రివ్యూ: ఎంసీఏ (మిడిల్ క్లాస్ అబ్బాయ్‌)’

కథ :
నాని ఎలాంటి బాధ్యత లేకుండా అన్నయ్య (రాజీవ్ కనకాల) మీద ఆధారపడి హ్యాపీగా కాలం గడిపేస్తుంటాడు. తల్లి తండ్రి లేకపోటంతో నానిని గారాబంగా పెంచుతాడు అన్న. అయితే తన అన్నకు పెళ్లి కావటంతో వదిన జ్యోతి (భూమిక) వల్ల తన అన్న తనకు దూరమయ్యాడని ఆమె మీద కోపం పెంచుకుంటాడు నాని. అందుకే దూరంగా వెళ్లి హైదరాబాద్ లో బాబాయ్, పిన్నిలతో కలిసి ఉంటాడు. కానీ ఆర్టీవో గా పనిచేసే జ్యోతికి వరంగల్ ట్రాన్స్ ఫర్ అవుతుంది. ఆమెకు తోడుగా నానిని పంపిస్తాడు. ఇష్టం లేకపోయినా అన్న కోసం వదినకు తోడుగా వెళ్తాడు నాని. అక్కడే హాస్టల్‌లో ఉండి చదువుకునే పల్లవి (సాయి పల్లవి)తో ప్రేమలో పడతాడు. అయితే నాని ప్రేమ విషయం తెలిసిన వదిన జ్యోతి.. పల్లవిని దూరంగా పంపిచేస్తుంది. దీంతో నాని.. వదిన మీద మరింత కోపం పెంచుకొని అక్కడి నుంచి వెళ్లిపోవాలనుకుంటాడు. కానీ అదే సమయంలో వరంగల్ ను భయపెట్టే శివ (విజయ్) అనే వ్యక‍్తి కారణంగా నాని కుటుంబం ప్రమాదంలో పడుతుంది. ఈ ప్రమాదం నుంచి నాని తన కుటుంబాన్ని ఎలా కాపాడుకున్నాడు..? శివ.. నాని ఫ్యామిలీ జోలికి ఎందుకు వచ్చాడు..? నానికి వదిన మీద కోపం తగ్గిందా..? అన్నదే మిగతా కథ.

పాత్రల ఎంపికలో తనదైన ముద్ర వేస్తూ సూపర్ ఫాంలో దూసుకుపోతున్న నాని, మరోసారి ఆసక్తికరమైన పాత్రలో ఆకట్టుకున్నాడు. మిడిల్ క్లాస్ అబ్బాయ్ నానిగా తెలుగు ఆడియన్స్ కు మరింత దగ్గరయ్యాడు. ఇప్పటికే నేచురల్ స్టార్ గా ప్రూవ్ చేసుకున్న ఈ యంగ్ హీరో ఎమోషనల్, రొమాంటిక్ సీన్స్ లో తన మార్క్ చూపించాడు. ఫిదా సినిమాతో టాలీవుడ్ ఆడియన్స్ ను ఫిదా చేసిన సాయి పల్లవి, మిడిల్ క్లాస్ అమ్మాయి పాత్రలో ఒదిగిపోయింది. లేడీ ఓరియంటెడ్ సినిమాలతో సత్తా చాటిన భూమిక మరోసారి కీలక పాత్రలో మెప్పించింది. తన సీనియారిటీతో వదిన పాత్రకు మరింత హుందాతనం తీసుకొచ్చింది. విలన్‌గా నటించిన కొత్త కుర్రాడు విజయ్ ఆకట్టుకున్నాడు. కేవలం హావభావాలతోనే విలనిజాన్నిపండించాడు. ఇతర పాత్రలో రాజీవ్ కనకాల, ప్రియదర్శి, నరేష్, ఆమని తమ పరిధి మేరకు ఆకట్టుకున్నారు.

ప్లస్ పాయింట్స్:

సినిమాకు ప్రధాన ప్లస్ పాయింట్ నాని. మిడిల్ క్లాస్ కుర్రాడిలా నాని నటన చాలా బాగుంది. సినిమా బలహీనపడుతోంది అనే సమయానికి నాని తన నేచ్యురల్ పెర్ఫార్మెన్స్ తో నిలబెట్టే ప్రయత్నం చేశాడు. చాలా చోట్ల సక్సెస్ అయ్యాడు కూడ. ప్రథమార్థంలో వచ్చే నాని, అతని మిడిల్ క్లాస్ జీవితం తాలూకు సీన్లు, వదినకి అతనికి మధ్య నడిచే చిన్నపాటి మనస్పర్ధను బయటపెట్టే సన్నివేశాలు బాగున్నాయి. ఇందులోనే వచ్చే నాని, సాయి పల్లవిల లవ్ ట్రాక్ కూడా కొంత సరదాగా సాగుతూ ఆకట్టుకుంది.

నాని, సాయి పల్లవి కలిసి కనిపించే సన్నివేశాలు అందంగా కనిపిస్తూ కొంత ఆహ్లాదాన్నిచ్చాయి. మరీ పెర్ఫార్మెన్స్ చేసేంత స్కోప్ లేనప్పటికీ సాయి పల్లవి తన పాత్రలో బాగానే నటించింది. భాధ్యతగల వదినగా భూమిక సెటిల్డ్ పెర్ఫార్మెన్స్ చూపి మెప్పించారు. ఇక సెకండాఫ్ చివరి 15 నిముషాల్లో నాని తన వదినను కాపాడుకునే సీక్వెన్స్ బాగుంది. ఇక విలన్ పాత్ర చేసిన విజయ్ పెర్ఫార్మెన్స్ వలన సినిమాలో కొంత తీవ్రత కనబడింది.

మైనస్ పాయింట్స్ :

సినిమాకు ముఖ్యమైన బలహీనత కొత్త కథంటూ లేకపోవడం. చాలా సినిమాల్లో చూసినట్టే మధ్యతరగతికి చెందిన కుర్రాడు అప్పటి వరకు ఖాళీగా ఉంటూ తన కుటుంబానికి ఆపద ఎదురైనప్పుడు హీరోలా మారిపోతాడు. ఇదే ఈ సినిమా పాయింట్ కూడ. ఈ పాయింట్ ను ఆరంభంలో నాని తన నటనతో కొంత ఆసక్తికరంగానే లాగినా ఆ తర్వాత కథనంలో బలహీనత కొట్టొచ్చినట్టు బయటపడటంతో బోర్ కొట్టేసింది.

ముఖ్యంగా ఇంటర్వెల్ కు అసలు కథ రివీల్ అయిపోవడంతో సెకండాఫ్లో ఏం జరుగుతుంది అనేది సులభంగా ఊహించేయవచ్చు. విలన్ పాత్ర యొక్క ముగింపును తప్ప ప్రతి పాత్ర ప్రవర్తన, పరిస్థితి ఎక్కడికక్కడ ఊహకందిపోతూనే ఉంటాయి. దీంతో సినిమాపై పెద్దగా ఆసక్తి కానీ, చూస్తున్నంతసేపు థ్రిల్ కానీ కలగవు.

ఇక క్లైమాక్స్ లో దర్శకుడు కొంత ఎక్కువ స్వేచ్ఛను వాడేసుకోవడం వలన కొన్ని కీలక మలుపుల్లో లాజిక్స్ లోపించాయి. ఎక్కడా మెచ్చుకోదగిన రీతిలో దర్శకత్వ ప్రతిభ కనబడలేదు. ఇక మధ్యలో వచ్చే పాటలైతే ఎక్కడికక్కడ అడ్డుతగులుతున్నట్టే అనిపించాయి. అసలిది దేవిశ్రీ సంగీతమేనా అనిపిస్తుంది. సినిమా ముగిశాక ఒక్కటంటే ఒక్క పాట కూడా గుర్తుకురాదు.

సాంకేతిక విభాగం :

దర్శకుడు వేణు శ్రీరామ్ పాత కథనే తీసుకున్నా దానికి కొత్తగా అనిపించే కథనాన్ని, సన్నివేశాలని రాసుకోవడంలో విఫలమయ్యారు. సినిమాను తొందరగా రొటీన్ కథలోకి తీసుకెళ్లకుండా నానితో ఎక్కువసేపే మేనేజ్ చేసినా ఇక కథలోకి ప్రవేశించక తప్పదు అన్నప్పుడు ఒక్కో లోపం బయటపడుతూ సెకండాఫ్ నిరుత్సాహానికి గురిచేసింది.

దేవి శ్రీ నుండి ఆశించిన స్థాయి సంగీతం ఈ సినిమాలో దొరకలేదు. ప్రవీణ్ పూడి ఎడిటింగ్ పర్వాలేదు. సమీర్ రెడ్డి బాగానే ఉంది. పాటల చిత్రీకరణలో అందం కనబడింది. దిల్ రాజు నిర్మాణ విలువలు ఎప్పటిలాగానే మంచి స్థాయిలో ఉన్నాయి.

రేటింగ్ : 2.5/5

నటీనటులు : నాని, సాయి పల్లవి, భూమిక

దర్శకత్వం : వేణు శ్రీరామ్

నిర్మాత : దిల్ రాజు, శిరీష్ , లక్ష్మణ్

సంగీతం : దేవి శ్రీ ప్రసాద్

సినిమాటోగ్రఫర్ : సమీర్ రెడ్డి

ఎడిటర్ : ప్రవీణ్ పూడి

Videos

Leave a Reply

Your email address will not be published.