ఐపీఎల్‌ 11:తొలి పోరులో ముంబైతో చెన్నై ఢీ.. పాత సమయాల్లోనే ఐపీఎల్‌

దశాబ్ద కాలంగా అభిమానులను ఉర్రూతలూగిస్తున్న ధనాధన్‌ క్రికెట్‌ సంగ్రామం ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) పదకొండో సీజన్‌కు కౌంట్‌డౌన్‌ మొదలైంది. టోర్నీలో అత్యంత విజయవంతమైన జట్ల మధ్య పోరుతో కొత్త సీజన్‌ ఆరంభం కానుంది. రెండేళ్ల విరామం తర్వాత బరిలోకి దిగుతున్న చెన్నై సూపర్‌ కింగ్స్‌… డిఫెండింగ్‌ చాంపియన్‌, అత్యధికంగా మూడుసార్లు విజేతగా నిలిచిన ముంబై ఇండియన్స్‌తో తొలిపోరులో పోటీ పడనుంది. ముంబై వాంఖడే స్టేడియంలో ఏప్రిల్‌ 7న చెన్నై-ముంబై పోరుతో లీగ్‌ మొదలవనుంది. ఒక రోజు ముందు (ఏప్రిల్‌ 6) ముంబైలోనే ఆరంభ వేడుక జరగనుంది. అయితే, సర్వత్రా ఆసక్తి రేపిన మ్యాచ్‌ సమయాల్లో మార్పులు జరగలేదు. గత సీజన్‌ మాదిరిగానే తొలి మ్యాచ్‌ 4 గంటలకు, రెండో మ్యాచ్‌ రాత్రి 8 గంటలకు మొదలవనుంది. మ్యాచ్‌ వేళలు మార్చాలని ప్రసారదారు విజ్ఞప్తి చేసినా.. మెజారిటీ ఫ్రాంచైజీలు, యాభై శాతం వాటాదారుల నుంచి వ్యతిరేకత రావడంతో పాత టైమింగ్స్‌నే కొనసాగిస్తూ బీసీసీఐ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు 11వ సీజన్‌ షెడ్యూల్‌ను బుధవారం విడుదల చేసింది. ఐపీఎల్‌ అధికారిక వెబ్‌సైట్‌లో షెడ్యూల్‌ను ఉంచింది. ఆరంభ మ్యాచ్‌తో పాటు మే 22న క్వాలిఫయర్‌-1, 27న ఫైనల్‌కు వాంఖడే స్టేడియం ఆతిథ్యం ఇవ్వనుంది. అయితే, ఎలిమినేటర్‌, క్వాలిఫయర్‌-2 మ్యాచ్‌ల వేదికల్ని ఇంకా ప్రకటించలేదు.
మ్యాచ్‌ వేళలపై మల్లగుల్లాలు..
ఈ సీజన్‌లో 8 గంటలకు 48 మ్యాచ్‌లు, 4 గంటలకు 12 మ్యాచ్‌లను షెడ్యూల్‌ చేశారు. ఒకే రోజు రెండేసి జరిగే మ్యాచ్‌ల టైమింగ్స్‌లో మార్పులు లేకపోవడం అందరికీ ఆశ్చర్యం కలిగించింది. తొలుత మ్యాచ్‌ వేళలు మార్చాలని టోర్నీ ప్రసారదారు స్టార్‌ స్పోర్ట్స్‌ గత నెలలో ఐపీఎల్‌ పాలకమండలికి విజ్ఞప్తి చేసింది. రెండో మ్యాచ్‌ను గంట ముందుగా ఏడు గంటలకు మొదలు పెట్టాలని, వేసవి వేడి దృష్ట్యా తొలి మ్యాచ్‌ను గంటన్నర ఆలస్యంగా సాయంత్రం 5.30 ప్రారంభించాలని స్టార్‌ స్పోర్ట్స్‌ ప్రతిపాదించింది. దీనికి పాలక మండలి అంగీకరించింది. కానీ, తమను సంప్రదించకుండానే ఈ నిర్ణయం తీసుకోవడంతో కొన్ని ఫ్రాంచైజీలతో పాటు ఐపీఎల్‌ రెవెన్యూ మోడల్‌లో వాటాదారులుగా ఉన్న సగం మంది వ్యతిరేకత వ్యక్తం చేశారు. రాత్రి మ్యాచ్‌లు త్వరగా ఆరంభమై.. త్వరగా ముగిస్తే ప్రైమ్‌టైమ్‌ కవరేజ్‌ కూడా వస్తుందని స్టార్‌స్పోర్ట్స్‌ భావించింది. అలాగే, మ్యాచ్‌ ముగిశాక ప్రేక్షకులు ఇళ్లకు, ఆటగాళ్లు హోటళ్లకు రాత్రి పూట ఆలస్యంగా చేరుకునే సమస్య తీరుతుందని ఆశించింది. ఒకరకంగా దీనికి ప్రజల నుంచి సానుకూల స్పందనే వచ్చింది. మ్యాచ్‌ కోసం అర్ధ రాత్రి వరకూ మెలకువగా ఉండడం, స్టేడియాలకు వెళ్లిన వారు తిరిగి తమ గమ్యస్థానాలకు చేరుకొనేందుకు పడే ఇబ్బందులు తొలుగుతాయని భావించారు. కానీ, ఫ్రాంచైజీల మధ్య ఏకాభిప్రాయం లేకపోవడంతో బీసీసీఐ పాత వేళలకే మొగ్గు చూపినట్టు సమాచారం. అయినా కొన్ని ఫ్రాంచైజీలతో పాటు ప్రసారదారు తొలి మ్యాచ్‌ను 3.30, రెండో మ్యాచ్‌ 7 గంటలకు మొదలుపెట్టాలని ఇప్పటికీ ప్రయ త్నిస్తున్నాయి. కాగా, చెన్నైతోపాటు రెండేళ్ల నిషేదం ఎదుర్కొన్న రాజస్థాన్‌ రాయల్స్‌ కూడా ఈ సీజన్‌లో పునరాగమనం చేయనుంది. ఏప్రిల్‌ 9న హైదరాబాద్‌లో జరిగే మ్యాచ్‌లో ఆ జట్టు సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ను ఎదుర్కోనుంది. ముంబై, హైదరాబాద్‌, బెంగళూరు, చెన్నై, ఇండోర్‌, జైపూర్‌, కోల్‌కతా, మొహాలీ 11వ సీజన్‌కు ఆతిథ్యం ఇవ్వనున్నాయి.
Videos

20 thoughts on “ఐపీఎల్‌ 11:తొలి పోరులో ముంబైతో చెన్నై ఢీ.. పాత సమయాల్లోనే ఐపీఎల్‌

Leave a Reply

Your email address will not be published.