దుమ్ము రేపుతున్న ‘పేటీఎం’

కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం 500, 1000 రూపాయల నోట్లను నిషేధించడం దేశ ప్రజలకు ఎంతమేరకు కలిసొస్తుందో తెలియదుగానీ డిజిటల్‌ పేపెంట్స్, ఆన్‌లైన్‌ లేదా మొబైల్‌ వాలెట్స్‌ నవజాత కంపెనీలకు అనూహ్యంగా అదృష్టం కలిసొచ్చింది. నరేంద్ర మోదీ బుధవారం చేసిన ప్రకటనతో మొబైల్‌ వాలెట్‌ కంపెనీ ‘పేటీఎం’ మార్కెట్లో దుమ్మురేపుతోంది.
ఒక్కసారిగా పేటీఎం చెల్లింపులు 435 శాతం పెరిగాయి. దీనికి సంబంధించిన యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకునే వారి సంఖ్య 200 శాతం పెరిగింది. కిరాణా, బ్రాండెడ్‌ రిటేల్‌ మాల్స్‌ సహా పాన్‌ షాపుల నుంచి పెట్రోలు బంక్‌ల వరకు చెల్లింపులు జరిపే ఈ కంపెనీకి దేశంలోని 1200 నగరాల పరిధిలోని 8,50,000 ప్రాంతాల నుంచి పేటీఎం సర్వీసులను వినియోగదారులు ఉపయోగించుకునే సౌకర్యం ఉంది. స్వాతంత్య్ర భారత దేశం ఆర్థికరంగ చరిత్రలో ప్రధాని నరేంద్ర మోదీ ఉదాత్త నిర్ణయం తీసుకున్నారని కొనియాడుతూ ఈ కంపెనీ పలు పత్రికల్లో ఫస్ట్‌ పేజీ ప్రకటనలు కూడా ఇచ్చింది.
‘మోదీ నిర్ణయం వెలువడినప్పటి నుంచి మా వినియోగదారులు ఊహించని విధంగా పెరిగిపోయారు. ఇప్పుడు మా కల నెరవేరడం ప్రారంభమైందని భావిస్తున్నాను. దేశంలోని నలుమూలలకు మా సర్వీసులను విస్తరించేందుకు రానున్న నెలల్లో మేమింతకన్నా ఎక్కువ కష్టపడాల్సిన సమయం వచ్చింది’ అని పేటీఎం వ్యవస్థాపకులు విజయ్‌ శేఖర్‌ శర్మ మీడియాతో వ్యాఖ్యానించారు. ‘అబ్‌ ఏటీఎం నహీ పేటీఎం కరో’ అంటూ తమ వినియోగదారులకు పిలుపునిచ్చారు.
అలాగే ఆన్‌లైన్‌ పేమెంట్‌ యాప్‌ ‘ఫ్రీచార్జ్‌ వాలెట్‌’ వ్యాపారం దేశవ్యాప్తంగా మూడింతలు పెరిగింది. ప్రతి 500 రూపాయల వ్యాపారంపైనా యాభై రూపాయలు రాయితీని ఇస్తామంటూ కూడా తాజాగా ఆ కంపెనీ ప్రకటించింది. ‘ఇక క్యాష్‌ ఆన్‌ డెలవరి అనేది గతించిన అంశం. క్యాష్‌ స్థానాన్ని ఇక ఫ్రీచార్జ్‌ ఆక్రమిస్తుంది’ అని ఫ్రీచార్జి మాతృ కంపెనీ స్నాప్‌డీల్‌ సీఈవో, సహ వ్యవస్థాపకులు కునాల్‌ బహాల్‌ వ్యాఖ్యానించారు. మరో ఆన్‌లైన్‌ పేమెంట్‌ సంస్థ ‘మొబిక్విక్‌’ వ్యాపారం కూడా బుధవారం నుంచి ఇప్పటివరకు ఏడింతలు పెరిగింది.
‘దేశంలో నల్లడబ్బును అరికట్టేందుకు నరేంద్ర మోదీ దిమ్మతిరిగే నిర్ణయాన్ని తీసుకున్నారు. ప్రపంచంలోనే మన నల్లడబ్బు మాట వినిపించకుండా మోదీ జరిపిన సర్జికల్‌ స్రై్టక్స్‌ ఇవి. యాభై రోజుల కాలంలో దేశంలో కోటి మంది ప్రజల చెల్లింపుల విధానం మారిపోతుంది. మనమంతా నగదు ఆర్థిక వ్యవస్థ నుంచి నగదు రహిత ఆర్థిక వ్యవస్థ వైపు ఇక దూసుకుపోతాం. ఈ చారిత్రక పరిణామ కాలంలో మేమూ భాగస్వాములం అవుతున్నందుకు ఆనందంగా ఉంది’ అని మొబిక్విక్‌ సీఈవో బిపిన్‌ ప్రీత్‌ సింగ్‌ వ్యాఖ్యానించారు. రేపటి నుంచి ఏటీఎంలకు పరుగెత్తాల్సిన అవసరం లేదని మొబిక్విక్‌ను ఉపయోగించండి అంటూ ఆయన ట్వీట్‌ చేశారు.
దేశంలో మరికొన్ని ఆన్‌లైన్‌ పేమెంట్‌ వ్యవస్థల కలిగిన కంపెనీలు కూడ మోదీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల లాభపడ్డాయి. దేశంలోని 120 నగరాల్లో వినియోగదారులు రీచార్జి చేసుకోవడంలో 1500 శాతం అభివృద్ధి సాధించామని దేశవ్యాప్తంగా టాక్సీలను నడిపే ఓలా కంపెనీ ఆన్‌లైన్‌ పేమెంట్‌ సంస్థ ‘ఓలామనీ’ ప్రకటించింది. తాము రీచార్జిలపై మరింత మనీ ఆఫర్‌లు ఇస్తున్నామని కంపెనీ ప్రతినిధులు తెలిపారు. ఊబర్‌ కంపెనీ కూడా ఓలా తరహాలో గణనీయంగా ప్రయోజనం పొందింది.
ఫ్లిప్‌కార్ట్‌ లాంటి ఆన్‌లైన్‌ వ్యాపార సంస్థలు మాత్రం ‘క్యాష్‌ ఆన్‌ డెలవరి’ సర్వీసులను తాత్కాలికంగా నిలిపివేశాయి. ఇంటర్నెట్‌ బ్యాంకింగ్, క్రెడిట్, డెబిట్‌ కార్డులు, గిఫ్ట్‌ కార్డులు, మొబైల్‌ వాలెట్‌ పేపెంట్‌ లాంటి ప్రత్యామ్నాయాలను అనుసరించాల్సిందిగా పిలుపునిచ్చింది.
Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *