సమీక్ష : మన ఊరి రామాయణం – రాముడిలోని రావణుడి కథ..!

కథ :

భుజంగయ్య (ప్రకాష్ రాజ్).. ఊర్లో పేరూ, పలుకుబడి ఉన్న ఓ పెద్ద మనిషి. తన కుటుంబంతో పాటు సమాజంలోనూ మంచి వ్యక్తిగా, పరువు ప్రతిష్టలతో జీవితం గడపాలన్నదే భుజంగయ్య కోరిక. అలాంటి మనిషి కుటుంబంతో చిన్న గొడవ పడి, ఆ కోపంలో ఒకరోజు ఓ వేశ్య (ప్రియమణి)తో సరదాగా గడపాలనుకుంటాడు. అయితే కొన్ని అనుకోని పరిస్థితుల్లో భుజంగయ్య తన ఇంటిని ఆనుకొనే ఉండే ఓ చిన్న కొట్టులో ప్రియమణితో పాటు చిక్కుకుపోతాడు. ఆ తర్వాత తన పరువు పోకుండా, ఎవ్వరికీ ఈ విషయం తెలియకుండా భుజంగయ్య ఎలా బయటపడ్డాడు? ఈ మొత్తం తతంగంలో ఆయనలో వచ్చిన మార్పేంటీ అన్నదే సినిమా.

ప్లస్ పాయింట్స్ :

ప్రకాష్ రాజ్ నటనను, ఆయన ఎంచుకున్న కథను ఈ సినిమాకు ప్రధాన బలంగా చెప్పుకోవాలి. ప్రపంచం దృష్టిలో రాముడిలా, మంచి వాడిలా కనబడే వ్యక్తికే రావణాసురిడి తరహాలో తప్పుడు ఆలోచనలు వస్తే ఎలా ఉంటుందన్న ఆలోచనను కథగా మలిచిన విధానం చాలా బాగుంది. ఆ కథను సినిమాగా మలచడంలో కూడా ప్రకాష్ రాజ్ చూపిన ప్రతిభను మెచ్చుకోవచ్చు. ముఖ్యంగా కథలోని ఎమోషన్ కట్టిపడేసేలా ఉంది. ఆ ఎమోషన్‌ను కూడా ఎక్కడా స్థాయి మించనివ్వకుండా చూడడం ఇంకా బాగా ఆకట్టుకుంది. ఇక కథానుసారంగా వచ్చే జెన్యూన్ ఫన్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ప్రకాష్ రాజ్ రైటింగ్‌లోని ప్రతిభంతా కథ నుంచే పుట్టించిన ఫన్‌లో చూడొచ్చు.

భుజంగయ్య పాత్రలో ప్రకాష్ రాజ్ నటనలో తన స్థాయిని మరోసారి చాటిచెప్పారు. చిన్న చిన్న ఎమోషన్స్‌ను పలికించడంలో ఆయన చూపిన నేర్పు గురించి ఎంత చెప్పినా తక్కువే. క్లైమాక్స్ సన్నివేశాల్లో అయితే ఆయన నటన అద్భుతమనే చెప్పాలి. ప్రియమణి తన పాత్రలో ఒదిగిపోయి నటించేసింది. ఎండ్‌కార్డ్ పడే సమయంలో ప్రియమణి నటన సింప్లీ సూపర్బ్ అనాల్సిందే. సత్యదేవ్ ప్రకాష్ రా‌జ్‌కు నమ్మిన భంటుగా చాలా బాగా చేశాడు. కామెడీ పాత్రలతోనే ఎక్కువగా మెప్పిస్తూ ఉండే పృథ్వీ ఇందులో ఓ బలమైన సీరియస్‌నెస్ ఉన్న పాత్రలో నటించి కట్టిపడేశాడు.

మైనస్ పాయింట్స్ :

ఫస్టాఫ్‌లో కొన్నిచోట్ల కథా వేగం తగ్గి బోర్ కొట్టించడం మైనస్‌గా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా కొన్నిచోట్ల అనవసరమైన సన్నివేశాలతో కథలోకి వెళ్ళకుండా పక్కదార్లు పట్టినట్లు అనిపించింది. ఇక రెగ్యులర్ కమర్షియల్ అంశాల జోలికి అస్సలు పోకుండా ఉన్న ఈ సినిమా అలాంటి అంశాలే కోరేవారికి నచ్చకపోవచ్చు.

సాంకేతిక విభాగం :

ముందుగా దర్శకుడు ప్రకాష్ రాజ్ గురించి చెప్పుకుంటే, నటనపరంగానే కాక దర్శకుడిగానూ తనది ప్రత్యేక శైలి అని మరోసారి నిరూపించుకున్నారు. ఒక సింపుల్ పాయింట్ నుంచి కథ అల్లి, దానికి మంచి ఎంగేజింగ్ స్క్రీన్‌ప్లే రాసుకొని రచయితగా ప్రకాష్ రాజ్ బాగా ఆకట్టుకున్నారు. ఒక చిన్న ప్రపంచం చుట్టూనే తిరిగే అలాంటి కథను సినిమాగా తెరకెక్కించడంలోనూ మేకింగ్ పరంగా ప్రకాష్ రాజ్ చాలాచోట్ల మెరిశారు. ఫస్టాఫ్‌లో అసలు కథలోకి తీసుకెళ్ళకుండా కాస్త నెమ్మదిగా సినిమాను నడిపించడంలో మాత్రం ప్రకాష్ కాస్త తడబడ్డట్టు అనిపించింది.

ఇళయరాజా బ్యాంక్‍గ్రౌండ్ స్కోర్ గురించి ఎంత చెప్పినా తక్కువే. కథలోని అసలైన ఎమోషన్ స్థాయిని పెంచేలా ఇళయరాజా అందించిన స్కోర్ చాలా బాగుంది. ఇక ముకేశ్ సినిమాటోగ్రఫీ న్యాచురల్‌గా బాగుంది. శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్, శశిధర్ ఆర్ట్ వర్క్ బాగున్నాయి. ప్రొడక్షన్ వ్యాల్యూస్ సినిమా అవసరానికి తగ్గట్టు బాగున్నాయి.

విడుదల తేదీ : అక్టోబర్ 07, 2016

రేటింగ్ : 2.75/5

దర్శకత్వం : ప్రకాష్ రాజ్

నిర్మాత : ప్రకాష్ రాజ్

సంగీతం : ఇళయరాజా

నటీనటులు : ప్రకాష్ రాజ్, ప్రియమణి, సత్య దేవ్, పృథ్వీ..

 

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *