రాష్ట్రపతిగా అద్వానీ..ఓకే చెప్పిన మోడీ

రాష్ట్రపతి పదవిపై బీజేపీలో నెలకొన్న ఉత్కంఠకు తెరపడినట్లు తెలుస్తోంది. ప్రస్తుత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ పదవీ కాలం ముగిసిన తరువాత బీజేపీ సీనియర్ నేత ఎల్ కే అద్వానీ రాష్ట్రపతిగా ఎన్నిక కానున్నట్లు సమాచారం. ప్రధాని నరేంద్రమోడీ స్వయంగా అద్వానీ పేరును ప్రతిపాదించారని జాతీయ రాజకీయాల్లో చర్చ జరుగుతోంది. గుజరాత్ లోని సోమ్ నాథ్ లో ఇటీవల జరిగిన ఒక సమావేశంలో ప్రధాని మోడీ రాష్ట్రపతి పదవికి అద్వానీ పేరును సూచించారని విశ్వసనీయ వర్గాలు పేర్కొన్నాయి. ఎల్కె అద్వానీకి ‘గురు దక్షిణ’గా రాష్ట్రపతి పదవిని మోడీ ఇవ్వనున్నట్లు సమాచారం.

ఎల్కే అద్వానీకి దక్కాల్సిన గౌరవం విషయంలో జాప్యం జరిగిందని బీజేపీలో కొందరు సీనియర్లు భావిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే రాష్ట్రపతి పదవికి ఆయన్ను ప్రతిపాదించాలనే డిమాండ్ వినిపించింది. బీజేపీ మార్గదర్శి అయి ఆర్ ఎస్ ఎస్ తో సైతం అద్వానీకి మంచి సంబంధాలు ఉన్న సంగతి తెలిసిందే. అందుకే అద్వానీ పేరును మోడీ రాష్ట్రపతి పదవికి ప్రతిపాదించారని తెలుస్తోంది.

ఇదిలాఉండగా…యూపీ గెలుపుతో వచ్చే ఏడాది ఖాళీ అవుతున్న పది స్థానాలను బీజేపీకి దక్కనున్నాయి. ఎగువసభలో సాధారణ మెజారిటీ కావాలంటే 123 మంది సభ్యుల బలం కావాలి. ప్రస్తుతం బీజేపీ – దాని మిత్రపక్షాల బలం 75 మంది. వచ్చే ఏడాది ఏప్రిల్ లో 68 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరుగుతాయి. వాటిలో పది స్థానాలు ఉత్తరప్రదేశ్ – ఉత్తరాఖండ్ రాష్ర్టాల పరిధిలోనివైతే.. మిగతా 58 స్థానాలు ఢిల్లీ – కేరళ – మధ్యప్రదేశ్ – ఆంధ్రప్రదేశ్ – కర్ణాటక – బీహార్ – గుజరాత్ – తెలంగాణ – రాజస్థాన్ – ఒడిశా – జార్ఖండ్ – మహారాష్ట్ర – హర్యానా – సిక్కిం రాష్ర్టాల నుంచి భర్తీ అవుతాయి. తద్వారా బీజేపీ ఆధ్వర్యంలోని ఎన్డీయేకు మెజారిటీ పెరుగుతుంది. దీనికి తోడు నామినేటెడ్ సభ్యులు సచిన్ టెండూల్కర్ – రేఖ తదితరుల పదవీకాలం వచ్చే ఏడాది ఏప్రిల్ లో ముగుస్తుంది. తద్వారా మరో నలుగురు సభ్యులను రాష్ట్రపతి ఎగువసభకు నామినేట్ చేస్తారు. నామినేటెడ్ సభ్యులకు విప్ వర్తించకున్నా.. ఎగువసభలో నామినేటెడ్ సభ్యులు అధికార పక్షానికి మద్దతు పలుకుతారు. దీంతో బీజేపీకి భవిష్యత్లో రాజ్యసభలో వివిధ బిల్లుల విషయంలో ఇబ్బందులు తలెత్తవని అంటున్నారు.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *