ఆ వ్యాఖ్యలు సరి కాదు: ఎన్టీఆర్ వ్యాఖ్యలపై స్పందించిన మహేష్ కత్తి

‘జై లవకుశ’ జయోత్సవ సభలో సినీ విమర్శకులపై జూనియర్ ఎన్టీఆర్ చేసిన వ్యాఖ్యలపై విమర్శకుడు మహేష్ కత్తి సోషల్‌మీడియా ద్వారా స్పందించారు. విమర్శ అనేది సినిమాను బట్టి ఉంటుంది తప్ప క్రిటిక్స్‌ని బట్టి సినిమాలు తయారవ్వవని మహేష్ కత్తి అభిప్రాయ పడ్డారు. సినిమా ఎలా ఉందనేది ప్రేక్షకులే డిసైడ్ చేస్తున్నారని, విమర్శకుడు కేవలం వాళ్లకు అభిప్రాయాన్ని పంచే స్నేహితుడి లాంటివాడని మహేష్ అన్నారు.

ప్రేక్షకుడు తన అనుభూతి మాత్రమే చెప్పగలుగుతాడని, విమర్శకుడు తన అనుభూతికి సంబంధించి ఆలోచనలను కూడా పంచుకోగలడని కత్తి చెప్పారు. విమర్శకుడు కూడా ప్రేక్షకుడేనని, కాకపోతే ప్రేక్షకుల కంటే కొంచెం ఎక్కువ తెలిసినవాడని.. అలాంటప్పుడు ప్రేక్షకుడికి ఉన్న హక్కు సమీక్షకుడికి లేదనడం సరైనది కాదని మహేష్ కత్తి అన్నారు. ‘సినిమా ఎలా ఉందో ప్రేక్షకులను చెప్పనివ్వండి.. విమర్శకులు ఏం మాట్లాడకండి’ అంటూ ఎన్టీఆర్ చేసిన వ్యాఖ్యలను మహేష్ కత్తి ఖండించారు. ఇది వాక్ స్వాంతంత్ర్యానికి విరుద్ధమన్నారు.
‘‘ప్రేక్షకుడు థియేటర్ నుంచి బయటకు రాగానే సినిమా ఎలా ఉందో చెప్పమని ఈ మధ్య మైకులు పెడుతున్నారు. ఆ సమయంలో కొంతమంది చెత్త సినిమా అంటుంటే మరికొంత మంది బ్రహ్మాండంగా ఉందంటున్నారు. ఇంకొందరేమో డబ్బులు దండగా అంటున్నారు. ఇవన్నీ ప్రేక్షకుడి హక్కులైనప్పుడు సమీక్షకుడికి ఆ హక్కు లేకుండా ఎలా పోతుంది? కాబట్టి సినిమా ఎలా ఉందో ప్రేక్షకుడు డిసైడ్ చేస్తాడు… సమీక్షకులు ఏం మాట్లాడకండి అంటే నో ఆర్గ్యుమెంట్స్.
మీరు సమీక్షకులకు ఎక్కవ క్రెడిట్ ఇస్తున్నారేమో అని నా పెద్ద బాధ. ఎందుకంటే కొన్ని సినిమాలకు అందరూ బాగలేదనే రివ్యూ ఇచ్చినా కూడా ఆ సినిమా బాగా ఆడి 100 కోట్లు కలెక్ట్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. కాస్త ఓకే అయిన సినిమాను సమీక్షకులు బాగుందని చెప్పడం వల్ల దానికి 20 శాతం కలెక్షన్లు పెరిగుంటాయి. అంతే తప్ప ఓ విమర్శకుడు చెప్పడం వల్లే సినిమా ఆడలేదనడం సరికాదు’’ అని మహేష్ కత్తి అభిప్రాయపడ్డారు. సమీక్షకుడి అభిప్రాయం వల్ల ప్రేక్షకులు ప్రభావితం అవుతారనే విషయాన్ని తాను నమ్మనని, అనవసరంగా క్రిటిక్స్‌‌ను పాయింట్ అవుట్ చేసి మాట్లాడుతూ తన లాంటి వారికి పాపులారిటీ పెంచుతున్నారని మహేష్ వ్యాఖ్యానించారు. తనలాంటి వాళ్లకు పాపులారిటీ అనవసరమని, క్రిటిక్స్‌కు అనవసరంగా ఎక్కువ ఇంపార్టెంట్స్ ఇవ్వకూడదని మహేష్ కత్తి సూచించారు.
Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *