ఉపఎన్నికపై భూమా అఖిలప్రియ సంచలన ప్రకటన

నంద్యాల ఉప ఎన్నికలలో తమ కుటుంబ సభ్యులే పోటీ చేస్తారంటూ మంత్రి భూమా అఖిలప్రియ సంచలన ప్రకటన చేశారు. పర్యాటక శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి విజయవాడ భవానీ ఐలండ్‌లో పర్యటించిన ఆమె.. పర్యాటకానికి సంబంధించిన విషయాలతో పాటు ఈ అంశంపై కూడా స్పందించారు. మీడియా అడిగిన ప్రశ్నకు సమాధానంగా.. ఈ ఎన్నికలలో తమ కుటుంబం నుంచే పోటీ చేస్తారని, తన తల్లి శోభా నాగిరెడ్డి వర్ధంతి అయిన 24వ తేదీన అభ్యర్థిని ప్రకటిస్తామని ఆమె ఏకపక్షంగా ప్రకటించారు. భూమా నాగిరెడ్డి మరణంతో ఖాళీ అయిన ఈ స్థానం ఉప ఎన్నిక గురించి ఇంతవరకు పార్టీ జాతీయాధ్యక్షుడు చంద్రబాబు గానీ, ఆయన కుమారుడు లోకేష్ గానీ ఒక్క మాట కూడా చెప్పకముందే అఖిలప్రియ ఈ విషయాన్ని వెల్లడించడం నేతలను విస్మయపరిచింది.

వాస్తవానికి నంద్యాల నియోజకవర్గానికి టీడీపీ ఇన్‌చార్జిగా వ్యవహరిస్తున్న శిల్పా మోహన్ రెడ్డి ఈ స్థానాన్ని ఆశిస్తున్నారు. దాంతో ఆయనతో ఈ విషయమై చర్చించడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు మోహన్ రెడ్డిని విజయవాడ రప్పించారు. సాయంత్రం 6 గంటల సమయంలో ముఖ్యమంత్రితో ఆయన భేటీ కావాల్సి ఉండగా, ఈలోపే అఖిలప్రియ ఏకపక్షంగా ఇలా ప్రకటన చేయడం ఎవరికీ మింగుడు పడటం లేదు. అఖిలప్రియకు మంత్రిపదవి ఇచ్చినప్పుడు కూడా అభ్యంతరం చెప్పని శిల్పా మోహన్ రెడ్డి.. ఇప్పుడు టికెట్ దక్కకపోతే మాత్రం ఊరుకునే పరిస్థితి లేదు. ఒకవైపు ఆయనను మంత్రి అచ్చెన్నాయుడు బుజ్జగించే ప్రయత్నం చేస్తుండగా, ఇంతలో భూమా కుటుంబం నుంచి ఇలాంటి విషయం రావడంతో ఒక్కసారిగా కలకలం రేగింది.

Videos

Leave a Reply

Your email address will not be published.