60 కిలో టన్నుల భారీ హైడ్రోజన్‌ బాంబును పరీక్షించిన ఉత్తర కొరియా

  • భారీ హైడ్రోజన్‌ బాంబును పరీక్షించిన ఉత్తర కొరియా
  • 60 కిలో టన్నుల శక్తితో పేలుడు.. కంపించిన దేశం
  • హిరోషిమా బాంబుకన్నా 8 రెట్లు శక్తిమంతం
  • క్షిపణితో ప్రయోగించే సామర్థ్యం సాధించామని వెల్లడి
ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్‌ అమెరికాకు మరో సవాల్‌ విసిరారు. ఈసారి ఏకంగా భారీ హైడ్రోజన్‌ బాంబును పరీక్షించారు. ఆ దేశం ఇప్పటివరకూ ప్రయోగించిన అణుబాంబులన్నింటిలోకీ ఇదే అత్యంత శక్తిమంతమైనది. తాము పరీక్షించిన రెండు దశల థర్మో న్యూక్లియర్‌ ఆయుధం (హైడ్రోజన్‌ బాంబు) అత్యంత శక్తిమంతమైనదని నార్త్‌కొరియన్‌ టెలివిజన్‌ వెల్లడించింది. పరీక్ష జరిపిన చోట, చుట్టుపక్కల ప్రాంతాల్లో.. ఆదివారం మధ్యాహ్నం స్థానిక కాలమానం ప్రకారం 12:29 గంటల సమయంలో ఉత్తరకొరియాలోని కిల్జు ప్రాంతంలో రిక్టర్‌ స్కేలుపై 5.6 తీవ్రతతో భూప్రకంపనలు నమోదైనట్టు దక్షిణ కొరియా ప్రకటించింది. ‘యూఎస్‌ జియొలాజికల్‌ సర్వే’ ప్రకారమైతే.. ఆ తీవ్రత 6.3గా నమోదైంది. దక్షిణ కొరియా వాతావరణ సంస్థ అంచనాల ప్రకారం ఆ సమయంలో 50 నుంచి 60 కిలోటన్నుల అణు పేలుడు సంభవించింది.
ఇది గత ఏడాది సెప్టెంబరులో ఉత్తరకొరియా జరిపిన పేలుడుకన్నా (10కిలోటన్నులు) 5-6 రెట్లు అధికమని ఆ సంస్థ వివరించింది. ఇలాంటి భూప్రకంపనలను కొలిచే స్వతంత్ర సంస్థ నోర్సార్‌ ప్రకారం.. ఉత్తరకొరియా హైడ్రోజన్‌ బాంబుతో వెలువడిన శక్తి 120 కిలోటన్నుల దాకా ఉంటుంది. అంటే హిరోషిమాపై అమెరికా జారవిడిచిన అణుబాంబు కన్నా 8 రెట్లు అధికం. కాగా, జపాన్‌ కూడా ఉత్తరకొరియా అణుపరీక్షను ధ్రువీకరించింది. ఆ ప్రాంతంలో రెండో భూకంపం కూడా సంభవించినట్టు యూఎస్‌ జియొలాజికల్‌ సర్వే, చైనా ఎర్త్‌క్వేక్‌ అడ్మినిస్ట్రేషన్‌ చెబుతుండగా అలాంటిదేమీ లేదని దక్షిణ కొరియా వాతావరణ సంస్థ చెబుతోంది. ఏదేమైనా.. అవసరతేఅమెరికాలో ఏ ప్రాంతంపై అయినా అణుదాడి చేయగల సత్తా కలిగి ఉండాలన్న ఉత్తరకొరియా సంకల్పం దిశగా ఈ పరీక్షతో కీలక ముందడుగు పడినట్టేనని అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు విశ్లేషిస్తున్నారు.
సంప్రదాయ అణుబాంబుల కంటే శక్తిమంతం
సంప్రదాయ అణుబాంబులతో పోలిస్తే హైడ్రోజన్‌ బాంబు అత్యంత శక్తిమంతమైనది. తక్కువ పరిమాణంలో ఉంటూనే ఎక్కువ విధ్వంసం సృష్టించగలిగే శక్తి వాటికి ఉంటుంది. వాటిని క్షిపణి ద్వారా ప్రయోగించగలిగేంత చిన్నవిగా తయారుచేయడమే అత్యంత క్లిష్టమైన సవాలు. ఆదివారంనాటి ప్రయోగంతో తాము ఆ సత్తాను సాధించినట్టు ఉత్తరకొరియా ప్రకటించుకుంది.
గత ఏడాది రెండు పరీక్షలు..
కిమ్‌ జాంగ్‌ ఉన్‌ 2011లో ఉత్తరకొరియా అధ్యక్షుడైనప్పటి నుంచీ ఆ దేశ అణు, క్షిపణి కార్యక్రమం వేగం పుంజుకుంది. ఆదివారం నిర్వహించిన ఆరో అణు పరీక్షకు ముందు జరిపిన ఐదు న్యూక్లియర్‌ టెస్టుల్లో మూడు కిమ్‌ హయాంలో నిర్వహించినవే. అందులో ఒకటి 2016 జనవరి 6న నిర్వహించగా.. రెండో పరీక్షను తమ దేశ వ్యవస్థాపక దినమైన సెప్టెంబరు 9నాడు జరిపింది. ఈ ఏడాది జూలైలో రెండు ఖండాంతర క్షిపణులను పరీక్షించింది.
హిరోషిమా బాంబు కన్నా 3800 రెట్లు పవర్‌ఫుల్‌.. జార్‌ బాంబా
హైడ్రోజన్‌ బాంబులు పేలినప్పుడు విడుదలయ్యే శక్తి మెగాటన్నుల్లో ఉంటుంది. ప్రపంచంలో ఇప్పటివరకూ పరీక్షించిన హైడ్రోజన్‌ బాంబుల్లో అత్యంత శక్తిమంతమైనది సోవియట్‌ యూనియన్‌ 1961లో రూపొందించిన జార్‌ బాంబా. దాని శక్తి.. దాదాపు 50 మెగాటన్నులు. హిరోషిమాపై అమెరికా వేసిన అణుబాంబు కన్నా 3800 రెట్లు అధిక శక్తి అది. హైడ్రోజన్‌ బాంబు పేలినప్పుడు విడుదలయ్యే వేడి వల్ల నగరాలకు నగరాలే తుడిచిపెట్టుకుపోతాయి. ఇంకా సరిగ్గా చెప్పాలంటే ఉన్నపళంగా ఆవిరైపోతాయంతే!
Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *