రివ్యూ: నేనోరకం – కొత్త రకం కిడ్నాప్ డ్రామా

కథ :

గౌతమ్ (సాయి రామ్ శంకర్) పండగ ఫైనాన్స్ కంపెనీలో రికవరీ ఏజెంట్ గా పని చేస్తుంటాడు. ఆ సమయంలో అతను స్వేచ్ఛ (రేష్మి మీనన్) ను చూసి ప్రేమలో పడతాడు. రకరకాల్ స్కీములు వేసి ఆమెను కూడా ఇంప్రెస్ చేసి తిరిగి ప్రేమించేలా చేస్తాడు.

అలా అతని లైఫ్ సెట్టైపోతోంది అనుకునే సమయంలో శరత్ కుమార్ అతని లైఫ్ లోకి ఎంటరై ఊహించని ఇబ్బందుల్ని క్రియేట్ చేస్తాడు. అసలు శరత్ కుమార్ ఎవరు? అతను గౌతమ్ జీవితంలోకి ఎందుకొచ్చాడు ? ఎలాంటి ఇబ్బందులు క్రియేట్ చేశాడు ? గౌతమ్ ఆ ఇబ్బందుల్ని అధిగమించాడా లేదా ? అనేదే తెరపై నడిచే కథ.

ప్లస్ పాయింట్స్ :

సినిమాలోని బలమైన అంశాల్లో ముందుగా చెప్పుకోవలసింది సినిమా సెకండాఫ్ గురించి. ఇంటర్వెల్ లో వచ్చే ట్విస్ట్ తో మొదలయ్యే సెకండాఫ్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. శరత్ కుమార్ హీరో సాయి రామ్ శంకర్ ను కంటికి కనిపించకుండా ఒక ఆట ఆడుకోవడం బాగుంది. ఆ ఆటలో హీరో చేత శరత్ కుమార్ ను బెదిరించడం, అతన్ని పరిగెత్తించి పరిగెత్తించి టెంక్షన్ పెట్టడం, తాను అనుకున్నవన్నీ చేయించడం వంటి సన్నివేశాలు బాగా మెప్పించాయి. సెకండాఫ్ మొత్తాన్ని శరత్ కుమార్, హీరో సాయి రామ్ శంకర్ లు తమ పెర్ఫార్మెన్స్ తో సక్సెస్ ఫుల్ గా నడిపారు.

అలాగే ఎమోషనల్ గా ఉండే శరత్ కుమార్ గతం, అతను హీరో లైఫ్ లోకి ఎందుకు వచ్చాడనే సంగతి సినిమా ఆఖర్లో రివీల్ చేయడం కొత్తగా ఉండి ఆకట్టుకున్నాయి. ఇక ఫస్టాఫ్లో హీరోయిన్ రేష్మి మీనన్ స్క్రీన్ ప్రెజెన్స్ చాలా అందంగా ఉంది. ఆమెను ఇంప్రెస్ చేయడానికి హీరో చేసే కొన్ని పనులు, హీరోయిన్ క్యారెక్టరైజేషన్ బాగున్నాయి. ఫస్టాఫ్లో పృథ్వి, లేట్ ఎంఎస్ నారాయణ, వైవా హర్షల కామెడీ కొన్ని చోట్ల మాత్రం పేలింది.

దర్శకుడు సుదర్శన్ సాలేంద్ర సినిమాకు కీలకమైన సెకండాఫ్ మీద ఎక్కువ దృష్టి పెట్టి మంచి అవుట్ ఫుట్ ఇచ్చాడు. సాయి రామ్ శంకర్, శరత్ కుమార్ పాత్రల మధ్య అతను నడిపిన డ్రామా సినిమాకే హైలెట్ గా నిలిచింది. సాయి రామ్ శంకర్ కూడా ఇదివరకటి సినిమాలకంటే ఇందులో మెరుగ్గా నటించాడు.

మైనస్ పాయింట్స్ :

సినిమాలో ఫస్టాఫ్ ప్రధాన బలహీనత. ఆరంభం నుండి ఇంటర్వెల్ ముందు వరకు హీరో హీరోయిన్ మధ్య నడిచే కొన్ని రొమాంటిక్ సీన్లు, కామెడీ సీన్లు మినహా మిగతా కథనం అంతా ఏదో సమయం గడపాలి కాబట్టి నడిపినట్టు ఉంది. ఎంఎస్ నారాయణ, వైవా హర్షల కామెడీ ఆరంభంలో బాగానే ఉన్న దాన్ని మోతాదుకు మించి సాగదీయడంతో ఒక దశలో చిరాకు కలిగింది.

ఇక సెకండాఫ్ ఆరంభమయ్యే వరకు సినిమా అసలు కథలోకి వెళ్లకపోవడంతో ఫస్టాఫ్ నీరసంగా తయారైంది. హీరో హీరోయిన్ లవ్ ట్రాక్ ఓకే గానీ మిగతా కథనమంతా ఎందుకు నడుస్తుంది, అసలు అవసరమా అనిపించింది. అలాగే కథనం కాస్త ఊపందుకునే సమయంలో వచ్చే పాటలు అడ్డు తగులుతున్నట్టు తోచాయి.

సాంకేతిక విభాగం :

దర్శకుడు సుదర్శన్ సాలేంద్ర ఒక మంచి మెసేజ్ ఓరియెంటెడ్ పాయింట్ ను డిఫరెంట్ యాంగిల్ లో హ్యాండిల్ చేసి ఆకట్టుకున్నాడు. ఫస్టాఫ్ విషయంలో కాస్త విఫలమైనా సెకండాఫ్లో మాత్రం మ్యాగ్జిమమ్ మార్కులు దక్కించుకున్నాడు. సెకండాఫ్ లో నడిచే రేసీ సన్నివేశాల్లో కెమెరా వర్క్ రియలిస్టిక్ గా ఉండి ఆకట్టుకుంది.

సంగీత దర్శకుడు మహిత్ నారాయణ్ అందించిన ఆర్ఆర్ సినిమాకు బాగా హెల్ప్ అయింది. ఎడిటింగ్ సమయంలో ఫస్టాఫ్లోని కొన్ని అనవసరమైన సీన్లను తొలగించి ఉండాల్సింది. శ్రీకాంత్ పాటించిన నిర్మాణ విలువలు బాగున్నాయి.

విడుదల తేదీ : మార్చి 17, 2017

రేటింగ్ : 2.50/5

దర్శకత్వం :సుదర్శన్ సాలేంద్ర

నిర్మాతలు :శ్రీకాంత్ రెడ్డి

సంగీతం :మహిత్ నారాయణ్

నటీనటులు :సాయి రామ్ శంకర్, రేష్మి మీనన్, శరత్ కుమార్

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *