ఎన్టీఆర్‌ని దువ్వుతున్న చంద్రబాబు.!

తెలుగుదేశం పార్టీలో నారా లోకేష్‌ అత్యంత కీలకంగా మారారు. అతి త్వరలో సుపుత్రుడు లోకేష్‌కి, తన మంత్రి వర్గంలో చంద్రబాబు ఛాన్స్‌ ఇవ్వనున్న విషయం విదితమే. 2014 ఎన్నికల్లో చంద్రబాబు, బాలకృష్ణను ప్రత్యక్ష రాజకీయాల్లోకి తీసుకొచ్చిన విషయం విదితమే. బాలయ్య సినీ గ్లామర్‌ ఎంతో కొంత పార్టీకి ఉపయోగపడ్తుందన్నది చంద్రబాబు ఆలోచన. అది బాగానే వర్కవుట్‌ అయ్యింది. ఇక ఇప్పుడు లోకేష్‌, పార్టీలో కీలకంగా ఎదిగితే.. లోకేష్‌కి అసిస్టెన్స్‌గా జూనియర్‌ ఎన్టీఆర్‌ని కూడా తీసుకురావాలన్నది చంద్రబాబు ఆలోచన అట.

ఒకప్పుడు ఇదే జూనియర్‌ ఎన్టీఆర్‌ని చంద్రబాబు వాడుకుని వదిలేశారు. అది 2009 ఎన్నికల నాటి సందర్భం. ఆ తర్వాత పెద్దగా టీడీపీ తెరపై జూ.ఎన్టీఆర్‌ కన్పించలేదు. ఈలోగా తన కుమారుడ్ని రాజకీయాల్లో యాక్టివ్‌ చేసేశారు చంద్రబాబు. పార్టీలో లోకేష్‌ ఎదిగారు గనుక, జూ.ఎన్టీఆర్‌ని ఇప్పుడు దువ్వినా, పార్టీలోకి తీసుకొచ్చినా.. పెద్దగా అతనితో ఇబ్బంది వుండదన్నది చంద్రబాబు ఉద్దేశ్యం.

తనకు సపోర్ట్‌గా బాలయ్య.. తన కుమారుడికి సపోర్ట్‌గా జూనియర్‌ ఎన్టీఆర్‌.. ఇలా, చంద్రబాబు వ్యూహాలు సాగుతున్నాయి. జూ.ఎన్టీఆర్‌ని ఓ పక్క తాను బుజ్జగిస్తూనే, ఇంకోపక్క బాలయ్యతోనూ మాట్లాడిస్తున్నారట చంద్రబాబు. అన్నీ కుదిరితే అతి త్వరలోనే జూ.ఎన్టీఆర్‌ కూడా ఏదో ఒక సందర్భం చూసుకుని, టీడీపీ వేదికపై కన్పించే అవకాశాలున్నాయని టీడీపీ వర్గాల్లో గుసగుసలు విన్పిస్తున్నాయి.

నిన్న మొన్నటిదాకా కూడా జూ.ఎన్టీఆర్‌ని టీడీపీకి దూరంగా పెట్టిన చంద్రబాబు, సినీ రంగంలోనూ టీడీపీ అభిమానులెవరూ జూ.ఎన్టీఆర్‌కి సపోర్ట్‌ చేయొద్దని అంతర్గతంగా ఆదేశాలు ఇస్తూ వచ్చారు. ఆ కారణంగానే జూ.ఎన్టీఆర్‌ సినిమాగానీ, బాలయ్య సినిమాగానీ వచ్చిన ప్రతిసారీ నందమూరి సినీ అభిమానుల మధ్య ‘ఆధిపత్య పోరు’ జరుగుతూ వచ్చింది. మరి, ఇంత షడెన్‌గా చంద్రబాబు ఆలోచనలు మారితే, ఆయన ఆలోచనలకు తగ్గట్టుగా జూ.ఎన్టీఆర్‌ కూడా మారిపోతారా.? అన్నది వేచి చూడాల్సిందే.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *