రాంచీలో ఢమాల్.. వైజాగ్ లో క్లైమాక్స్

సిరీస్‌లో నిలవాలంటే కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్‌లో న్యూజిలాండ్ చెలరేగిపోయింది. ఆల్‌రౌండ్ షోతో అదరగొడుతూ భారత్ ఆధిక్యానికి బ్రేక్‌లు వేసింది. దీంతో బుధవారం జేఎస్‌సీఏ స్టేడియంలో జరిగిన నాలుగో వన్డేలో విలియమ్సన్ బృందం 19 పరుగుల తేడాతో ధోనిసేనపై గెలిచింది. ఫలితంగా ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను 2-2తో సమం చేసింది. టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన కివీస్ 50 ఓవర్లలో 7 వికెట్లకు 260 పరుగులు చేసింది. గప్టిల్ (84 బంతుల్లో 72, 12 ఫోర్లు), విలియమ్సన్ (59 బంతుల్లో 41, 4 ఫోర్లు), లాథమ్ (40 బంతుల్లో 39, 4 ఫోర్లు) రాణించారు. తర్వాత భారత్ 48.4 ఓవర్లలో 241 పరుగులకు ఆలౌటైంది. రహానే (70 బంతుల్లో 57, 5 ఫోర్లు, 1 సిక్స్), కోహ్లీ (51 బంతుల్లో 45, 2 ఫోర్లు, 1 సిక్స్), అక్షర్ పటేల్ (40 బంతుల్లో 38, 3 ఫోర్లు, 1 సిక్స్) మినహా మిగతా వారు విఫలమయ్యారు. గప్టిల్‌కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. ఇరుజట్ల మధ్య చివరిదైన ఐదో వన్డే శనివారం విశాఖపట్నంలో జరుగుతుంది.

టెస్టు సిరీస్‌తో పాటు గత మూడు మ్యాచ్‌ల్లో విఫలమైన గప్టిల్ ఫామ్‌లోకి రావడంతో కివీస్‌కు మంచి శుభారంభం లభించింది. రెండో ఓవర్‌లోనే ధవల్ 16 పరుగులు సమర్పించుకోవడంతో లాథమ్, గప్టిల్ ఇద్దరూ క్రీజులో కుదురుకున్నారు. బౌండరీల వర్షం కురిపిస్తూ తొలి 10 ఓవర్లలో 80 పరుగులు రాబట్టారు. అయితే ప్రమాదకరంగా మారుతున్న ఈ జంటను 16వ ఓవర్‌లో అక్షర్ పటేల్ విడదీశాడు. దీంతో తొలి వికెట్‌కు 96 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. వన్‌డౌన్‌లో వచ్చిన విలియమ్సన్ కాస్త నెమ్మదిగా ఆడినా.. గప్టిల్ దూకుడుగా ఆడే ప్రయత్నంలో అవుటయ్యాడు. ఈ ఇద్దరు రెండో వికెట్‌కు 42 పరుగులు జోడించారు.

ఈ దశలో క్రీజులోకి వచ్చిన రాస్ టేలర్(58 బంతుల్లో 35, 1 ఫోర్) మంచి సమన్వయంతో ఆడాడు. దీంతో కివీస్ 35 ఓవర్లలో 2 వికెట్లకు 184 పరుగులు చేసి పటిష్ఠ స్థితిలో నిలిచింది. అయితే ఇక్కడే భారత స్పిన్నర్ మిశ్రా (2/42) తన మ్యాజిక్‌ను చూపెట్టాడు. వరుస ఓవర్లలో విలియమ్సన్, నీషమ్ (6)లను అవుట్ చేసి ఒత్తిడి పెంచాడు. టేలర్, విలియమ్సన్ మూడో వికెట్‌కు 46 పరుగులు జత చేశారు. ఇక వాట్లింగ్ (14)తో ఇన్నింగ్స్‌ను గట్టెక్కించే ప్రయత్నం చేసిన టేలర్‌పై స్పిన్నర్లు మరింత ఒత్తిడి పెంచారు. నాలుగు ఓవర్ల వ్యవధిలో వాట్లింగ్, టేలర్‌తో పాటు డెవిచ్ (11) వికెట్ తీయడంతో కివీస్ భారీ స్కోరు ఆశలు ఆవిరయ్యాయి. చివర్లో సాంట్నెర్ (17 నాటౌట్), సౌతీ (9 నాటౌట్) కాసేపు పోరాడాడు.

లక్ష్య ఛేదనకు దిగిన భారత్‌కు సరైన ఆరంభం లభించలేదు. ఫామ్‌లేమితో ఇబ్బందులుపడుతున్న రోహిత్ (11) మరోసారి నిరాశపర్చడంతో ధోనిసేన 19 పరుగులకే తొలి వికెట్ చేజార్చుకుంది. బౌల్ట్ ఓవర్‌లో భారీ సిక్సర్ బాదిన రహానే.. కోహ్లీతో కలిసి ఇన్నింగ్స్‌ను ముందుకు తీసుకెళ్లాడు. ఈ ఇద్దరు వేగంగా ఆడటంతో పవర్‌ప్లే ముగిసేసరికి భారత్ వికెట్ నష్టానికి 50 పరుగులు చేసింది. ఈ దశలో స్పిన్నర్ సాంట్నెర్ బౌలింగ్‌కు రావడంతో భారత ద్వయం ఆచితూచి ఆడింది. అయితే 15వ ఓవర్‌లో లాంగాఫ్‌లో సిక్సర్ కొట్టిన కోహ్లీ స్ట్రయిక్ రొటేషన్‌తో వేగంగా సింగిల్స్ తీశాడు. కానీ సరిగ్గా 5 ఓవర్ల తర్వాత సోధి వేసిన అవుట్‌సైడ్ ఆఫ్ బంతిని ఆడబోయి కీపర్‌కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. ఈ ద్వయం రెండో వికెట్‌కు 79 పరుగులు జత చేసింది.

ఇక అభిమానుల కేరింతల మధ్య మైదానంలోకి అడుగుపెట్టిన లోకల్ బాయ్ ధోనీ (11), రహానే ఎక్కువసేపు క్రీజులో ఉండలేకపోయారు. 13 బంతుల వ్యవధిలో ఈ ఇద్దరూ అవుట్‌కావడంతో భారత్ 135 పరుగుల వద్ద నాలుగో వికెట్ కోల్పోయి కష్టాల్లో పడింది. ఓ ఎండ్‌లో అక్షర్ పటేల్ నిలకడగా ఆడినా.. 33వ ఓవర్‌లో సౌతీ (3/40) వరుస బంతుల్లో మనీష్ పాండే (12), జాదవ్ (0)లను అవుట్ చేశాడు. కొద్దిసేపటికే హార్దిక్ పాండ్యా (9) కూడా వెనుదిరగడంతో భారత్ కోలుకోలేకపోయింది. భారత్ గెలవాలంటే 48 బంతుల్లో 57 పరుగులు చేయాల్సిన దశలో మూడు బంతుల వ్యవధిలో మిశ్రా (14), అక్షర్ పటేల్ పెవిలియన్‌కు చేరారు. దీంతో రన్‌రేట్ పెరిగిపోయింది. చివర్లో ఉమేశ్ (7), ధవల్ కులకర్ణి (25 నాటౌట్)లు కాసేపు ప్రతిఘటించి విఫలమయ్యారు.

న్యూజిలాండ్ ఇన్నింగ్స్: గప్టిల్ (సి) ధోనీ (బి) పాండ్యా 72, లాథమ్ (సి) రహానే (బి) అక్షర్ 39, విలియమ్సన్ (సి) ధోనీ (బి) మిశ్రా 41, టేలర్ రనౌట్ 35, నీషమ్ (సి) కోహ్లీ (బి) మిశ్రా 6, వాట్లింగ్ (సి) రోహిత్ (బి) ధవల్ 14, డెవిచ్ (సి) పాండ్యా (బి) ఉమేశ్ 11, సాంట్నెర్ నాటౌట్ 17, సౌతీ నాటౌట్ 9, ఎక్స్‌ట్రాలు: 16, మొత్తం: 50 ఓవర్లలో 7 వికెట్లకు 260. వికెట్ల పతనం: 1-96, 2-138, 3-184, 4-192, 5-127, 6-223, 7-242. బౌలింగ్: ఉమేశ్ 10-1-60-1, ధవల్ 7-0-59-1, హార్దిక్ 5-0-31-1, మిశ్రా 10-0-42-2, అక్షర్ పటేల్ 10-0-38-1, కేదార్ 8-0-27-0.

భారత్ ఇన్నింగ్స్: రహానే ఎల్బీడబ్ల్యు (బి) నీషమ్ 57, రోహిత్ (సి) వాట్లింగ్ (బి) సౌతీ 11, కోహ్లీ (సి) వాట్లింగ్ (బి) సోధి 45, ధోనీ (బి) నీషమ్ 11, అక్షర్ పటేల్ (బి) బౌల్ట్ 38, మనీష్ (సి) లాథమ్ (బి) సౌతీ 12, జాదవ్ ఎల్బీడబ్ల్యు (బి) సౌతీ 0, హార్దిక్ పాండ్యా (సి) లాథమ్ (బి) సాంట్నెర్ 9, మిశ్రా రనౌట్ 14, ధవల్ నాటౌట్ 25, ఉమేశ్ (సి) టేలర్ (బి) బౌల్ట్ 7, ఎక్స్‌ట్రాలు: 12, మొత్తం: 48.4 ఓవర్లలో ఆలౌట్ 241. వికెట్ల పతనం: 1-19, 2-98, 3-128, 4-135, 5-154, 6-154, 7-167, 8-205, 9-207.బౌలింగ్: సౌతీ 9-0-40-3, బౌల్ట్ 9.4-1-48-2, నీషమ్ 6-0-38-2, సాంట్నెర్ 10-0-38-1, సోధి 10-1-52-1, డెవిచ్ 4-0-22-0.

370

 

Videos

Leave a Reply

Your email address will not be published.