పవన్ సభ వెనుక మరో కోణం, ఎన్నో అనుమానాలు

జనసేన పార్టీ అధ్యక్షులు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హఠాత్తుగా తిరుపతిలో ప్రత్యేక హోదా పైన సభ నిర్వహించి… జనసేనపై రాజకీయ చర్చకు తెరలేపారు. ఆ సభలో పవన్ ఎన్నో అంశాల పైన క్లారిటీ ఇచ్చారని చెప్పవచ్చు. హోదా విషయంలో తాను రెండున్నరేళ్ల పాటు ఎందుకు ఆగానో చెప్పారు. ఓ వైపు ప్రధాని మోడీ విదేశాల్లో తిరుగుతూ సత్సంబంధాల కోసం ప్రయత్నిస్తున్నారని, అలాగే మాట ఇచ్చిన బీజేపీ, ఏపీలో అధికారంలో ఉన్న టిడిపి తెస్తుందని భావించానని చెప్పారు.

తన పైన విమర్శలు చేసిన వారికి కూడా సరైన కౌంటర్ ఇచ్చారు. తాను ఏదైనా స్పష్టంగా మాట్లాడుతానని, ఇతర రాజకీయ నాయకుల్లా నోరు జారనని అభిప్రాయపడ్డారు. మాట మాట్లాడితే వెనక్కి తీసుకోలేమని, అందుకే ఆచితూచి మాట్లాడుతానని చెప్పారు. ప్రత్యేక హోదా కోసం తాను మూడంచెల ఉద్యమం చేస్తానని చెప్పారు. ఆయన చెప్పింది సుదీర్ఘ ఉద్యమం. వచ్చే ఎన్నికల వరకు ఇది సాగనుంది. ఇందుకోసం పవన్ ప్రణాళిక సిద్ధం చేసుకుంటున్నారని చెప్పవచ్చు. తాను ప్రశ్నిస్తానని చెప్పినట్లుగా.. హోదా పైన బీజేపీని వెంటాడుతానని ఆయన చెప్పారు.

ప్రత్యేక హోదా విషయమై పవన్ కళ్యాణ్ ప్రధాని మోడీ, కేంద్రమంత్రులు వెంకయ్య నాయుడు, అరుణ్ జైట్లీ, ఏపీ సీఎం చంద్రబాబు, ఏపీ ఎంపీలను, వైసిపి అధినేత వైయస్ జగన్ తదితరులందరినీ టార్గెట్ చేశారు. విభజన చేసిన కాంగ్రెస్ పార్టీ పైన దుమ్మెత్తి పోశారు.

ఇప్పటిదాకా నోరు మెదపదలేదు

పవన్ కళ్యాణ్ ఇప్పటి దాకా ప్రత్యేక హోదా గురించి మాట్లాడలేదని, హఠాత్తుగా పెదవి విప్పాడని అంటున్నారు. పారలమెంటు సమావేశాల్లో కేంద్రమంత్రులు తేల్చి చెప్పినప్పుడు మాట్లాడలేదని, పవన్ స్పందించాలని వివిధ నాయకులు డిమాండ్ చేసినప్పుడు మాట్లాడలేదని కొందరు అంటున్నారు. అయితే వాటికి తిరుపతి సభలో పవన్ సమాధానమిచ్చారు.

ఒక్కరోజులోనే సభకు అనుమతి

తిరుపతిలో సభ నిర్వహణ పైన పవన్ కళ్యాణ్‌కు ఒక్కరోజులోనే అనుమతి లభించడం పైన అనుమానాలు వ్యక్తమవుతున్నాయని కొందరు అభిప్రాయపడుతున్నారు. సాధారణంగా సభలు, సమావేశాలు నిర్వహించుకునే విషయంలో అనుమతించేందుకు పోలీసుల చుట్టు తిరగవలసి వస్తుందని అంటున్నారు. కానీ పవన్‌కు ఒక్కరోజులోనే అనుమతి లభించడం విశేషమంటున్నారు.

పవన్ కళ్యాణ్ ప్రత్యేక హోదా కోసం కాకినాడలో సెప్టెంబర్ 9న సభ నిర్వహిస్తానని చెప్పడం పైన కొన్ని పుకార్లు వినిపిస్తున్నాయి. కాపు రిజర్వేషన్లకు సంబంధించి ప్రభుత్వం నియమించిన కమిషన్‌కు గడువు సెప్టెంబర్ 7తో పూర్తవుతుంది. కమిషన్ విషయంలో కదలిక లేకుండే ముద్రగడ పద్మనాభం కార్యాచరణ ప్రకటించనున్నారు. ఈ నేపథ్యంలో అదే సమయంలో పవన్ కళ్యాణ్ సభను నిర్వహిస్తుండటంపై చర్చ సాగుతోంది. తనకు కులం రంగు అంటించవద్దని పవన్ హెచ్చరిక చేసిన విషయం తెలిసిందే.

మోడీని ఎందుకు కలవలేదు

ప్రధానిగా మోడీ బాధ్యతలు చేపట్టాక తాను కలవలేదని పవన్ కళ్యాణ్ చెప్పారు. పరిచయం ఉన్నప్పుడు .. ఆరు కోట్ల మంది ప్రజలతో ముడివడి ఉన్న అంశమైనప్పుడు ప్రత్యేకంగా పరిచయం ఉన్నప్పుడు కలిస్తే తప్పేమిటనే వాదనలు వినిపిస్తున్నాయి.

చంద్రబాబుపై విమర్శలేవీ..

ఎంపీల పైన కేంద్రమంత్రి అశోక్ గజపతి రాజు పైన ఘాటు వ్యాఖ్యలు చేసిన పవన్ కళ్యాణ్.. చంద్రబాబు పైన మాత్రం సానుకూలంగా కనిపించారని అంటున్నారు. కేంద్రంలో సుజనా చౌదరి, అశోక్ గజపతి రాజులు కొనసాగాలా వద్దా అనే విషయమై.. చంద్రబాబు నిర్ణయించే విషయమని, అలాంటప్పుడు ఆయనను ఎందుకు ప్రధానంగా టార్గెట్ చేయలేదని అంటున్నారు.

Videos

125 thoughts on “పవన్ సభ వెనుక మరో కోణం, ఎన్నో అనుమానాలు

Leave a Reply

Your email address will not be published.