ఓంపురి మరణం వెనుక వారిద్దరు?

ఎవరిపైనైనా.. ఎన్ని జోకులైనా వేయొచ్చు. కానీ.. ఒక వ్యక్తి మరణం మీదా.. అందుకు ఏ మాత్రం సంబంధం లేని అంశాల్ని ముడిపెట్టటం మానవత్వం ఎంత మాత్రం అనిపించుకోదు. తాజాగా పాకిస్తాన్ కు చెందిన ఒక ఛానల్ ప్రసారం చేసిన కథనం చూస్తే ఒళ్లు మండటమే కాదు. మరీ.. ఇంత పైత్యమా? అనిపించకమానదు. ఇటీవల మరణించిన విలక్షణ నటుడు ఓంపురి మరణంపై ఒక పాక్ ఛానల్ వండి.. వార్చినకథనం వింటే షాక్ తినటమే కాదు.. పాక్ ఛానళ్లు మరీ దరిద్రంగా ఆలోచిస్తాయా? అన్న భావన కలగటం ఖాయం.

ఓంపురి మరణానికి భారత ఫ్రధాని నరేంద్ర మోడీ..జాతీయ భద్రత సలహాదారు అజిత్ దోవల్ హస్తం ఉందంటూ ఒక కథనాన్ని వండేసి.. పాకిస్తానీయులపై వదిలేశారు. ఇలాంటి దరిద్రాన్ని పాక్ కు చెందిన బోల్ టీవీ అనే ఛానల్ ఒక అడ్డదిడ్డమైన కథనాన్ని అల్లేసింది. ఆ ఛానల్ ప్రసారం చేసే ‘‘ఐసే నహీ చలేగా’’ అనే హాస్యస్పద కథనంలో తమ ముతక హాస్యాన్ని ప్రదర్శించి నవ్వుల పాలయ్యారు.

ఓంపురికి ఒళ్లు తెలియనంతగా.. బలవంతంగా మద్యం తాగించి.. ఆయన ముఖం మీద దిండు వేసి నొక్కి చంపేశారటని.. ఆ పని చేసింది ఎవరోకాదని.. అజిత్ దోవల్ ప్రతినిధి అంటూ కథను వినిపించారు. ఇదంతా ఎందుకంటే.. పాక్ కళాకారులకు ఓంపురి మద్దతుగా మాట్లాడటమేనని సదరు ఛానల్ కథనం పేర్కొంది. ఓంపురిని తన వద్దకు రావాలని దోవల్ ఇటీవల ఫర్మానా జారీ చేశారని.. ఆయన వద్దకు వెళ్లిన ఓంపురిని బట్టలు విప్పదీసి మరీ చితక్కొట్టారని.. ఊరీ అమరజవాను నితిన్ యాదవ్ గ్రామానికి వెళ్లి సైనికులపై తాను చేసిన వ్యాఖ్యలపై సారీ చెప్పాలంటూ ఆదేశాలు జారీ చేసినట్లుగా పేర్కొంది. అంతేకాదు.. ఓంపురి మృతదేహంపై.. ఆయన్ను చంపిన వ్యక్తి ఆనవాళ్లు ఉన్నట్లుగా రిపోర్ట్ చేసిన సదరు టీవీ ఛానల్ కథనం చూస్తే.. వారి ఊహా శక్తికి మైండ్ బ్లాక్ అయిపోవాల్సిందే. మోడీ తర్వాత లక్ష్యం బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ అంటూ చెప్పేయటం కొసమెరుపుగా చెప్పక తప్పదు. మరీ ఇంత దిగజారిన స్థాయిలో కథనాలు వండేయటం పాక్ ఛానళ్లకు మాత్రమే సాధ్యమవుతాయేమో?

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *