వ్యభిచారం తప్పు కాదు, అరెస్ట్‌లు వద్దు: సుప్రీం కోర్టు

పొట్టకూటి కోసం వ్యభిచారం వృత్తిగా స్వీకరించడం చట్ట వ్యతిరేకం ఏమీ కాదని సుప్రీం కోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. పూటగడవక.. పొట్టకూటికి వ్యభిచారాన్ని స్వీకరించడం చట్ట వ్యతిరేకం కాదని.. వ్యభిచార గృహం నిర్వహించడం మాత్రమే తప్పేనని సుప్రీం కోర్టు నియమించిన కమిటీ సంచలన కామెంట్స్ చేసింది. సెక్స్ వర్కర్ల హక్కులను కాపాడేదిశగా సుప్రీం ఓ కమిటీని 2011లో నియమించగా, ఆ కమిటీ నివేదిక వచ్చే నెలలో కోర్టు ముందుకు రానుంది.

కాగా, సీనియర్ న్యాయవాది ప్రదీప్ ఘోష్ అధ్యక్షతన కమిటీ ఏర్పడగా, వ్యభిచార వృత్తిలో ఉన్నవారికి పునరావాసం కల్పించేందుకు తీసుకోవాల్సిన చర్యలపైనా పలు సిఫార్సులు ఉన్నాయని తెలుస్తోంది. వ్యభిచారాన్ని నిర్వహిస్తున్న వారు పట్టుబడితే, పదేళ్ల వరకూ జైలుశిక్ష విధించేలా చట్టాన్ని సవరించాలని కూడా కమిటీ సూచించినట్టు సమాచారం. దేశంలో అధికారిక అంచనాల ప్రకారం 12 లక్షల మంది ఈ వృత్తిలో ఉన్నారు.

కొన్ని తప్పనిసరి పరిస్థితుల్లో ఈ వృత్తిలో ఉన్నవారిని చట్ట వ్యతిరేకులుగా భావిస్తూ, పోలీసులు వేధించరాదని ఈ కమిటీ నివేదికలో సిఫార్సులు ఉన్నాయని సుప్రీం కోర్టు వెల్లడించింది. ఓ వ్యభిచార గృహంపై దాడి చేసినా, అక్కడ స్వీయ సమ్మతంతో వృత్తిలో ఉన్న వారిని అరెస్ట్ చేయరాదని, వారిపై జరిమానాలు వద్దని కూడా కమిటీ సూచించనున్నట్టు సమాచారం. ఈ తరహా కేసుల్లో 1956 నాటి ఐటీపీఏ (ఇమ్మోరల్ ట్రాఫిక్ ప్రివెన్షన్ యాక్ట్) చట్టంలోని సెక్షన్ 8ను పోలీసులు అతిక్రమిస్తున్నట్టు తెలుస్తోంది.

ఈ చట్టం ప్రకారం, సెక్స్ వర్కర్లు బహిరంగంగా విటులను ఆకర్షించే ప్రయత్నాలు చేయకూడదు. దీనికి ఆరు నెలల జైలు శిక్ష, రూ. 500 వరకూ జరిమానా విధించే అవకాశాలు ఉంటాయి.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *