సంచలనం సృష్టించబోతున్న నోకియా..

నోకియా.. ఆ బ్రాండే వేరు. ఎప్పటికీ మరచిపోలేని, తిరుగులేని బ్రాండు. కానీ స్మార్ట్ ఫోన్ల రాకతో తన వైభవం కోల్పోయిన నోకియా.. మళ్లీ తన సత్తాఏమిటో చాటడానికి మొబైల్ స్పేస్ రంగంలోకి దిగుతోంది. అయితే ఈసారి టెలికాం దిగ్గజాలతో కలిసి సంచలనం సృష్టించబోతుందట. దేశీయ టాప్ టెలికాం దిగ్గజం భారతీ ఎయిర్ టెల్, ప్రభుత్వ రంగ టెలికాం కంపెనీ భారత్ సంచార్ నిగమ్ తో కలిసి నోకియా 5జీ కనెక్టివిటీని ఇండియాలో లాంచ్ చేసేందుకు సిద్ధమవుతోంది. దీనికొరకు నోకియా ఆ రెండు దిగ్గజాలతో కలిసి ఎంవోయూపై సంతకం కూడా చేసిందని ఎకనామిక్ టైమ్స్ రిపోర్టు చేసింది.
5జీ కనెక్టివిటీని తీసుకురావడానికి ప్రస్తుతం సన్నాహక దశలో ఉన్నామని నోకియా భారత మార్కెట్ హెడ్ సంజయ్ మాలిక్ చెప్పారు. బెంగళూరులోని తమ ఆర్ అండ్ డీ సెంటర్ లో ఓ ఎక్స్పీరియన్స్ సెంటర్ ను ఏర్పాటుచేస్తున్నామని కూడా తెలిపారు. ఇండియాలో 5జీని తీసుకురావడానికి వాటాదారులను అవసరాలను కూడా అర్థం చేసుకోవడానికి ఇది ఉపయోగపడుతుందన్నారు. దేశంలో కొత్త టెక్నాలజీని త్వరగా స్వీకరించడానికి ప్రయత్నిస్తామని తెలిపారు. అభివృద్ధి చెందిన దేశాల్లో 5జీ సేవలను 2020లో ప్రారంభించబోతున్నారు, ఇండియాలో 2022లో లాంచ్ చేయాలని యోచిస్తున్నామని నోకియా తెలిపింది.
ఇప్పుడిప్పుడే భారత్ మార్కెట్ అంతా 4జీ వైపు ఎక్కువగా మరలుతున్న సంగతి తెలిసిందే. చాలా ఆలస్యంగా 3జీ, 4జీ సేవలను భారత్ స్వీకరించడం ప్రారంభించింది. కానీ 5జీ సేవలను పొందడానికి ఎలాంటి ఆలస్యం ఉండదని టెలికాం సెక్రటరీ జేఎస్ దీపక్ కూడా తెలిపారు. శాంసంగ్, రిలయన్స్ జియోలు కూడా 5జీ నెట్ వర్క్ ను ఇండియాలో తీసుకొచ్చే ప్లాన్ ను ప్రకటించాయి. ప్రస్తుతం నోకియా రెండు టెలికాం దిగ్గజాలతో కలిసి 5జీని తాను కూడా తీసుకురానున్నట్టు తెలిపింది.
Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *