పుణెపై ముంబై ఘన విజయం

డిఫెండింగ్ చాంపియన్ ముంబై ఇండియన్స్ హ్యాట్రిక్ విజయంతో అదరగొట్టింది. ఆదివారం జరిగిన మ్యాచ్‌లో ముంబై 8 వికెట్ల తేడాతో రైజింగ్ పుణె సూపర్‌జెయింట్స్‌పై ఘనవిజయం సాధించింది. ధోనీసేన నిర్దేశించిన 160 పరుగుల లక్ష్యఛేదనలో ముంబై 2 వికెట్లు కోల్పోయి మరో 9 బంతులు మిగిలుండగానే విజయాన్నందుకుంది. పుణె పసలేని బౌలింగ్‌ను అలవోకగా ఎదుర్కొంటూ కెప్టెన్ రోహిత్‌శర్మ(60 బంతుల్లో 85నాటౌట్) అజేయ అర్ధసెంచరీతో కదంతొక్కాడు.

సొగసైన బ్యాటింగ్‌కు చిరునామా అయిన రోహిత్ తన ఇన్నింగ్స్‌లో 8ఫోర్లు, 3 భారీ సిక్స్‌లతో చెలరేగాడు. ఈ క్రమంలో రెండో వికెట్‌కు రాయుడు(22)తో కలిసి 52 పరుగుల భాగస్వామ్యం, మూడో వికెట్‌కు బట్లర్(27నాటౌట్)తో 70 పరుగుల అజేయ భాగస్వామ్యాన్ని నెలకొల్పి జట్టు విజయానికి బాటలు వేశాడు. ఈ సీజన్‌లో ఐదో అర్ధసెంచరీతో ఆకట్టుకున్న రోహిత్‌కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ దక్కింది.

అశ్విన్(1/21), దిండా(1/33) ఒక్కో వికెట్ దక్కింది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన ధోనీ సారథ్యంలోని పుణె నిర్ణీత ఓవర్లలో 5 వికెట్లకు 159 పరుగులు చేసింది. జట్టులో ఓపెనర్ సౌరభ్ తివారీ(45 బంతుల్లో 57), స్టీవ్‌స్మిత్(23 బంతుల్లో 45) రాణించడంతో పుణెకు గౌరవప్రదమైన స్కోరు దక్కింది. తన సెంచరీ ఫీట్‌ను పునారవృతం చేస్తూ స్మిత్ బ్యాటింగ్ కొనసాగగా, బంతులు వృథా చేస్తూ తివారీ ఆట సాగింది. ధోనీ(24) పరుగులతో జట్టు స్కోరులో భాగమయ్యాడు. బుమ్రా(3/29) మూడు వికెట్లతో రాణించగా, మెక్‌క్లీగన్(1/27), హర్భజన్‌సింగ్(1/25) ఒక్కో వికెట్ తీశారు.

అయితే హర్భజన్ వేసిన ఇన్నింగ్స్ 11 ఓవర్లో తివారీ కొట్టిన బంతిని బౌండరీ వద్ద ఆపేందుకు రాయుడు తీవ్రంగా ప్రయత్నించినా సాధ్యపడలేదు. దీంతో ఒక్కసారిగా విచక్షణ కోల్పోయిన హర్భజన్..రాయుడిపై తీవ్ర ఆగ్రహంతో ఊగిపోయాడు. దీనికి తానేం తక్కువ కాదన్నట్లు రాయుడు వ్యవహరించడంతో భజ్జీ వెనక్కితగ్గాల్సి వచ్చింది. ఆ తర్వాత ఓవర్లలో ఇద్దరు ఒకరినొకరు నవ్వుకుంటూ పలకరించుకుని కలిసిపోయి వివాదానికి స్వస్తిపలికారు.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *