‘అమ్మ’కన్నా ‘పవిత్ర’మైనదా.?

మదర్‌ థెరీసా.. ఈ పేరు తెలియనివారుండరు మన దేశంలో. తెల్లని వస్త్రం.. దానికి చివర్న నీలం రంగు అంచు. చూడగానే ‘అమ్మ’ గుర్తుకొస్తుంది. ఏమో, అమ్మ అయినాసరే.. తన బిడ్డలకి తీవ్రమైన అనారోగ్యం సంభవిస్తే.. సపర్యలు చేయడానికి ఒకింత తటపటాయిస్తుందేమో.! కానీ, ఈ అమ్మ అలా కాదు. ఎక్కడో పుట్టింది.. ఇండియాకి వచ్చింది. కుష్టు రోగుల్ని అక్కున చేర్చుకుంది. ‘ఓ మతానికి ప్రాచుర్యం కల్పించేందుకు..’ అనే విమర్శలు వచ్చినా లెక్క చేయలేదు.

పేరులోని ‘మదర్‌’ని ఆమె చేర్చుకోలేదు.. ఆమెను అమ్మలా చూసుకున్నవారే, ఆ పేరు పెట్టేశారు. నర్స్‌గా, టీచర్‌గా ప్రారంభమైన ఆమె జీవితం, అనేక మలుపులు తిరిగింది. మిషనరీస్‌ ఆఫ్‌ ఛారిటీ పేరుతో.. భారతదేశం కేంద్రంగా సేవా కార్యక్రమాల్ని విస్తరించారు మదర్‌ థెరీసా. జన్మతః ఆమె మనదేశానికి చెందిన వ్యక్తి కాదు. కానీ, ఆమె మన భారతీయురాలు. మన భారతరత్నం. దేశంలోని అత్యున్నత పౌర పురస్కారం ఎలాంటి వివాదాల్లేకుండా మదర్‌ థెరీసాని వరించిందంటే, ఆమె గొప్పతనమేంటో అర్థం చేసుకోవచ్చు.

కుష్టు రోగుల్ని చూసేందుకే భయపడతారెవరైనా. కానీ, ఆమె తాకింది. అత్యంత దుర్భరమైన పరిస్థితుల్లో వున్నవారికి ఆమె సేవ చేసింది. ఆమె చేయడమే కాదు, తనతోపాటు ఓ సైన్యాన్ని తయారు చేసింది. అదీ మదర్‌ థెరీసా గొప్పతనం. వాటికన్‌ సిటీలో పోప్‌  ఆమెకు ‘సెయింట్‌’ (పవిత్ర) హోదా కల్పించారు. చాలా అరుదుగా మాత్రమే ఈ హోదా కల్పిస్తుంటారు. భారతరత్న, సెయింట్‌, ఇంకేవేవో గుర్తింపులు.. ఇవన్నీ ‘అమ్మ’ ముందు చాలా చిన్నవే.

19 ఏళ్ళ వయసులో భారతదేశానికి వచ్చిన మదర్‌ థెరీసా, 1997లో భారతదేశంలోనే కోల్‌కతాలో తుది శ్వాస విడిచారు. ఆమె భౌతికంగా లేకపోయినా, మిషనరీస్‌ ఆఫ్‌ ఛారిటీ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. అదంతా ఒక ఎత్తు. మదర్‌ థెరీసా స్ఫూర్తితో ‘సేవా రంగంలోకి’ ఎందరో వచ్చారు.. నిస్వార్ధంగా అభాగ్యుల్ని ఆదుకుంటున్నారు. థెరీసాలా కాకపోయినా, ఆమె స్ఫూర్తితో ఇంకా సేవా కార్యక్రమాలు అందుతున్నాయంటే ఆమె వారిలో జీవించి వున్నట్లే కదా.!

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *