే చేసేశారన్న వాదన లేకపోలేదు. అయితే బెదిరింపులనే వేదికగా చేసుకుని కత్తి మహేశ్ తనదైన స్టైల్లో కొత్త తరహాలో విమర్శలు సంధిస్తూ… పవన్ లోని లోపలి కోణం ఇదేనంటూ సోషల్ మీడియాతో పాటు ఎలక్ట్రానిక్ మీడియా వేదికగా తనదైన శైలిలో రాణించారు. వెరసి ప్రింట్ మీడియాకూ ఎక్కేసిన కత్తి మహేశ్ ను నిలువరించడం ఇక పవన్ తరం కాదని – పవన్ ఫ్యాన్స్ తరమూ కాదని కూడా అనుకునే దాకా పరిస్థితి వచ్చిందన్న విశ్లేషణలు సాగాయి. ఈ క్రమంలో టాలీవుడ్ హీరోయిన్ పూనం కౌర్ ట్విట్టర్ వేదికగా చేసిన కొన్ని కామెంట్లను ఆధారం చేసుకుని మరింత రెచ్చిపోయేందుకు యత్నించిన కత్తి మహేశ్… సెల్ఫ్ గోల్ తో బొక్క బోర్లా పడ్డారన్న కోణంలో కొత్త వాదన తెరపైకి వచ్చేసింది.

మొన్నటిదాకా పవన్ కల్యాణ్ – ఆయన అభిమాన గణంపై కత్తి మహేశ్ చేసిన మాటల దాడులకు కొంత మేర మద్దతు లభించించిన మాట కాదనలేనిదే. అసలు పవన్ లోని మరో కోణాన్ని ఏమాత్రం భయం లేకుండా కత్తి మహేశ్ బయటపెడుతున్నారని భావించిన వారూ లేకపోలేదు. మొన్నటిదాకా మహిళల జోలికి వెళ్లకుండా కేవలం పవన్ – ఆయన ఫ్యాన్స్ ను మాత్రమే టార్గెట్ చేసిన కత్తి మహేశ్ కు కొన్ని వర్గాల నుంచి పెద్ద మద్దతే దక్కింది. అసలు కత్తి మహేశ్ మాట్లాడుతున్న దాంట్లో తప్పేముందని ప్రశ్నించిన వారు కూడా లేకపోలేదు. అయితే ఎప్పుడైతే కత్తి మహేశ్… పూనం కౌర్ సెంట్రిక్ గా మొన్నటి నుంచి చేస్తున్న వ్యాఖ్యలు… లైవ్ షోలలో వినిపిస్తున్న వాదనలు అతడిని ఒక్కసారిగా కిందపడేశాయన్న వాదన వినిపిస్తోంది. కత్తి మహేశ్ పేరును ప్రస్తావించకుండా పూనం కౌర్ కొన్ని ట్వీట్లు చేయడం ఆ ట్వీట్లు తనను టార్గెట్ చేస్తూ దూసుకువచ్చినవేనని కత్తి మహేశ్ భావించడం ఆ తర్వాత పూనంకు పవన్ తో లింకులు పెట్టి… కత్తి మహేశ్ ఘాటు వ్యాఖ్యలు చేయడంతో పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది.

పూనం కౌర్ ఓ మహిళ అన్న భావన కూడా లేకుండా కత్తి మహేశ్ వ్యవహరిస్తున్నారని ఈ తరహా తీరు ఏమాత్రం సరికాదన్న వాదన నిన్నటిదాకా ఆయనకు మద్దతుగా నిలిచిన వారి నోట నుంచే వినిపిస్తోంది. అదే సమయంలో నిన్నటిదాకా పవన్ ను మాత్రమే టార్గెట్ చేస్తూ వ్యాఖ్యలు చేసిన కత్తి మహేశ్ ను తెలుగు చిత్రసీమ కూడా పెద్దగా పట్టించుకోలేదు. అయితే ఎప్పుడైతే… టాలీవుడ్ కే చెందిన హీరోయిన్ పూనం సెంట్రిక్ గా కత్తి మహేశ్ వ్యాఖ్యలు చేయడంతో చిత్ర పరిశ్రమ కూడా ఇప్పుడు ఈ విషయంపై దృష్టి సారించక తప్పలేదన్న వాదన వినిపిస్తోంది. అంతేకాకుండా ఓ మహిళగా పూనంకు మద్దతుగా నిలవాల్సిన ఆవశ్యకతను కూడా చిత్ర పరిశ్రమకు చెందిన హోల్ అండ్ సోల్ సంస్థ మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్(మా) కాస్తంత సీరియస్ గానే పరిగణిస్తున్నట్లు కూడా సమాచారం. ఇప్పటిదాకా జరిగిన తంతు ఇంతటితో ఆగితే సరేసరి… ఇంతకంటే మరొక్క మాట కత్తి మహేశ్ నోట నుంచి వస్తే… ఆయనకు ఏకంగా నోటీసులు జారీ చేసేందుకు కూడా వెనుకాడేది లేదని *మా*  కార్యవర్గం భావిస్తున్నట్లుగా ప్రచారం సాగుతోంది.

కత్తి మహేశ్ కు వివేక్ బ్రేకేలేసేశారుగా!

ఇదిలా ఉంటే… నిన్న ఉదయం సోమాజీగూడ ప్రెస్ క్లబ్ వేదికగా జరిగిన రచ్చ తర్వాత నేరుగా పలు టీవీ ఛానెళ్లకు వెళ్లిన కత్తి మహేశ్… ఆయా ఛానెళ్లు నిర్వహించిన లైవ్ షోలలో పూనంపై తాను చేసిన వ్యాఖ్యల్లో తప్పేమీ లేదని వాదించారు. ఈ వాదనకు కొందరు మద్దతు పలికినా… మునుపటి స్థాయిలో మాత్రం మద్దతు దక్కలేదనే చెప్పాలి. ఈ క్రమంలో ఉదయం నుంచి రాత్రి దాకా దాదాపుగా తెలుగు ఛానెళ్లన్నింటి దగ్గరకు వెళ్లిన కత్తి మహేశ్ చాలా బిజీబిజీగా గడిపారు. అయితే చివరాఖరుగా మహా టీవీ నిర్వహించిన లైవ్ షోకు వెళ్లిన కత్తి మహేశ్ కు టాలీవుడ్ దర్శకుడు – రచయిత వివేక్ రూపంలో సడెన్ బ్రేక్ పడక తప్పలేదన్న వాదన వినిపిస్తోంది. ఓ పౌరుడిగా చర్చకు వచ్చానని చెప్పిన వివేక్… *అందరినీ ప్రశ్నించే మీరు.. నేను అడిగే ప్రశ్నలకు మీరు సమాధానం చెప్పి తీరాల్సిందే*నంటూ కొత్త వాదన తెచ్చి కత్తి మహేశ్ కు షాకిచ్చారనే చెప్పాలి.

ప్రపంచంలో ఏ ఒక్కరికైనా తొలి ఉపాధ్యాయురాలిగా పరిగణిస్తున్న తల్లి ప్రస్తావన తెచ్చిన వివేక్… *మొదట మీ తల్లి గురించి ఓ రెండు నిమిషాలు చెప్పండి… ఆ తర్వాత చర్చ మొదలుపెడదాం* అంటూ కత్తి మహేశ్ నోటికి తాళమేశారన్న వాదన వినిపిస్తోంది. వివేక్ ప్రశ్నకు సమాధానం చెప్పలేక కత్తి మహేశ్ షో నుంచి విసవిసా వెళ్లిపోయిన తీరు *కత్తి* మద్దతుదారులకు కూడా షాకింగ్ గానే మారిపోయిందని చెప్పాలి. అసలు కత్తి మహేశ్ తల్లి ఆయనకు ఏం నేర్పారన్న విషయాన్ని తెలుసుకునేందుకే తాను *అమ్మ* ప్రస్తావన తెచ్చానని చెప్పిన వివేక్ వాదనకు నిజంగానే చాలా వర్గాల నుంచి అప్లాజ్ వచ్చింది. కత్తి మహేశ్ కు సరైన సమాధానం చెప్పారంటూ వివేక్ కు ప్రశంసలు కూడా వెల్లువెత్తాయి. మొత్తానికి కత్తి మహేశ్ స్పీడుకు చివరకు వివేక్ బ్రేకులేశారన్న వాదన ఇప్పుడు సర్వత్రా వినిపిస్తోంది.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *