కాసుల కోసం కాళ్లు కోశారు – హాస్పిటల్ వద్ద కుటుంబసభ్యుల ఆందోళన

హైదరాబాద్: లక్డీకాపూల్‌లోని గ్లోబల్ ఆసుపత్రి వైద్యుల నిర్వాకం తీవ్ర విమర్శలకు దారి తీసింది. నిఖిల్ రెడ్డి అనే యువకుడికి ఎత్తు పెంచుతామంటూ లక్షల్లో డబ్బులు వసూలు చేసి ఆపరేషన్ నిర్వహించిన ఘటన కలకలం రేపుతోంది. కాసుల కోసం కక్కుర్తిపడిన వైద్యులు.. ప్రమాదంలో కాలు విరిగిన సందర్భంలోనో, క్యాన్సర్‌ వంటి వ్యాధులతో ఎముకలను తొలగించాల్సి వచ్చినప్పుడో చేయాల్సిన శస్త్రచికిత్సను ఎత్తు పెంచాలని కోరిన నిఖిల్ రెడ్డికి చేశారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

శస్త్ర చికిత్స చేశారిలా… మూడు అంగుళాల ఎత్తు పెంచేందుకు నిఖిల్‌ మోకాళ్ల కింద రెండు చోట్లా గాట్లు పెట్టి కాళ్ల ఎముకలను కట్‌ చేసి, మధ్యలో ఇనుపరాడ్లను బిగించి శస్త్రచికిత్స పూర్తి చేశారు. క్రమంగా అక్కడ ఎముక వృద్ధి చెందుతుందని, తద్వారా ఎత్తు పెరగవచ్చని శస్త్రచికిత్స నిర్వహించిన వైద్యులు నిఖిల్‌కు వివరించినట్టుగా తెలుస్తోంది. కాగా, ఈ చికిత్స పైన వైద్య నిపుణులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారట. కాళ్లను కోసి, ఎత్తు పెంచే ఈ విధానాన్ని ఇల్‌జర్వ్‌‌గా వ్యవహరిస్తుంటారని, ఇది రష్యన్‌ చికిత్స విధానమని, ప్రమాదాల్లో కాలుకు తీవ్రంగా దెబ్బతగిలి, విరిగిన సందర్బాల్లో మాత్రమే ఈ చికిత్సలో ఎముకల పొడవును పెంచి పూర్వపు రూపాన్ని తీసుకొస్తారని అంటున్నారు. ఇది ఎంతో సంక్లిష్టతతో కూడుకున్న ప్రక్రియ.

ఈ ఘటన వివరాలు కుటుంబ సభ్యులు, హాస్పిటల్ సిబ్బంది కథనం ప్రకారం ఇలా ఉన్నాయి. జీడిమెట్లలోని సుచిత్ర ప్రాంతానికి చెందిన నిఖిల్ కుమార్‌రెడ్డి (22) సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు. ఐదడుగుల ఏడంగుళాల ఎత్తున్న నిఖిల్‌కు మరింత ఎత్తు పెరగాలన్న ఆశ కలిగింది. స్నేహితుడు రోహిత్ సహాయంతో ఆరునెలల క్రితం లక్డీకాపూల్‌లోని గ్లోబల్ హాస్పిటల్ ఆర్థోపెడిక్ వైద్యుడు చంద్రభూషణ్‌ను సంప్రదించాడు. తరచూ దవాఖానను సందర్శిస్తూ డాక్టర్ ఇచ్చే సూచనలు పాటిస్తూ వస్తున్నాడు. మంగళవారం శస్త్రచికిత్స చేయాలని నిర్ణయించడంతో గత మూడురోజుల క్రితం ఇంట్లో చెప్పకుండా వెళ్లిపోయాడు. ఢిల్లీ వెళ్తున్నట్టు సోదరుడు నితిన్‌రెడ్డికి ఈ-మెయిల్ పంపాడు.

ఈ విషయాన్ని నితిన్‌రెడ్డి తల్లిదండ్రులకు చెప్పడంతో వారికి అనుమానం వచ్చి పేట్‌బషీర్‌బాగ్ పోలీస్‌స్టేషన్‌లో సోమవారం ఫిర్యాదు చేశారు. దర్యాప్తు చేపట్టిన సైబర్‌క్రైం పోలీసులు నిఖిల్ సెల్‌ఫోన్ సిగ్నల్, ఫోన్‌కు ఉండే ఐఎంఈఐ నంబరు ఆధారంగా శోధించగా.. లక్డీకాపూల్ ప్రాంతంలో ఉన్నట్లు గుర్తించారు. నిఖిల్‌రెడ్డి ఆచూకీని ఆరా తీస్తూ పోలీసులతోపాటే తల్లిదండ్రులూ గ్లోబల్ హాస్పిటల్‌కు చేరుకొన్నారు. నిఖిల్‌కుమార్‌రెడ్డికి ఆపరేషన్ జరుగుతున్నట్టు రిసెప్షనిస్టు ద్వారా తెలుసుకున్నారు. దాంతో హాస్పిటల్ వర్గాలను నిలదీయడంతో అప్పటికే ఆపరేషన్ ప్రారంభమైందని తెలిపారు. ఆగ్రహానికి గురైన తల్లిదండ్రులు, బంధువులు తమ అనుమతి లేకుండా శస్త్ర చికిత్స ఎలా చేస్తారంటూ హాస్పిటల్ ఎదుట ఆందోళన చేపట్టారు.

కాళ్లు కట్ చేసి.. రాడ్లు అమర్చి..
నిఖిల్‌కుమార్‌రెడ్డికి శస్త్రచికిత్సలో భాగంగా మోకాలి కింది భాగంలో ఎముకను కట్ చేసి.. సపోర్ట్‌గా రాడ్లను అమర్చారు. ప్రస్తుతం ఐసీయులో వైద్యుల పర్యవేక్షణలో ఉన్నాడు. ఈ రకమైన చికిత్స చేసుకున్న వారు కనీసం తొమ్మిది నెలలు పడకకే పరిమితమై విశ్రాంతి తీసుకోవాల్సి ఉంటుందని వైద్యులు సూచించడం గమనార్హం. ఈ చికిత్స వ్యవహారం వివాదం కావడంతో నిఖిల్ స్నేహితుడు రోహిత్ కనిపించకుండా పోయాడు. ఈ ఆపరేషన్‌కోసం ఏడు లక్షలు ఖర్చవుతుందని సమాచారం. ఇప్పటికే నిఖిల్‌నుంచి రూ.3.50లక్షలను హాస్పిటల్ వసూలు చేసినట్టు తెలుస్తున్నది.

డబ్బుల కోసమే చేశారు: తండ్రి
ఇలాంటి క్లిష్టమైన చికిత్స చేస్తున్నపుడు నిబంధనల ప్రకారం తప్పకుండా కుటుంబసభ్యుల అనుమతి తీసుకోవాలని నిఖిల్‌కుమార్‌రెడ్డి తండ్రి గోవర్ధన్ అన్నారు. ఆరుగంటలపాటు కొనసాగే ఇంతటి పెద్ద ఆపరేషన్‌పై తమకు సమాచారం ఎందుకు ఇవ్వలేదని వైద్యులపై మండిపడ్డారు. అప్పటికే 5.7 అడుగుల ఎత్తున్న నా కుమారుడికి మరింత ఎత్తు పెరుగాలని ఆశ ఉంటే.. ఈ ఆపరేషన్‌కు ముందు కౌన్సెలింగ్ ఎందుకు ఇవ్వలేదు? అని నిలదీశారు. ఎంతో రిస్కుతో కూడిన ఈ ఆపరేషన్‌ను కేవలం డబ్బుల కోసమే చేశారని గోవర్ధన్ వాపోయారు.

నిబంధనల ప్రకారమే.. సర్జరీ నిర్వహించాం

హాస్పిటల్ సిబ్బంది మాత్రం తాము నిబంధనలకు అనుగుణంగానే నిఖిల్‌రెడ్డికి చికిత్స చేశామని చెప్తున్నారు. ఎత్తు పెరుగడంకోసం గత ఆరు నెలలుగా నిఖిల్‌రెడ్డి హాస్పిటల్ వైద్యుడిని సంప్రదిస్తున్నాడు. వైద్యుడి సూచనమేరకు మంగళవారం శస్త్రచికిత్స నిర్వహించారు. నిబంధనలన్నింటినీ పాటించాం. ఇందులో మా తప్పేమీ లేదు. మెడికో లీగల్ కేసు కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. సర్జరీ తర్వాత వచ్చే సమస్యలను నిఖిల్‌రెడ్డికి ముందే వివరించాం. అతడి పూర్తి సమ్మతి, స్నేహితుడి సంతకం తీసుకున్న తర్వాతనే లింబ్ లెంథనింగ్ విత్ లింబ్ రీ కన్‌స్ట్రక్షన్ సర్జరీ నిర్వహించాం, ప్రస్తుతం నిఖిల్ ఆరోగ్యంగా ఉన్నాడు అని గ్లోబల్ హాస్పిటల్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ షిబాజీ ఛటోపాధ్యాయ చెప్పారు.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *