రూ. 15లకే టన్నుఇసుకా?

ఇసుక తవ్వకాలు, తరలింపునకు సంబంధించి రాష్ట్రవ్యాప్తంగా 102 రేవుల్లో ఇసుక తవ్వి ఎంపిక చేసిన 50 నిల్వ కేంద్రాలకు తరలించేలా ఏపీఎండీసీ టెండర్లు పిలిచిన సంగతి తెలిసిందే. ఈ విషయమై అతి తక్కువ ధరకే ఇసుకను తవ్వి అప్పగిస్తామని గుత్తేదారులు వేసిన టెండరుకు అధికారులు ఒకే చెప్పారు. ఈ టెండర్లను ఏపీ ఖనిజాభివృద్ధి సంస్థ (ఏపీఎండీసీ) ఖరారు చేసింది. ఓ గుత్తేదారు సంస్థ టన్నుకు రూ.15 చొప్పున టెండరు వేసింది. ఇసుకను తవ్వి 4 టన్నుల సామర్థ్యమున్న ట్రాక్టరులో నింపడమే కాకుండా దానిని నిల్వ కేంద్రానికి తీసుకెళ్లి అన్‌ లోడ్‌ చేయాలి. అక్కడ ఇసుక కొనుగోలు చేసిన వారి వాహనంలో లోడింగ్‌ చేయాలి. తవ్వకంతో పాటు రవాణా చేసేందుకు గుత్తేదారు వేసిన ఒకే టెండరు ప్రకారం కేవలం రూ.60 లభిస్తుంది. గుంటూరులోని ఓ నిల్వ కేంద్రం పరిధిలోని రేవుల నుంచి ఈ ధరకు ఇసుక తవ్వి తీసుకొచ్చేలా గుత్తేదారు సంస్థ వేసిన టెండరును అధికారులు ఖరారు చేశారు. ఒప్పందం కోసం రావాలంటూ లేఖను కూడా పంపారు వీటితోపాటు కొనుగోలుదారులు కోరుకున్న చోటకు తరలింపునకు వేరుగా టెండర్లు పిలిచారు. వీటిని పరిశీలించిన అధికారులు రివర్స్‌ టెండర్ల ప్రక్రియను దాదాపు పూర్తి చేశారు. గుంటూరులో అత్యల్పం తర్వాత ఇతర జిల్లాల్లోని వేర్వేరు నిల్వ కేంద్రాల పరిధిలో టన్నుకు రూ.28, రూ.34, రూ.45, రూ.46 ఇలా ఆయా ధరలతో కోట్‌ చేసిన టెండర్లను ఖరారు చేశారు. అత్యధికంగా తూర్పుగోదావరి జిల్లాపరిధిలోని ఓ నిల్వ కేంద్రం పరిధిలో టన్నుకు రూ.149 ధరను నిర్ణయించారు.

Videos